చీరి చింతకు కడ్తరు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఫిరాయిస్తె ఊకుంటమా? ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మద్దతిస్తమంటె చీరి చింతకు కడ్తరు. తమాషాగా ఉన్నదా?’ అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ప్రజా తీర్పు కోరాక, ఫలితం వచ్చేదాకా హూందాగా ఉండాలని అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ‘టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్నరని, టచ్‌లో ఉన్నరని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అంటున్నడు. ఇలాంటి పిచ్చిపిచ్చి ప్రయత్నాలు మానుకోవాలె. టీఆర్‌ఎస్ నిప్పు లాంటి పార్టీ. మమ్ముల ముట్టుకుంటె కాలిపోతరు. మాడి మసై, దహించుకపోతరు.
అయినా కాంగ్రెస్‌కు 23 నుంచి 35 సీట్లే వస్తయని ఎన్నికలకు ముందు చెప్పిన. కానీ 30 లోపే వస్తయని అన్నీ సమగ్రంగా పరిశీలించి, అధ్యయనం చేసినంక తేలింది. పొన్నాల పగటి కలలు కంటున్నడు. బిత్తిరి గత్తిరై పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నడు. రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తె విజ్ఞత అనిపించుకుంటదా?’’ అంటూ మండిపడ్డారు. పొన్నాల పని అయిపోయిందన్నారు. టీఆర్‌ఎస్‌కు 60 సీట్లు దాటి 90 దాకా వచ్చినా ఆశ్చర్యం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అవసరమూ లేకుండా టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, అందులో ఈషణ్మాత్రం కూడా అనుమానం అవసరం లేదని అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ మెజారిటీకి దగ్గరగా సీట్లొచ్చే అవకాశమే లేదు. టీఆర్‌ఎస్ చరిత్రలోనే లేని విధంగా, ‘మీకే ఓట్లేశాం’ అని జంటనగరాల్లోనూ చాలామంది చెప్తున్నరు. ఎవరితోనూ సంప్రదింపులు జరపాల్సిన ఖర్మ, అవసరం మాకు లేవు. క్యాంపులు, బోంపులు ఏమీ ఉండవు. బహిరంగంగా, బాజప్తా ఉంటం. మేం అధికారంలోకి రావొద్దని కొందరు పిచ్చి రాతలు రాస్తున్నరు. దక్షిణ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని అంటున్నరు.
కానీ మాకు రంగారెడ్డి జిల్లాలోనూ మెజారిటీ సీట్లొస్తయి. ఖమ్మంలో కూడా బోణీ ఉంటది. నాలుగు సీట్లలో గట్టి పోటీ ఉంది. టీఆర్‌ఎస్ ఒంటరిగానే చాలా సీట్లతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ఇలాంటి సమయంలో కూడా ఫిరాయింపులుంటయనుకుంట పొన్నాల దిగజారి మాట్లాడుతున్నడు. రాజకీయాల్లో హూందాతనం ఉండాలి. పొన్నాల చేస్తున్నది రాజకీయాలా, బ్రోకర్ పనా? పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తరా? రాజకీయాల్లో నైతిక విలువలుండాలె. ఫిరాయింపులను ప్రోత్సహించడానికి సిగ్గు లేదా అని పొన్నాలను మీడియా నిలదీయాలె. చెంప చెళ్లుమనిపించాలి’ అన్నారు.