
రాజీనామా చేసి.. సొంతబలంతో గెలువు
వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లతో గెలిచిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత రెండు నెలలు తిరక్కముందే పార్టీకి వెన్నుపోటు పొడవడం ఆమె నైజానికి నిదర్శనమని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మండిపడ్డారు. దమ్ముంటే పార్టీకి, పదవికి రాజీనామా చేసి సొంత బలంతో గెలవాలని సవాల్ విసిరారు.
రంపచోడవరం: వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లతో గెలిచిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత రెండు నెలలు తిరక్కముందే పార్టీకి వెన్నుపోటు పొడవడం ఆమె నైజానికి నిదర్శనమని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మండిపడ్డారు. దమ్ముంటే పార్టీకి, పదవికి రాజీనామా చేసి సొంత బలంతో గెలవాలని సవాల్ విసిరారు.
వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)పై గీత పెట్టిన అక్రమకేసును నిరసిస్తూ, ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రంపచోడవరంలో ర్యాలీ, రాస్తారోకో జరిగాయి. పార్టీ శ్రేణులు, ఏజెన్సీలోని ఏడు మండలాలకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గిరిజనులంతా వెఎస్సార్ సీపీకి పట్టం కడితే గెలిచిన గీత ఇప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడవడం ఓటర్లకు ద్రోహం చేసినట్టేనన్నారు.
ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచీ టీడీపీ పంచన చేరిన గీత గిరిజనులు బాగోగులను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఆమెకు తగిన బుద్ధి చెప్పేందుకు గిరిజనులు సిద్ధంగా ఉన్నారని, నియోజకవర్గంలో పర్యటిస్తే వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ఆమెకు అర్థమవుతుందని అన్నారు. ‘ఎంపీ గీత నిరంకుశ వైఖరి నశించాలి, అనంతబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి’ అని నినాదాలు చేస్తూ ఐటీడీఏ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఎమ్మెల్యే రాజేశ్వరిని, మరికొందరిని అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆందోళనకారులు రంపచోడవరం ఏఎస్పీ విజయరావుకు వినతిపత్రం అందజేశారు.
ఎంపీ గీత అనంతబాబుపై విశాఖలో నిరాధారమైన ఫిర్యాదు చేశారని, ఆయన ఎదుగుదలను చూడలేక అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. అసలు కారణం గీత వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోవడానికి మార్గం సుగమం చేసుకోవడమేనన్నారు. వైఎస్సార్ సీపీని రోడ్డుపైకి లాగేందుకు వ్యూహాత్మకంగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేసిన ఏసీపీ అనంతబాబును అరెస్టు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
జెడ్పీటీసీలు పత్తిగుళ్ల భారతి, సత్తి సత్యనారాయరెడ్డి, మట్టా రాణి, పల్లాల రమణమ్మ, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, పండా జయలక్ష్మి, కారం వెంకటలక్ష్మి, కుండ్ల సీతామహాలక్ష్మి, పార్టీ మండలం కన్వీనర్‌లు మంగరౌతు వీరబాబు, నండూరి గంగాధర్, రాయపల్లి సత్యనారాయణ, సింగిరెడ్డి రామకృష్ణ, కళ్లెం సూర్యప్రభాకర్‌రావు, రాజు, సర్పంచ్‌లు కారం సావిత్రి, పండా రామకృష్ణ, గుర్తేటి లక్ష్మి, శారప బాపిరాజు దొర, సుంకం అబ్బాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.