సర్కారు మాదే..అమాత్యులం మేమే !
గెలుపు ధీమాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్
- మంత్రి పదవులపై నేతల ఆశలు
- సీనియారిటీ ప్రాతిపదికన అంచనాలు
- ఫలితాలకు ముందే నాయకుల ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎవరు గెలుస్తారు... ఎవరు ఓడిపోతారు... టీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయి... కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉందా... ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది... టీఆర్‌ఎస్ సర్కారా... కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందా... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే చర్చలు. పెళ్లిళ్లు, చావులు, పుట్టిన రోజులు, గృహప్రవేశాలు... ఏ చిన్న ఫంక్షన్‌లో అయినా ఇవే ముచ్చట్లు. హోటళ్లు, చాయ్ బండి ఎక్కడైనా ఎన్నికల ఫలితాల గురించే మాటలు.
సాధారణ ఎన్నికల ఫలితాలకు మరో ఐదు రోజులు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు టెన్షన్ పెరుగుతుంటే... ఓటర్లలో ఫలితాల తీరుపై విశ్లేషణలు జోరందుకుంటున్నాయి. అక్కడ ఆయన గెలుస్తారు అంటే... అవకాశమే లేదు.... అంతా వ్యతిరేక గాలే అని మరొకరు. గెలిచేవారు ఎవరు అనేది తేలేది ఈ నెల 16న అయినా... ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉందని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సీనియర్ నేతల్లో పెద్ద పదవులపై ఆశలు పెరుగుతున్నాయి.
ఎమ్మెల్యేగా గెలవడంతోనే ఆగకుండా మంత్రి పదవుల విషయంపైనా దృష్టి పెడుతున్నారు. తెలంగాణలో ఏర్పడే తొలి ప్రభుత్వంలో అమాత్యులుగా ఉండాలనే ఆశలతో ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ నేతల్లో ఈ ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో ఎవరు బయటపడకుండా ఈ వ్యవహరాలపై దృష్టి పెడుతున్నారు.
గులాబీలో జోరు...
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ స్థానాల విషయంలో తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని టీఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వీరు అంటున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్న మాటలను ప్రస్తావిస్తూ... తెలంగాణలో తొలి ప్రభుత్వం తమదేనని గట్టిగా చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సీట్లు వస్తాయని... జిల్లాలోని 10 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని గులాబీ నేతలు ధీమాతో ఉన్నారు.
ఇలా తొలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న ఆ పార్టీ అభ్యర్థుల్లో పలువురు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ను ఒక్కొక్కరు వేర్వేరుగా కలిసి వస్తున్నారు. గులాబీ నేతల ప్రకటనలకు తగినట్లు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు ఏర్పడి... జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల్లో సీనియర్ నేతలు విజయం సాధిస్తే మంత్రి పదవులు ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగానే ఉండనుంది.
సీనియారిటీ ప్రకారం మాత్రం ఎన్నికల్లో గెలుపు అవకాశాలను బట్టి తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, అజ్మీరా చందులాల్, కొండా సురేఖ పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. వీరందరూ సీనియర్లు కావ డం గమనార్హం. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎన్నికల సరళిని బట్టి రాజయ్య గెలుస్తారని ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. మిగిలిన వారు తుది ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిన పరిస్థితిలో ఉన్నట్లు గులాబీ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘హస్తంలో సీనియర్లు...
తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకే మెజారిటీ సీట్లు వస్తాయని... కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదేనని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలుప్రకటిస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. టీఆర్‌ఎస్ గెలుస్తుందనేది ప్రచారమేనని, ఫలితాలు తమకే అనుకూలంగా ఉం టాయని అంటున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యే స్థానాలు దక్కితే జిల్లాలో కాంగ్రెస్‌కు గణనీయంగా సీట్లు వస్తాయని పేర్కొంటున్నారు.
కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లాలో ఎవరికి మంత్రులు పదవులు వస్తాయనేది ఆసక్తికరంగా ఉండనుంది. జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఎన్నికల ఫలితాలపై టెన్షన్ ఎక్కువగా ఉంది. తొలిసారి పోటీ చేస్తున్న వారి కంటే ఎక్కువగా సీనియర్ నేతలే ఈ విషయంలో ఆందోళన పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో గెలిచే వారు ఎవరు అనేది తేలేందుకు ఇంకా సమయం ఉన్నా... కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే.. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు కీలక పదవి వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి డీఎస్.రెడ్యానాయక్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని ఈయన సన్నిహితులు ధీమాతో ఉన్నారు. మాజీ మంత్రి అయిన రెడ్యానాయక్‌కు... కాంగ్రెస్ సర్కారు ఏర్పడితే మళ్లీ మంచి స్థానం ఉంటుందని అంటున్నారు.
బస్వరాజు సారయ్య మళ్లీ గెలుస్తారని ఆయ న సన్నిహితులు అంటున్నారు. సారయ్య విజయం సాధిస్తే.. కాంగ్రెస్ సర్కారు ఏర్పడితే మరోసారి ఆయనకు అవకాశం వస్తుందని వీరు ఆశిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా...అభ్యర్థుల గెలుపోటముల తర్వాతే మంత్రి పదవులపై స్పష్టత రానుంది