
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ‘ఆరా’సంస్థతో సర్వే రిపోర్టు ఇప్పించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా సర్వే సంస్థ రిపోర్టు మార్చిందన్నారు. ఆరా సంస్థ చైర్మన్ తనతో వస్తే నిరూపిస్తానని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని, టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ అంతర్గత సర్వే ప్రకారం కాంగ్రెస్ 90 నుంచి 99 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారని వెల్లడించారు. అయినా కాంగ్రెస్ కేడర్ ఇలాంటి సర్వేలను నమ్మదని, వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆయన చెప్పిన వివరాలు అబద్ధం
మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ‘ఆరా’పోల్ స్ట్రాటజీస్ సంస్థ అధినేత ఆరా మస్తాన్ స్పందించారు. తమ సంస్థ సర్వే పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన వివరాలు అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ 38.88 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతంఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి ఓట్ల శాతం 41.71కి తగ్గిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 38.88 శాతానికి పడిపోయినా, అత్యధిక శాతం ప్రజల మద్దతున్న పార్టీగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌కు 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూఓట్ల శాతం తగ్గుతూ వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 23.71 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పారు.
2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల నుంచి పుంజుకుంటూ వచ్చిన బీజేపీకి 30.48 శాతం ఓట్లు లభిస్తాయన్నారు. ఇతరులకు 6.91 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి 119 నియోజకవర్గాల్లోని మూడో వంతు నియోజకవర్గాల్లో 2021 నవంబర్, ఈ ఏడాది మార్చి, ప్రస్తుత నెలలో సర్వేలు నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment