కొత్త ఓటర్ల మనోగతం....మార్పురావాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు లక్షల మంది యువ ఓటర్లు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1.27 కోట్ల మంది ఓటర్లున్న ఢి ల్లీలో ఇంత భారీగా యువ ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం.
‘ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతి ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీశాయి. అందుకే ఈ సారైనా ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలి’ అని అన్నాడు మొదటిసారి ఓటేసిన ఉత్తర ఢిల్లీలోని ముఖర్జీనగర్‌కు చెందిన విద్యార్థి సమర్థ్ టాండన్. ‘నాకు ఓటుపై అంత ఆసక్తి ఉండేది కాదు.
అందుకే ఓటు గురించి ఎప్పుడూ అంతగా బాధ పడలేదు. ఓటు వేయకుండా అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు నాకు లేదని తెలుసుకున్నాను. ఇప్పుడు మొట్టమొదటిసారి ఓటేశాను’ అంటోంది 30 ఏళ్ల స్మృతి బోస్. ‘బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ కనిపించినా నిజానికి బీజేపీ, రెండేళ్ల కిందటి ఆమ్‌ఆద్మీ పార్టే మధ్యే అసలు పోటీ. మోడీ అనేక వాగ్దానాలు చేశాడు. అతనికి ఓసారి అవకాశం ఇవ్వాలని బీజేపీకి ఓటు వేశాను.
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అభిమానం ఉంది కానీ, ఆ పార్టీకి ఇంకా అనుభవం కావాలి’ అని నోయిడాకు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ సార్థక్ జగ్గియా అన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని 11,763 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడుగంటలకు మొదలైన సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఉదయం కొంత మందకొడిగానే సాగి నా మధ్యాహ్నానానికి పుంజుకుని 64 శాతం పోలింగ్ నమోదై రికార్డు సృష్టించింది.
భద్రత, ధరల నియంత్రణకే ఓటన్న మహిళలు
మహిళల రక్షణ, ధరల నియంత్రణ, సుస్థిరమైన పాలన ఢిల్లీలోని మహిళా ఓటర్లను పోలింగ్ కేంద్రాలవైపు నడిపించింది. ఎర్రటి ఎండలో సైతం అన్ని కుల, మత, వర్గాలకతీతంగా మహిళలు ఓటు వేయడానికి నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బారు లు తీరారు. తన కుటుంబంతోపాటు అన్ని ఎన్నికల్లో తాను ఓటేస్తున్నానని, అవినీతి రహిత, సుస్థిరపాలన కోరుకుంటున్నానన్నారు చాందినీచౌక్ నియోజకవర్గంలో ఓటు వేసిన సామాజిక కార్యకర్త వర్షాగోయెల్. తూర్పు ఢిల్లీలోనూ మిహ ళలు ఓటు వేయడానికి ఉత్సాహం చూపించారు.
తూర్పు ఢిల్లీ, ఓఖ్లా, జామి యా నగర్, బాట్లా హౌజ్ ప్రాంతాల్లో ముస్లిం మహిళలు అధికంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. హిందూ, ముస్లింలను సమానంగా చూసే పార్టీలను తాము కోరుకుంటున్నామని వారు ముక్తకంఠంతో తెలిపారు. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారి ముఖాల్లో ఉత్సాహం తొణికిసలాడింది. ఉద్యోగం, ఉపాధిఅవకాశాలు, మహిళభద్రత, ఉత్తమ ఆర్థిక విధానాలు, మతసామరస్యం పాటించే పార్టీలకే తమ ఓటన్నారు.
రాబోయే ప్రభుత్వం ఢిల్లీ యూని వర్సిటీలో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ కల్పిస్తుందని ఆశిస్తున్నామంటున్నారు విద్యార్థులు. మంచి నీటి సౌకర్యం లేకపోవడం, అపరిశుభ్రత, నేరాల పెరుగుదలకు ఎప్పుడూ ప్రభుత్వాన్ని నిందించే తమకు... తమ సమస్యలు తీర్చే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశం మొట్టమొదటిసారి వచ్చిందని, దాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటున్నామని తెలి పారు. ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిం దని, ఏసమయంలోనైనా మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే ప్రభుత్వాన్ని తాము కోరుకుంటున్నామన్నారు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతులు.