టీఆర్‌ఎస్ 191..కాంగ్రెస్ 176..
టీఆర్‌ఎస్ 191..కాంగ్రెస్ 176..
Published Thu, May 15 2014 2:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
జెడ్పీటీసీలను కైవసం చేసుకున్న రెండు పార్టీలు
{పాదేశిక ఎన్నికల ఫలితాలను వెల్లడించిన ఈసీ
ఎంపీటీసీల్లో టీఆర్‌ఎస్‌కు 1,860, కాంగ్రెస్‌కు 2,351,
టీడీపీకి 1,061, స్వతంత్రులు 522, బీజేపీకి 275
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 6,525 ఎంపీటీసీ స్థానాల్లో 6,467 ఫలితాలు వెల్లడించగా అందులో కాంగ్రెస్ 2,351, టీఆర్‌ఎస్ 1,860, టీడీపీ 1,061, బీజేపీ 275, సీపీఎం 145, సీపీఐ 80, ఎంఐఎం 23, స్వతంత్రులు 522 స్థానాల్లో గెలుపొందారు. అలాగే మొత్తం 443 జెడ్పీటీసీ స్థానాలకుగాను.. రెండుచోట్ల ఎన్నికలు జరగలేదు. మరో స్థానంలో ఫలితం ఇంకా రాలేదు. మిగతా 440 స్థానాల్లో టీఆర్‌ఎస్ 191, కాంగ్రెస్ 176, టీడీపీ 53, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 6, స్వతంత్రులు 5 స్థానాల్లో నెగ్గగా.. ఇతర పార్టీలు మిగిలిన చోట్ల గెలుపొందాయి. బుధవారమిక్కడ ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో కలసి కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 6, 11 తేదీల్లో నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి మే 13వ తేదీ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇది బుధవారం ఉదయం(14వతేదీ) వరకు కొనసాగిందని తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో మొత్తం ఫలితాలు వెల్లడించామన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడిలో వర్షాల కారణంగా బ్యాలెట్ పత్రాలు తడిసిపోగా.. వాటిని ఆరబెట్టి లెక్కింపు కొనసాగించామని, అక్కడ గెలిచిన అభ్యర్థి 1,500 ఓట్లకుపైగా తేడా ఉన్నందున, ఆ ఫలితాలను ప్రకటించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. బ్యాలెట్‌కు చెదలుపట్టిన నెల్లూరు జిల్లా తూర్పు ఎర్రబెల్లిలో మూడు పోలింగ్ కేంద్రాలు, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లోని ఎల్లూరులో రెండు స్థానాలు, అలాగే నిజామాబాద్ జిల్లాలో బండపల్లి, మైలారం ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 18న పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లాల వారీగా వివిధ పార్టీలు గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వివరాలను నవీన్ మిట్టల్ వెల్లడించారు.
కిరణ్ ప్రభుత్వంపై ధ్వజం: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి... కిరణ్ ప్రభుత్వంపై పరోక్షంగా మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో పరిషత్ ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ తీవ్ర జాప్యం కావడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వాలని పదేపదే కోరినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి పాలన వచ్చిన తర్వాతే.. స్థానిక సంస్థలకు అధికారులు త్వరితగతిన రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించారని చెప్పారు. అధికార యంత్రాంగం రిజర్వేషన్లు అందించిన వెంటనే న్యాయపరమైన అంశాలను పరిశీలించి, వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని వివరించారు.
Advertisement
Advertisement