కొత్తపల్లి గీత కులంపై వివాదం: హైకోర్టు విచారణ
హైదరాబాద్ : అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ జరపనుంది. అరకు లోక్సభ నియోజక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి గీత పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందుపరిచారంటూ ఎన్నికల సమయంలోనే అరకు నుంచి టీడీపీ తరపున లోక్సభ స్థానానికి పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణి పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో తదుపరి విచారణను కోర్టు గురువారం చేపట్టనుంది.
ఇదే విషయంపై గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ కొత్తపల్లి గీతపై తాను ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం వాస్తవమేనన్నారు. ఆమె ఎస్టీ కాదని తాము ఫిర్యాదు చేశామని, కొత్తపల్లి గీత లేదా ఆమె తరపు న్యాయవాది గురువారం కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు చెప్పారు.