గులాబీ నవ్వింది
చాంపియన్ కేసీఆరే
- తేల్చి చెప్పిన తెలంగాణ ప్రజలు
- ఉద్యమ పార్టీకే పట్టం.. టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ
- చేతికి వాతలు పెట్టిన జనం.. కాంగ్రెస్‌కు ఘోర పరాభవం
- సైకిల్‌కు పంక్చర్.. మోడీ హవాకూ బ్రేక్
- టీడీపీతో జతకట్టిన బీజేపీకి తప్పని ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది మేమేనన్న కాంగ్రెస్‌ను ఆదరించలేదు. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన టీడీపీని తిరస్కరించారు. తెలంగాణకు మద్దతిచ్చినా టీడీపీతో అంటకాగిన పాపానికి బీజేపీనీ వద్దన్నారు. దశాబ్ద కాలంగా అలుపెరుగని పోరాటం చేసిన టీఆర్‌ఎస్‌ను అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈ మేరకు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఉద్యమాల గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడింది. కొత్త రాష్ర్టంలో తొలి ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్‌ఎస్ పూర్తి మెజారిటీ సాధించింది. ఆ పార్టీ అధినేత కేసీఆరే అసలు సిసలైన తెలంగాణ చాంపియన్‌గా అవతరించారు.
ఉద్యమ పార్టీకే జనం పట్టం కట్టారు. విభజన పేరుతో నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ఆటలాడుకున్న కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారు. టీఆర్‌ఎస్ దెబ్బకు విలవిల్లాడిన అధికార పార్టీ కనీసం ఇరవై సీట్లను కూడా దాటలేక చతికిలపడింది. గులాబీ దండు ప్రభంజనానికి కాంగ్రెస్ ప్రముఖులంతా బొక్కబోర్లాపడ్డారు. చివరకు ముఖ్యమంత్రి అభ్యర్థులమని ప్రచారం చేసుకున్న నాయకులు సైతం దారుణంగా ఓటమిపాలయ్యారు.
తెలంగాణలో మాదే అధికారమంటూ ప్రగల్భాలు పలికిన సైకిల్‌ను సైతం మూలన పడేశారు. తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రపడిన టీడీపీని, దాంతో జతకట్టిన బీజేపీని పక్కనపెట్టేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవా కొనసాగినప్పటికీ తెలంగాణలో మాత్రం అదేమీ పనిచేయలేదు. కమల వికాసం కనిపించలేదు.
కేసీఆర్ మాటే మంత్రమైంది
తెలంగాణలో కేసీఆర్ మాటే మంత్రమైంది. స్వయం పాలన కోసం పోరాడిన టీఆర్‌ఎస్ పక్షానే ప్రజలు నిలబడతారని ఆయన చెప్పిందే నిజమైంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కూడా కాదని టీఆర్‌ఎస్‌ను జనం ఆశీర్వదించారు. 13 ఏళ్లుగా జనంలోనే ఉంటూ ఉద్యమాలు చేసిన గులాబీ దళానికే పట్టం కట్టారు. ఈ విషయంలో పూర్తి క్రెడిట్ మాత్రం కేసీఆర్‌దే. ఈ పుష్కర కాలంలో టీఆర్‌ఎస్ ఎదుర్కొన్న ఒడిదుడుకులు అన్నీ ఇన్నీ కావు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని ప్రతికూల పవనాలు వీచినా మొక్కవోని దీక్షతో పార్టీని నడిపించిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా తన గుప్పిట్లో ఉంచుకోవడంలో సఫలీకృతులయ్యారు.
నిజమే..! మోడీ లేదు గీడీ లేదు!!
దేశమంతటా మోడీ పవనాలు వీచినా... కేసీఆర్ మాత్రం ‘మోడీ లేదు గీడీ లేదు. తెలంగాణ ద్రోహి నరేంద్ర మోడీ’ అంటూ చేసిన ప్రచారాన్ని జనం నిజం చేశారు. బిడ్డకు పురుడు పోసి తల్లిని చంపిన విధంగా రాష్ట్రాన్ని విభజించారంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి చేటు తెచ్చాయి. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడంలోనూ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అదే సమయంలో బీజేపీ, టీడీపీ తరఫున ప్రచారం చేసిన సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ను సైతం తేలికగా తీసిపారేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఫలితం దక్కింది.
ఎజెండా మొదలు అభ్యర్థుల ఎంపిక దాకా..
ఈసారి కేసీఆర్ వ్యవహార శైలి గత ఎన్నికలకు భిన్నంగా ఉంది. పార్టీ ఎజెండా రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో కేసీఆర్ రచించిన వ్యూహం ఫలించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌కు ఎజెండా లేదనుకున్న తరుణంలో తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో కేసీఆర్ రూపొందించిన ఎన్నికల ప్రణాళిక ప్రజల్లో చర్చనీయాంశమైంది. రుణ మాఫీ, పేదలందరికీ రెండు పడకగదులతో ఇల్లు, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక సైతం ఈసారి కేసీఆర్ సహజ శైలికి భిన్నంగా జరిగింది. ఎక్కడా రాజీపడకుండా గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించారు. అలాంటి నేతలు ఏ పార్టీల్లో ఉన్నా తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు.
ప్రత్యర్థుల గాలి తీసిన కేసీఆర్
తన బలమే కాదు, ఎదుటి వారి బలహీనతలను క్యాష్ చేసుకోవడంలోనే అసలైన రాజకీయం ఇమిడి ఉంది. సరిగ్గా ఇదే పనిచేశారు గులాబీ అధినేత. తన వాక్చాతుర్యంతో ప్రజల మనసు దోచుకున్న కేసీఆర్.. అదే సమయంలో ప్రత్యర్థుల గాలి తీయడంలోనూ ముందు నిలిచారు. కాంగ్రెస్‌లోని అంతర్గత కలహాలు, నాయకత్వ లేమిని ఎత్తిచూపడంలో... టీడీపీని తెలంగాణ ద్రోహుల పార్టీగా చిత్రీకరించడంలో, బీజేపీకి ఓట్లు పడకుండా చేయడంలో విజయం సాధించారు. అంతిమంగా అసాధారణ ఫలితాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తిరుగులేని విజేతగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు.