సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీశాయి. ఫలితాలు పరేషాన్ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రభంజనం సృష్టిస్తే ..ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. ఓ వైపు టీఆర్‌ఎస్ గాలి వీచినా ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ సిట్టింగ్ శాసన సభ్యుల్లో ఆరు మంది ఘోరపరాజయాన్ని మూటగట్టుకోవడం స్వయం కృతాపరాధమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార దర్పంతో అభ్యర్థులు వ్యవహరించిన తీరు, పార్టీ అంతర్గత కుమ్ములాటలతో పాటు ఇతర ఆంశాలు జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి దోహదపడ్డాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఆయా సిట్టింగ్ అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణాలను ఓ సారి విశ్లేషిస్తే...
జగ్గారెడ్డి.. జిత్తులు
సంగారెడ్డి .. ఈ పేరు వినగానే రాష్ట్రంలో ఎవరికైనా ఠక్కున గుర్తుకొచ్చే పేరు జగ్గారెడ్డి. విలక్షణ వ్యవహార శైలీతో గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలిచిన జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో ఘోరపరాభవాన్ని ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆ వ్యవహార శైలే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2004లో టీఆర్‌ఎస్, 2009లో కాంగ్రెస్ తరఫున వరుసగా రెండుసార్లు నెగ్గిన జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో 29,814 భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయానికి టీ-కాంగ్రెస్ నేతలందరూ తెలంగాణవాదాన్ని అందుపుచ్చుకున్నారు. వీరికి భిన్నంగా జగ్గారెడ్డి సమైక్యవాదాన్ని వినిపిస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి వీర వీధేయుడిగా వ్యవహరించారు. కిరణ్‌పై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహతో సహా ఇతర టీ-కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టుతూ జగ్గారెడ్డి వార్తల్లో ఉండేవారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా .. అందరినీ తోసిరాజని పరిపాలనా వ్యవహారల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయడంతో కథ అడ్డం తిరిగింది. ఈ అనూహ్య పరిణామంతో జగ్గారెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసిన క్షణం నుంచి జగ్గారెడ్డి పతనం ఆరంభమైంది. టీ-కాంగ్రెస్ నేతల్లో ఆయన ఒంటరిగా మిగిలారు. రెండేళ్ల కింద సంగారెడ్డిలో జరిగిన అల్లర్ల ఘటన అనంతరం జగ్గారెడ్డి వ్యవహార శైలిలో వచ్చిన వ్యూహాత్మక మార్పు సైతం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌పై ప్రభావం చూపింది.
దామెదరను కలవాలంటేనే డర్
మరో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వ్యవహారశైలే ఆయన్ను ఓటమి పాలు చేసిందని పలువురు భావిస్తున్నారు. ఆయన 1989, 2004, 2009 ఎన్నికల్లో అందోల్ స్థానం నుంచి మూడుసార్లు గెలుపొందారు. పార్టీ అధిష్టానం ఆశీర్వాదంతో కిరణ్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయనలో అధికార దర్పం పెరిగిపోయిందని విమర్శలున్నాయి. తనను కలవడానికి వచ్చే అధికార, అనధికారులు, సామాన్య ప్రజలతో ఆయన పద్ధతి సరిగ్గా ఉండేది కాదని ఆరోపణలున్నాయి. ఇక ఆయన తన పదవి కాలంలో సింహభాగం నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారు.
హైదరాబాద్- ఢిల్లీల మధ్య చక్కర్లు కొడుతూ ఎక్కువ సమయం గడిపారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ ఆయన సమీప బంధువుకు ఇప్పించగా ఆ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలున్నాయి. 2009 ఎన్నికల్లో జోగిపేట ప్రజలు తనకు ఓట్లు వేయలేదని కారణంతో పట్టణంలో ఆయన అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీంతో పోలింగ్ రోజు స్థానిక ఓటర్లు మధ్యాహ్నం 3 గంటల వరకు ఓట్లు వేయకుండా నిరసన తెలిపారు. వీరిలో కొందరు తమకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. టీఆర్‌ఎస్ గాలితో పాటు తాను చేసుకున్న స్వీయ పొరపాట్లే దామోదరను నట్టేట ముంచాయని పలువురు పేర్కొంటున్నారు.
విభేదాలతోనే సునీత ఓటమి
నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన సునీతా లక్ష్మారెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుమల మదన్ రెడ్డి చేతిలో 14,217 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. తన పదవి కాలంలో ఎక్కువ సమయాన్ని ప్రజల్లో తిరగడానికి కేటాయించినప్పటికీ, ఆమె ఓడిపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ప్రధానంగా ఆమె అన్నీ వర్గాల ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణ ఉంది. అదే విధంగా తన చుట్టూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని పనులను వారికే ఇచ్చేవారని విమర్శలున్నాయి. నియోజకవర్గంలోని కొంత మంది కాంగ్రెస్ నాయకులు లోపాయికారిగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయా నేతల స్వగ్రామాల్లో టీఆర్‌ఎస్ మెజారిటీ ఓట్లను సాధించింది. నియోజకవర్గంలో బలంగా ఉన్న సీపీఐ ముఖ్య నేతలు కాంగ్రెస్‌తో పొత్తును విభేదిస్తూ టీఆర్‌ఎస్‌లో చేరడం కూడా సునీతా రెడ్డి ఓటమికి దారితీసిందని చెప్పవచ్చు.
‘చెరుకు’....మాటలు కరుకు
దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకు మత్యంరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కృషి చేసినా ఓడిపోడానికి ఆయన నోటి దురుసే కారణమైంది. ఈ వ్యవహార శైలి నచ్చకే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వర్గాలుగా చీలిపోయింది. ఎన్నికలకు ముందు మిగిలిన మూడు వర్గాలు ఏకమై ముత్యంరెడ్డిని ఓడించేందుకు శతవిధాల ప్రయత్నించాయి. దీనికి తోడు టీఆర్‌ఎస్ గాలివీచడంతో ముత్యం రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి సొలిపేట లింగారెడ్డి చేతిలో 37,899 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు.
పూర్వం దొమ్మాట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 1989-99 మధ్యకాలంలో వరుసగా మూడుసార్లు నెగ్గారు. 2004 ఎన్నికలు, 2008 ఉప ఎన్నికల్లో రెండుసార్లు టీఆర్‌ఎస్ అభ్యర్థి సొలిపేట చేతిలో ఓడిపోయారు. ఆయన 2009లో దొమ్మాట రద్దయి దుబ్బాక నియోజకవర్గం ఆవిర్భవించాకా కాంగ్రెస్‌లో చేరి ఆ ఎన్నికల్లో మళ్లీ సొలిపేటపై 2,649 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారని చర్చ జరుగుతోంది.
నందీశ్వర్ వర్సెస్ డీసీసీ
పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాలను కలుపుకుని 2009లో పటాన్‌చెరు నియోజకవర్గం కొత్తగా ఆవిర్భవించింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ టీడీపీ అభ్యర్థి సపాన్‌దేవ్‌పై నెగ్గారు. తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి సపన్‌దేవ్‌పై గెలుపొందగా సిట్టింగ్ కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ మూడో స్థానంలో నిలిచారు. డీసీసీ అధ్యక్షుడు కె భూపాల్ రెడ్డి వర్గంతో విభేదాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే ఆయన్ను మూడోస్థానంలో దిగజార్చిందని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
నర్సారెడ్డి ..కబ్జాలు?
ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 వేల ఓట్లను సాధించి గజ్వేల్ నియోజకవర్గంలో అగ్రస్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ సిట్టింగ్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి 33,998 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి ఇచ్చిన పోటీని సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా నర్సారెడ్డి ఇవ్వలేకపోయారు.
నర్సారెడ్డి దురుస వైఖరితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం ఆయన విస్మరించడంతో వారంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ, వక్ఫ్ భూ కబ్జాలను ప్రోత్సహించారని నర్సారెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఉద్యమించాయి. పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలను సైతం ఎన్నాడు పట్టించుకోలేదని ఆయనపై ఆరోపణలున్నాయి.