రైతులను ఆదుకునే దాకా ఉద్యమిస్తాం | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకునే దాకా ఉద్యమిస్తాం

Published Sun, Apr 7 2024 3:51 AM

BRS Rythu Diksha across the state - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ రైతు దీక్షలు.. 

వరికి బోనస్, పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ 

సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీశ్‌రావు, మిగతాచోట్ల ఇతర నేతల దీక్ష 

జనం కాంగ్రెస్‌ హామీలను నమ్మి మోసపోయి.. గోసపడుతున్నరు: కేటీఆర్‌ 

మిషన్‌ భగీరథను నిర్వహించలేక మంచినీటి కరువు తెచ్చారని మండిపాటు 

అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ నేతలకు కళ్లు నెత్తికెక్కాయి: హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌/ సిరిసిల్ల/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్‌: కరువు పరిస్థితులతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు దీక్షలు’ చేపట్టింది. పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపు మేరకు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం  11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ దీక్షలు నిర్వహించారు. రైతుల ధాన్యంకు ప్రతీ క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లించాలని.. అకాల వర్షాలు, వడగండ్లు, ఎండలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.25వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు  బీఆర్‌ఎస్‌ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు  సిరిసిల్లలో, మాజీ మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డిలో, జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో, గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ జిల్లా కేద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూరు క్రాస్‌రోడ్డు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షల్లో పాల్గొన్నారు.

ఇక చెన్నూరులో మాజీ విప్‌ బాల్క సుమన్‌ ఆధ్వర్యంలో రైతు దీక్షకు ఏర్పాట్లు చేయగా.. అనుమతిలేదటూ పోలీసులు టెంట్‌ను తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో  జరిగిన దీక్షల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ హామీలను నమ్మి మోసపోయారు: కేటీఆర్‌ 
వరికి రూ.500 బోనస్, నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు డిమాండ్‌ చేశారు. పరిహారం చెల్లించడానికి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని, తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్‌ఎస్‌ రైతుదీక్షలో కేటీఆర్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఇప్పుడు గోస పడుతున్నారని వ్యాఖ్యానించారు.

రైతుబంధు అందక, రుణమాఫీ కాక, పంటలు ఎండి రైతులు.. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రాక నేతన్నలు, దళితబంధు అందక దళితులు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయని పేర్కొన్నారు. సరిగా వర్షాలు పడక కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 300 పిల్లర్లు ఉంటే.. రెండు, మూడు పిల్లర్లలో సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టునే విఫలమంటూ కాంగ్రెస్‌ యాగీ చేస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ కేసీఆర్‌ను బద్నాం చేసి, రాజకీయ లబ్ధి పొందేందుకే లక్షల ఎకరాల పంట పొలాలను ఎండబెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన మేరకు రైతుభరోసా రూ.15వేలు, రూ.4వేల పెన్షన్, రూ.2లక్షల రుణమాఫీ పొందిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలని.. లేకుంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. సర్కారుకు మిషన్‌ భగీరథ నిర్వహించడం చేతగాక.. తాగునీటి కొరత వచ్చిందని ఆరోపించారు. తమ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను కాంగ్రెస్‌ సర్కారు ఇచ్చినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక బీజేపీ నేతలు రుణమాఫీ గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని విమర్శించారు. 

రైతులకు కన్నీళ్లే మిగిలాయి: హరీశ్‌రావు 
వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలో రెండు వందల మందికిపైగా రైతులు చనిపోయారని.. మంత్రులు కనీస పరామర్శకు రావడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో, జహీరాబాద్‌లో జరిగిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేక రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని, కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్‌ పా ర్టీకి.. తుక్కుగూడ సభలో మేనిఫెస్టోను ప్రకటించే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు.

రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్, కౌలురైతులకు రూ.15 వేల ఆర్థిక సాయం వంటి హామీల అమలు ఏదని నిలదీశారు. రైతుబంధు డబ్బు జమ కాలేదనే వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారని.. చెప్పులతో కొట్టించుకునేందుకే ప్రజ లు కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో కరెంట్, కాలువల్లో నీళ్లున్నాయని.. కాంగ్రెస్‌ రాగానే ఏమైపోయాయని హరీశ్‌రావు నిలదీశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 నగదు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌ నేత లు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తే చీపురు మడతపెట్టి తరమాలన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకునేందుకు మంత్రి ఉత్తమ్‌కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు కేసీఆర్‌ జిల్లాల పర్యటన చేపడితేనే.. రాష్ట్ర బీజేపీ నేతలు కళ్లు తెరిచి, దీక్షలు చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. 

Advertisement
Advertisement