ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీటు | cbi files chargesheet on mp kottapalli geetha in fraud case | Sakshi
Sakshi News home page

ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీటు

Published Tue, Jun 30 2015 6:41 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీటు

ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీటు

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు అభియోగాలు
రూ. 42 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపణ
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ.42 కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నాటి మేనేజింగ్ డెరైక్టర్, తన భర్త అయిన పి.రామకోటేశ్వరరావుతో కలసి గీత ఈ మోసానికి పాల్పడినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది. హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వీరు తప్పుడు ధ్రువపత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించింది.
 
 అనంతరం నిందితులు రుణ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించి బ్యాంకును మోసం చేశారని, ఫలితంగా బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్‌కే గౌర్ చెప్పారు. బ్యాంకు అధికారులు కేకే అరవిందక్షణ్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెడ్ ఆఫీస్‌లోని నాటి జనరల్ మేనేజర్), బీకే జయప్రకాశం(అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్)లతో నిందితులు కుమ్మక్కై ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారంటూ వీరి పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్‌లో పొందుపర్చింది. నిందితులపై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర) రెడ్‌విత్ 420 (చీటింగ్), 468 (ఫోర్జరీ), ఐపీసీ 471 కింద, పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) కింద అభియోగాలు నమోదు చేసినట్లు గౌర్ తెలిపారు. వీరికి ఫోర్జరీ పత్రాలు అందించడంలో సాయం చేసిన ఎస్.రాజ్‌కుమార్ అనే ప్రైవేటు వ్యక్తిని, విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీని కూడా చార్జిషీట్‌లో చేర్చారు. లిటిగేషన్‌లో ఉన్న ప్రాపర్టీపై నకిలీ పత్రాలు సృష్టించేందుకు నిందితులు ప్రైవేటు వ్యక్తితో కుమ్మక్కయ్యారని సీబీఐ పేర్కొంది. కాగా, ఈ చార్జిషీట్ గురించి తనకు తెలియదని గీత పీటీఐకి ఫోన్‌లో చెప్పారు.
 
 నిధుల స్వాహా కేసు సీబీఐకి..
 అనంతపురం అర్బన్: అనంతపురం అర్‌డీఓగా ఉంటూ రూ.40 లక్షల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన కేసులో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన కొత్తపల్లి గీత కేసు విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అనంతపురం ఆర్‌డీఓగా గీత 2003 నుంచి 2004 వరకు పని చేశారు. అప్పట్లో ప్రభుత్వ నిధులు రూ.40 లక్షలను తన భర్త ఖాతాలోకి మళ్లించారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి కలెక్టర్ వైవీ అనూరాధ 2004 ఫిబ్రవరి 19న గీతను సస్పెండ్ చేశారు. తర్వాత ప్రభుత్వం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ కేసును విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement