మూడోసారి.. మూడో తేదీ... ముక్కోణం! | After the formation of Telangana state this election is special | Sakshi
Sakshi News home page

మూడోసారి.. మూడో తేదీ... ముక్కోణం!

Published Wed, Oct 11 2023 4:48 AM | Last Updated on Wed, Oct 11 2023 6:57 PM

After the formation of Telangana state this election is special - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల ఫలితాలు మూడో తేదీనే రావడం.. అందునా ఈసారి ముక్కోణపు పోరు జరుగుతుండటం ‘ప్రత్యేకత’ను సంతరించుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి చూసినా ముక్కోణ పోటీలు మనకు తక్కువే. 1978, 2009లలో మినహా మూడు పార్టీల మధ్య ఎన్నికల పోరాటం జరగలేదు.

కాంగ్రెస్‌–జనతా పార్టీ, కాంగ్రెస్‌–కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌–తెలుగుదేశం పార్టీల మధ్యనే ఎన్నికల్లో పోటీ ఉండేది. అప్పుడో పార్టీ, ఇప్పుడో పార్టీ పోటీలోకి వచ్చినా ద్విముఖ పోటీలో చొరబడేంత స్థాయిలో ప్రభావం చూపకపోయేది. 1978లో మాత్రం ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతా పార్టీల మధ్య హోరాహోరీగా ముక్కోణపు పోటీ జరిగింది.

నిరుపేద వర్గాలు అండగా నిలవడంతో ఆ ఎన్నికల్లో ఇందిరమ్మ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ మూడో పక్షంగా నిలబడి 18 శాతం ఓట్లను తెచ్చుకున్నది. తెలంగాణ ప్రాంతంలో అయితే అంతకంటే తక్కువే వచ్చాయి. సరిగ్గా అలాంటి ముక్కోణం పోటీ మళ్లీ ఇప్పుడు జరగబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.  

ప్రజల ‘మూడ్‌’ ఏమిటో? 
ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నడుమ ఆసక్తికర పోటీ జరగనుంది. గత రెండు ఎన్నికల్లోనూ గట్టిగానే తలపడిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు తోడు ఈసారి బీజేపీ వచ్చిచేరింది. ఇప్పటికే పదేళ్లు అధికారంలో ఉన్నందున బీఆర్‌ఎస్‌పై ప్రజావ్యతిరేకత ఉందనేది ఒక అభిప్రాయం. అయితే ప్రభుత్వాన్ని ఓడించి తీరాలన్నంత వ్యతిరేకత మాత్రం కనిపించడం లేదన్నది క్షేత్రస్థాయి అంచనా. ఐదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, కేసీఆర్‌ నాయకత్వం, రేసు గుర్రాల్లాంటి కేటీఆర్, హరీశ్‌రావుల ప్రచార తోడ్పాటు వెరసి ముచ్చటగా మూడోసారీ తామే అధికారంలోకి వస్తామని గులాబీ దళం గట్టిగా నమ్ముతోంది.

ఇక కాంగ్రెస్‌ బలం పుంజుకుంటున్నట్లు కొందరు పరిశీలకులు అంచనా వేస్తుండగా ఆ పార్టీలోని వర్గ విభేదాలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చరిత్ర, కేసీఆర్‌కు దీటైన నేత లేకపోవడం బలహీనతలుగా కనిపిస్తున్నాయి. కానీ బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉపయోగçపడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు ఈసారి ప్రజలు పట్టం కడతారనే విశ్వాసంతో ముందుకెళుతున్నారు. 

‘మూడో’పార్టీనే కీలకమా? 
కొంతకాలం కింద బలపడినట్లు కనిపించిన బీజేపీ ఇప్పుడు బలహీనపడిందని, ప్రధాన పోటీదారు కాకపోవచ్చని సర్వే రాయుళ్లు చెబుతున్నారు. కానీ సంచలనాలకు మారుపేరైన బీజేపీ... తెలంగాణలో ఒక ‘ప్రత్యేక’వ్యూహంతో 35 స్థానాలపై బలంగా గురిపెట్టబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. కమలనాథుల ప్రయత్నాలు సఫలమైతే కచ్చితంగా త్రిశంకు సభ (హంగ్‌) ఏర్పడుతుంది. అప్పుడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరుసగా మూడు స్థానాల్లో ఉండవచ్చు. ఈ పరిస్థితి తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలకు తెరతీయవచ్చు.

కానీ చారిత్రకంగా స్పష్టమైన తీర్పులనే ఇచ్చే సంప్రదాయం తెలుగు ప్రజలకున్నది. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల క్వశ్చన్‌. ఈ మూడు పార్టీలు పోను ఉభయ కమ్యూనిస్టులు, టీజేఎస్, వైఎస్సార్‌టీపీ, బీఎస్పీ లాంటి పార్టీలు తెచ్చుకొనే ఓట్లు చాలా తక్కువ చోట్ల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయొచ్చని అంచనా. నంబర్‌ గేమ్‌ను కొంచెం అటుఇటుగా మార్చవచ్చనే అంచనాలున్నా ఫైనల్‌గా బీజేపీ సాధించే ఓట్లు, సీట్లు ఎన్నికల తుది ఫలితాలను శాసించవచ్చన్నది రాజకీయ వర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది.  

ఇందిరా.. ఎన్టీఆర్‌.. మీటింగ్‌ల మిద్దె..
ఈ ఇంటిని చూశారా! సూర్యాపేట జిల్లా కోదాడ నయానగర్‌లోని వెంకట్రామయ్య నివాసం ఇది. పాతతరం నాయకులందరికీ సుపరిచితమైన ఇల్లు. పట్టణ నడి»ొడ్డున ఉన్న ఈ ఇంటి పరిసరాలన్నీ ఆ సమయంలో వ్యవసాయ భూములుగా ఉండేవి. 1980 ప్రాంతంలో కోదాడలో ఏ పార్టీ మీటింగ్‌ జరిగినా సభావేదికగా ఈ ఇంటినే ఎంచుకునేవారు. ఎన్టీ రామారావు 1982లో తొలిసారి కోదాడకు వచ్చినప్పుడు ఈ ఇంటి మీద నుంచే ప్రసంగించారు. ఆ తర్వాత నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన చింతా చంద్రారెడ్డి.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీతో మీటింగ్‌ ఏర్పాటు చేయగా ఆమె కూడా ఇక్కడి నుంచే మాట్లాడారు.  మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ ఈ ఇంటినే వేదికగా చేసుకుని మీటింగ్‌లలో పాల్గొన్నారు.     – కోదాడ

గాసిప్‌టైమ్‌
తండ్రి కోసం కొడుకు త్యాగం 
కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి త్యాగం చేయడం కామన్‌... కానీ ఈసారి రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయాల్లో తండ్రి కోసం కొడుకు త్యాగం చేయాల్సి వస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా రాజకీయాలు చేసే ఓ మాజీ ఎంపీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు. రాజధాని నడి»ొడ్డున ఉండే ఓ నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. అయితే, అక్కడ గత ఎన్నికల్లో ఆ మాజీ ఎంపీ కుమారుడు పోటీ చేశారు. ఇప్పుడు ఆ టికెట్‌ కోసమే తండ్రి, కొడుకులు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే, ఇద్దరిలో ఎవరికి అన్నప్పుడు పాపం కొడుకే తండ్రి కోసం త్యాగం చేసేందుకు సిద్ధమయ్యాడట.

నువ్వు పోటీ చేస్తే నేనొద్దంటానా? అని తాను పోటీ నుంచి తప్పుకున్నాడంట. తండ్రి కోసం కొడుకు త్యాగం వృ««థా కాబోదనే అంచనాతోనే ఆయన పోటీ నుంచి విరమించుకున్నాడనే చర్చ జరుగుతోంది. తండ్రి గెలిచి పుసుక్కున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బలహీన వర్గాల కోటాలో తండ్రి మంత్రి అవుతాడనే నమ్మకంతోనే ఆయన విరమించుకున్నాడని, భవిష్యత్తు మీద గట్టి అంచనాతోనే స్వామికార్యం స్వకార్యం నెరవేర్చుకుంటున్నాడని గాం«దీభవన్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.  

బంగారు కడియాలు తెచ్చా.. సార్‌ 
అసెంబ్లీ టికెట్‌ అంటే ఈ సీజన్‌లో మామూలు ముచ్చట కాదు. టికెట్‌ వస్తే చాలు... అది కూడా ప్రధాన పార్టీ టికెట్‌ అంటే హాట్‌ కేకే. టికెట్‌ వచ్చిందంటేనే సగం ఎమ్మెల్యే అయినంత హ్యాపీ. మరి ఆ టికెట్‌ ఇచ్చేవాళ్లను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు లేకుండా ఉంటారా? అలాంటి వారుంటేనే కదా టికెట్ల కేటాయింపు సీజన్‌లో మాల్‌మసాలా వార్తలు బయటకు వచ్చేది. ఏం జరిగినా జరగకపోయినా రాజకీయ నాయకులు తమ మీద పడిన బురద కడుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రసన్నం చేసుకునే పాట్లలోనే ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మహిళా కాంగ్రెస్‌ ఆశావహురాలు కంగు తిన్నారట.

తనకు టికెట్‌ కచ్చితంగా వస్తుందన్న అంచనాతోనే విదేశాల నుంచి తెచ్చిన రెండు బంగారు కడియాలను ఢిల్లీలోని ఓ పెద్ద నాయకుడికి ఇవ్వబోయారట. ఇదేంటమ్మా.. అంటే ‘ఏదో నా తృప్తి సార్‌.. ఫలానా ఆయనకు ఇచ్చా.. ఇంకో ఆయనకు కూడా ఇచ్చాను’అంటూ ఇద్దరి ముగ్గురి పేర్లు చెప్పిందంట. అంతా విన్న ఆ ఢిల్లీ పెద్ద నాయకుడు ‘ఇలాంటివి పెట్టుకోకమ్మా... నీ ‘బంగారు’భవిష్యత్తుకు దెబ్బ పడుతుంది’అని చెప్పి పంపించేశాడట.  

మూడు సీట్ల ‘మహరాజ్‌’! 
వామపక్షాలతో పొత్తు ఓ నాయకుడికి అరుదైన ఖ్యాతిని తెచ్చిపెట్టబోతోందనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. వామపక్షాలు, కాంగ్రెస్‌ పొత్తు ఖరారైతే రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ నియోజకవర్గాన్ని పెద్ద కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వాల్సి వస్తుందని, అప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను పక్కనే ఉన్న మరో చోటకు పంపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా పంపిస్తే మాత్రం ఆయన ‘మూడు సీట్ల మహరాజ్‌’అనే కీర్తిని మూటగట్టుకోబోతున్నారనే టాక్‌ కూడా నడుస్తోంది.

గతంలోనే పొరుగు జిల్లా నుంచి ప్రస్తుతమున్న సీట్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు పొత్తు ముచ్చటలో మళ్లీ పక్కకు జరుగుతారని, అలా జరిగితే మాత్రం రికార్డేనని అంటున్నారు. గతంలో రెండు చోట్ల గెలిచిన ఆయన ఇక్కడ కూడా గెలిస్తే ఒకే పార్టీ తరఫున మూడు చోట్ల చట్టసభలకు ఎన్నికైన నేతగా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదని గాం«దీభవన్‌లో టాక్‌. మరి ఏమవుతుందో... ఆ మూడు సీట్ల మహరాజ్‌కు విజయమో... ‘వీర’ని్రష్కమణమో... చూద్దాం.! 

ఈ నెలాఖరు వరకు ఓటరు నమోదుకు అవకాశం 
‘‘దేవాన్ష్ కు అక్టోబరు 15వ తేదీతో 18 ఏళ్లు నిండుతాయి. కానీ, ఓటు నమోదు ప్రక్రియ సెపె్టంబరులోనే ముగిసింది. దీంతో అతను ఓటేయాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందేనా? అంటే అవసరం లేదని అంటోంది ఎన్నికల సంఘం.’’సెపె్టంబరులో ఓటు దరఖాస్తు చేసుకోలేని వారందరికీ ఇంకా నమోదుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నవంబర్‌ 30న శాసనసభ ఎన్నికలు జరగనుండగా ఓటరు నమోదుకు అక్టోబరు 31వరకు మరో అవకాశం చేసుకునే వెసులుబాటు కల్పించింది. 

తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు  
ఓటరుగా నమోదు కావాలనుకునేవారు తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం–6 తీసుకుని అందులో వివరాలను పొందుపరిచి అక్కడే కార్యాలయంలో సమర్పించాలి. ఆధార్‌ కార్డు, ఇంటి చిరునామాను సూచించే కరెంట్‌ బిల్లు, ఇతరత్రా ఏదేనీ ఆధారాన్ని జత చేయాల్సి  ఉంటుంది. బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో విచారించి ఓటరుగా నమోదు చేస్తారు. 

 ఓటరు నమోదుకు వివిధ మార్గాలు 
క్యాంపెయిన్‌కు వెళ్లలేనివారు అరచేతిలోనే ఓటరుగా నమోదు కావచ్చు.http:///voters.eci.gov.in (హెచ్‌టీటీపీ://వీవోటీఈఆర్‌ఎస్‌.ఈసీఐ.జీవోవీ.ఐఎన్‌) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సర్వీస్‌ పోర్టల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి. అందులో మొబైల్‌ నంబర్‌తో సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం లాగిన్‌ అవ్వాలి. ఆన్‌లైన్‌లో కొత్త ఓటుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

యాప్‌తో కూడా 
బీఎల్వో వద్దకు వెళ్లలేని వారు.. వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో మీ వద్ద ఉన్న మొబైల్‌లో ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దానిపై క్లిక్‌ చేయగానే పోర్టల్‌ ఓపెన్‌ అవుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో పేరుందా.. లేదా చూసుకునే అవకాశం కూడా కల్పించారు. 
 – సాక్షిప్రతినిధి, కరీంనగర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement