మోసానికి మరో రూపం కేసీఆర్:జైరాం రమేశ్
- 30 తర్వాత ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం
- 25 ఏళ్ల కిందటి డొక్కు కారు అంబాసిడర్
- సైకిల్‌కు పంక్చర్ చేయడం ఖాయం
- కేంద్ర మంత్రి జైరాం రమేశ్
గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధికారం కోసం కలలుగంటున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 30వ తేదీ తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితం కాకతప్పదని కేంద్రమంత్రి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. బుధవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జైరాంరమేశ్ మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు కేసీఆర్ మారుపేరుగా నిలిచారని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటించిన తర్వాత టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందే 2000లో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వనందువల్లే కేసీఆర్‌కు తెలంగాణ విషయం గుర్తుకు వచ్చిందని విమర్శించారు.
2000లకు ముందు జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో కేసీఆర్ పాత్ర లేదని చెప్పారు. మాయమాటలతో ప్రజలను ఇంకా ఎంతో కాలం నమ్మించలేరని చెప్పారు. అవకాశం వస్తే.. ఎన్‌డీఏతో జతకట్టడానికి కూడా కేసీఆర్ వెనుకాడరని ఆరోపించారు. ‘అంబాసిడర్ కారు 25 ఏళ్ల కిందటి మోడల్, ఇప్పుడు మార్కెట్‌లోకి ఎన్నో కొత్త మోడళ్లు వచ్చాయి.. ప్రజలు డొక్కు అంబాసిడర్ కారు గుర్తును తిరస్కరించమే కాకుండా, సైకిల్‌కు పంక్చర్ చేయడం ఖాయమని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే నరేంద్ర మోడీకి వేసినట్లేనని పేర్కొన్నారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదని, నరేంద్ర చంద్రబాబు నాయుడన్నారు. టీడీపీ-బీజేపీలు రెండు మోసాల పార్టీలేనన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేశ్ ‘తెలంగాణ ఇచ్చింది..తెచ్చింది కాంగ్రెస్’, నర్సారెడ్డి గారూ తదితర పదాలను తెలుగులోకి మాట్లాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రాజు మాట్లాడుతూ గజ్వేల్‌లో జరుగుతున్న ఎన్నికలను విశ్వాసానికి, విశ్వాస ఘాతుకానికి మధ్య జరుగుతున్నవిగా అభివర్ణించారు.