రానున్నది వైఎస్సార్‌సీపీ శకం
పాడేరురూరల్(జి.మాడుగుల), న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించి టీడీపీ, కాంగ్రెస్ , బీజేపీలకు తగిన గుణపాఠం చెబుతుందని ఆ పార్టీ అరుకు లోక్‌సభ నియోజక వర్గ సమన్వయకర్త కొత్తపల్లి గీత అన్నారు. జి. మాడుగుల వారపు సంతలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంతబయలు వారపుసంత నుంచి జి. మాడుగుల మెయిన్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ ర్యాలీ జై జగన్ నినాదాలతో హోరెత్తింది. అనంతరం జి. మాడుగుల మూడు రోడ్ల జంక్ష న్ వద్ద జరిగిన సభలో గీత మాట్లాడుతూ ప్రజల్లో ఎనలేని ఆదరాభిమానాలు చూరగొంటున్న తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేక రాష్ట్రాన్ని నిలువునా చీల్చారన్నారు. అయితే ఈ దారుణానికి మద్దతిచ్చిన బీజేపీతో తెలుగుదేశం పొత్తుపెట్టుకోవడం నీచమైన చర్య అని అన్నారు.
అయినప్పటికీ వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీలకు లేదన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోబాటు మరిన్ని ప్రయోజనాలు చేకూరాలంటే వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్య్సరాస బాలరాజు, ఎస్వీవి రమణమూర్తి, వండ్లాబు మత్య్సకొండబాబు, కించె నూకన్నదొర, చుక్కల వెంక టరమణ, ఐసరం హనుమంతరావు, మత్స్యరాస వెంకటగంగరాజు, వంజరి సీతారాం నాయుడు పాల్గొన్నారు.