kottapalli geetha
-
బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత
సాక్షి, న్యూఢిల్లీ : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె మంగళవారం కాషాయం కండువా కప్పుకున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేతృత్వంలో ఆమె కమలం గూటికి చేరారు. అంతేకాకుండా గత ఏడాది తాను స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. -
అరకు ఎంపీకి బెదిరింపు మెయిల్స్
సాక్షి, విశాఖపట్నం: ' నేను ఏసీబీ అధికారిని.. మీ వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. అందుకు సంబంధించిన వివరాల ఫైల్ ఏసీబీ కార్యాలయంలో ఉంది. వివరాలు కావాలంటే నా ఎస్బీఐ అకౌంట్లో డబ్బులు వేయండి' అంటూ ఓ ఆగంతకుడు విశాఖ జ్లిలా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు మెయిల్స్ పంపాడు. బెదిరింపు మొయిల్స్తో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖ కమిషనర్ ఈ సంఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బులు అడుగుతూ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని, తనకే కాక చాలామంది ఎంపీలకు డబ్బుల కోసం బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని చెప్పారు. ఫేక్ కాల్స్, మెయిల్స్ పై బ్యాంకులు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల తన కుమారుడి అకౌంటు నుంచి రూ. 12 వేలు మాయమయ్యాయని.. ఎనిమిది నెలలైనా బ్యాంకుల నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. సైబర్ క్రైమ్ అంశాలపై పార్లమెంటు సమావేశాలలో లేవనెత్తుతానన్నారు. సైబర్ క్రైమ్ చట్టాన్ని పటిష్టం చేయాలని పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతానని గీత చెప్పారు. సైబర్ క్రైమ్ ఘటనలను కేంద్ర హోం మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్టు తెలిపారు. -
రాజ్‌నాథ్‌ను కలిసిన ఎంపీ కొత్తపల్లి గీత
న్యూఢిల్లీ: అరకు ఎంపీ కొత్తపల్లి గీత శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న తమ భూమి విషయంలో నెలకొన్న వివాదంపై హోంమంత్రికి వివరించినట్టు ఆమె తెలిపారు. ఆ భూమికి సంబంధించి తమకు అనుకూలంగా హైకోర్టు రెండు ఆర్డర్లు ఇచ్చిందని గీత పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాదారాలను ప్రభుత్వానికి అందించినట్టు ఆమె తెలిపారు. అయితే రెవెన్యూ శాఖ తమ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని కొత్తపల్లి గీత ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని హోం మంత్రిని కోరినట్టు ఆమె తెలిపారు. దీనిపై త్వరలోనే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్టు కొత్తపల్లి గీత పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గంలో అత్యంత విలువైన భూములను దక్కించుకునేందుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పీఆర్కే రావు అడ్డదారులు తొక్కి, ఇందుకోసం తప్పుడు పత్రాలు సృష్టించారు. రిజిస్ట్రార్‌ను ప్రలోభపెట్టి వాటిని ధ్రువీకరింపజేసుకున్నారు. ఎనిమిది కంపెనీలు పెట్టి భూములను వాటి పేరున బదలాయించుకున్నారు. నకిలీ సేల్డీడ్లు హామీగా పెట్టి రుణం తీసుకుని బ్యాంకునూ మోసం చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు అమ్మారు. రాయదుర్గంలోని సర్వే నంబర్ 83లో ఉన్న 99.07 ఎకరాల భూములు తమవేనని కొత్తపల్లి గీత చేస్తున్న వాదన అవాస్తవమని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఈ నెల 12న రెవెన్యూ శాఖ నుంచి సేకరించిన పహాణీలో ఆ భూములు.. దాని యజమానులు రుక్ముద్దీన్ అహ్మద్, ఆయన కుటుంబ సభ్యుల పేరిటే ఉన్నాయని తేలింది. ఇక పార్లమెంట్ సభ్యురాలిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న కొత్తపల్లి గీత పేరిట నిబంధనలకు విరుద్ధంగా రెండు పాన్‌కార్డులు ఉన్న విషయం బయటపడింది. -
ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీటు
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు అభియోగాలు రూ. 42 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపణ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ.42 కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నాటి మేనేజింగ్ డెరైక్టర్, తన భర్త అయిన పి.రామకోటేశ్వరరావుతో కలసి గీత ఈ మోసానికి పాల్పడినట్లు చార్జిషీట్లో పేర్కొంది. హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వీరు తప్పుడు ధ్రువపత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించింది. అనంతరం నిందితులు రుణ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించి బ్యాంకును మోసం చేశారని, ఫలితంగా బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్కే గౌర్ చెప్పారు. బ్యాంకు అధికారులు కేకే అరవిందక్షణ్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెడ్ ఆఫీస్‌లోని నాటి జనరల్ మేనేజర్), బీకే జయప్రకాశం(అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్)లతో నిందితులు కుమ్మక్కై ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారంటూ వీరి పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్లో పొందుపర్చింది. నిందితులపై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర) రెడ్‌విత్ 420 (చీటింగ్), 468 (ఫోర్జరీ), ఐపీసీ 471 కింద, పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) కింద అభియోగాలు నమోదు చేసినట్లు గౌర్ తెలిపారు. వీరికి ఫోర్జరీ పత్రాలు అందించడంలో సాయం చేసిన ఎస్.రాజ్‌కుమార్ అనే ప్రైవేటు వ్యక్తిని, విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీని కూడా చార్జిషీట్లో చేర్చారు. లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీపై నకిలీ పత్రాలు సృష్టించేందుకు నిందితులు ప్రైవేటు వ్యక్తితో కుమ్మక్కయ్యారని సీబీఐ పేర్కొంది. కాగా, ఈ చార్జిషీట్ గురించి తనకు తెలియదని గీత పీటీఐకి ఫోన్లో చెప్పారు. నిధుల స్వాహా కేసు సీబీఐకి.. అనంతపురం అర్బన్: అనంతపురం అర్డీఓగా ఉంటూ రూ.40 లక్షల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన కేసులో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన కొత్తపల్లి గీత కేసు విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అనంతపురం ఆర్డీఓగా గీత 2003 నుంచి 2004 వరకు పని చేశారు. అప్పట్లో ప్రభుత్వ నిధులు రూ.40 లక్షలను తన భర్త ఖాతాలోకి మళ్లించారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి కలెక్టర్ వైవీ అనూరాధ 2004 ఫిబ్రవరి 19న గీతను సస్పెండ్ చేశారు. తర్వాత ప్రభుత్వం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ కేసును విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. -
ఎంపీ కొత్తపల్లి గీతను నిలదీసిన వైఎస్సార్సీపీ నేతలు
విజయనగరం: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, పార్టీ వల్ల గెలవలేదని చెప్పడం ఎంతవరకు న్యాయం’’ అంటూ వైఎస్సార్సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీతను పార్టీ నేతలు, కార్యకర్తలు నిలదీశారు. ఈ ఘటన అరకు లోక్‌సభ పరిధిలోని విజయనగరం జిల్లా కురుపాంలో శుక్రవారం జరిగింది. అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షా సమావేశానికి గీత హాజరయ్యారు. దీనికి అధికారులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు ఎస్.పద్మావతి, ఎంపీపీ, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఎంపీ గీత వ్యవహార శైలిపై నేతలు, కార్యకర్తలు నిలదీశారు. దీంతో గీత దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎలాంటి బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఎంపీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొత్తపల్లి గీత కులంపై వివాదం: హైకోర్టు విచారణ
హైదరాబాద్ : అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరపనుంది. అరకు లోక్‌సభ నియోజక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి గీత పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందుపరిచారంటూ ఎన్నికల సమయంలోనే అరకు నుంచి టీడీపీ తరపున లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణి పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో తదుపరి విచారణను కోర్టు గురువారం చేపట్టనుంది. ఇదే విషయంపై గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ కొత్తపల్లి గీతపై తాను ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం వాస్తవమేనన్నారు. ఆమె ఎస్టీ కాదని తాము ఫిర్యాదు చేశామని, కొత్తపల్లి గీత లేదా ఆమె తరపు న్యాయవాది గురువారం కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు చెప్పారు. -
ఎంపీ కొత్తపల్లి గీతకు అరెస్ట్ వారెంట్
హైదరాబాద్: విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతాకు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత... విశ్వేశ్వరయ్య ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదు. దీంతో చెక్కు అందుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే కేసు విచారణ నిమిత్తం కొత్తపల్లి గీత కోర్టుకు హాజరు కాకపోవటంతో కోర్టు వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. -
రాజీనామా చేసి.. సొంతబలంతో గెలువు
రంపచోడవరం: వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లతో గెలిచిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత రెండు నెలలు తిరక్కముందే పార్టీకి వెన్నుపోటు పొడవడం ఆమె నైజానికి నిదర్శనమని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మండిపడ్డారు. దమ్ముంటే పార్టీకి, పదవికి రాజీనామా చేసి సొంత బలంతో గెలవాలని సవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)పై గీత పెట్టిన అక్రమకేసును నిరసిస్తూ, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రంపచోడవరంలో ర్యాలీ, రాస్తారోకో జరిగాయి. పార్టీ శ్రేణులు, ఏజెన్సీలోని ఏడు మండలాలకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గిరిజనులంతా వెఎస్సార్ సీపీకి పట్టం కడితే గెలిచిన గీత ఇప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడవడం ఓటర్లకు ద్రోహం చేసినట్టేనన్నారు. ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచీ టీడీపీ పంచన చేరిన గీత గిరిజనులు బాగోగులను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఆమెకు తగిన బుద్ధి చెప్పేందుకు గిరిజనులు సిద్ధంగా ఉన్నారని, నియోజకవర్గంలో పర్యటిస్తే వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ఆమెకు అర్థమవుతుందని అన్నారు. ‘ఎంపీ గీత నిరంకుశ వైఖరి నశించాలి, అనంతబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి’ అని నినాదాలు చేస్తూ ఐటీడీఏ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఎమ్మెల్యే రాజేశ్వరిని, మరికొందరిని అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆందోళనకారులు రంపచోడవరం ఏఎస్పీ విజయరావుకు వినతిపత్రం అందజేశారు. ఎంపీ గీత అనంతబాబుపై విశాఖలో నిరాధారమైన ఫిర్యాదు చేశారని, ఆయన ఎదుగుదలను చూడలేక అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. అసలు కారణం గీత వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోవడానికి మార్గం సుగమం చేసుకోవడమేనన్నారు. వైఎస్సార్ సీపీని రోడ్డుపైకి లాగేందుకు వ్యూహాత్మకంగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేసిన ఏసీపీ అనంతబాబును అరెస్టు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీలు పత్తిగుళ్ల భారతి, సత్తి సత్యనారాయరెడ్డి, మట్టా రాణి, పల్లాల రమణమ్మ, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, పండా జయలక్ష్మి, కారం వెంకటలక్ష్మి, కుండ్ల సీతామహాలక్ష్మి, పార్టీ మండలం కన్వీనర్లు మంగరౌతు వీరబాబు, నండూరి గంగాధర్, రాయపల్లి సత్యనారాయణ, సింగిరెడ్డి రామకృష్ణ, కళ్లెం సూర్యప్రభాకర్‌రావు, రాజు, సర్పంచ్‌లు కారం సావిత్రి, పండా రామకృష్ణ, గుర్తేటి లక్ష్మి, శారప బాపిరాజు దొర, సుంకం అబ్బాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్వార్థంతోనే గీత తప్పుడు ఆరోపణలు
*వైఎస్సార్ సీపీలో మహిళలకు ప్రత్యేక గౌరవం *పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టీకరణ చింతపల్లి: స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలో తనకు తగిన ప్రాధాన్యమివ్వడం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. ఆమె మంగళవారం చింతపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గిరిజనులపై ఎంతో ఆప్యాయత చూపిస్తారన్నారు. కొత్తపల్లి గీతకు మొదటి నుంచి పార్టీలో ప్రత్యేక స్థానం కల్పించి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. గెలిపించిన పార్టీపైనే ఆమె తప్పుడు విమర్శలు చేయటం తగదన్నారు. గిరిజన ఎమ్మెల్యేలంతా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్నే కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీలో ఇమడలేకపోతే పదవులకు రాజీనామా చేసి బయటికి వెళ్లిపోవాలి తప్పా, అసత్య ప్రచారాలు చేస్తే గిరిజనులు క్షమించరని హెచ్చరించారు. పార్టీ విప్‌ను ధిక్కరించినందువల్లే చింతపల్లి ఎంపీపీ సహా ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు పడిందన్నారు. ప్రతి ఒక్కరు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పని చేయాలని ఆమె స్పష్టం చేశారు. -
టీడీపీలో రాజుకుంటున్న చిచ్చు
-
‘గీత’ దాటి మాట్లాడొద్దు!
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మండిపాటు సాక్షి ప్రతినిధులు-కాకినాడ, విజయనగరం, పాడేరు : వైఎస్సార్ సీపీ టికెట్‌పై అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియకుండా సీఎం చంద్రబాబుతో సమావేశం కావటంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి, మంత్రులను కలిశానంటున్న గీత అధికార దాహంతోనే టీడీపీ పంచన చేరే ఏర్పాట్లలో ఉన్నారని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ఆమె చెప్పేదే నిజమైతే ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకూ గిరిజనులకు సంబంధించి ఎన్ని అంశాలపై స్పందించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి ఏజెన్సీ నుంచి శ్రీకాకుళం వరకు ఏ ఒక్కరికీ కనీసం ఆమె ముఖం కూడా తెలియకున్నా విద్యావంతురాలనే కారణంతో నమ్మి టికెట్టు ఇచ్చిన పార్టీని దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు రంపచోడవరం, పాడేరు తదితర చోట్ల విలేకరులతో మాట్లాడుతూ గీత తీరును తీవ్రంగా ఖండించారు. మోసం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి(రంపచోడవరం), అనంత ఉదయభాస్కర్(తూర్పుగోదావరి జిల్లా యువజన విభాగం కన్వీనర్) విమర్శించారు. చంద్రబాబుని గీత కలవడం తప్పేనని కురుపాంఎమ్మెల్యే పి.పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజనులే గుణపాఠం చెబుతారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దుయ్యబట్టారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
'ఆయన' నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారు
విశాఖ : సబ్బం హరిపై అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి కొత్తపల్లి గీత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనంతో సంబంధం లేని నేత సబ్బం హరి అని అన్నారు. ఫలానా పార్టీకి ఓటెయండంటూ సబ్బం హరి వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని ఆమె అన్నారు. ఆయనపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపల్లి గీత డిమాండ్ చేశారు. సబ్బం హరి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని కొత్తపల్లి గీతా అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంత తప్పదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. -
రానున్నది వైఎస్సార్సీపీ శకం
పాడేరురూరల్(జి.మాడుగుల), న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించి టీడీపీ, కాంగ్రెస్ , బీజేపీలకు తగిన గుణపాఠం చెబుతుందని ఆ పార్టీ అరుకు లోక్‌సభ నియోజక వర్గ సమన్వయకర్త కొత్తపల్లి గీత అన్నారు. జి. మాడుగుల వారపు సంతలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంతబయలు వారపుసంత నుంచి జి. మాడుగుల మెయిన్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ జై జగన్ నినాదాలతో హోరెత్తింది. అనంతరం జి. మాడుగుల మూడు రోడ్ల జంక్ష న్ వద్ద జరిగిన సభలో గీత మాట్లాడుతూ ప్రజల్లో ఎనలేని ఆదరాభిమానాలు చూరగొంటున్న తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనలేక రాష్ట్రాన్ని నిలువునా చీల్చారన్నారు. అయితే ఈ దారుణానికి మద్దతిచ్చిన బీజేపీతో తెలుగుదేశం పొత్తుపెట్టుకోవడం నీచమైన చర్య అని అన్నారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీలకు లేదన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోబాటు మరిన్ని ప్రయోజనాలు చేకూరాలంటే వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్య్సరాస బాలరాజు, ఎస్వీవి రమణమూర్తి, వండ్లాబు మత్య్సకొండబాబు, కించె నూకన్నదొర, చుక్కల వెంక టరమణ, ఐసరం హనుమంతరావు, మత్స్యరాస వెంకటగంగరాజు, వంజరి సీతారాం నాయుడు పాల్గొన్నారు.