తొలిసారి ఎదురుగాలి
చేవెళ్ల, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పట్లోళ్ల కుంటుంబానికి తొలిసారి ప్రజల నుంచి ఎదురుగాలి వీచింది. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో, 1999 నుంచి 2014వరకు కాంగ్రెస్ పార్టీలో అన్నీ తామై నడిపిన ఆ కుంటుబానికి నేడు ప్రాతినిథ్యం కరువైంది. 30 ఏళ్లుగా ఆదరిస్తూ వచ్చిన ప్రజల నుంచి మొదటిసారి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.
ఒక కుటుంబం నుంచి ఒకేసీటు అనే నినాదాన్ని ఏఐసీసీ అమలుచేయడంతో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లాలో ఆధిపత్యం చలాయించిన మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తన కుమారుడు కార్తీక్‌రెడ్డి కోసం పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కార్తీక్‌రెడ్డికి కేటాయించింది. అయితే కార్తిక్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 26,685 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు.
దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించారు. 1989, 1994 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరినా ప్రజలు ఆదరించారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సతీమణి సబితారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2004లో సైతం ఆమె విజయం సాధించారు. ఇలా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, సబితారెడ్డి రెండు సార్లు గెలిచారు. 2009 వరకు పట్లోళ్ల కుటుంబ ఆధిపత్యం కొనసాగింది. ఆ ఏడాది నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీకి రిజర్‌వ కావటంతో సబితారెడ్డి మహేశ్వరం జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
నిరాశలో కార్యకర్తలు..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేయాలన్న ఉద్దేశంతో నాలుగైదేళ్లుగా క్షేత్ర స్థాయిలో కార్తిక్‌రెడ్డి పనిచేశారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌ను కాపాడుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ నవనిర్మాణ పాదయాత్ర పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ వద్దగల ఆరెమైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల మీదుగా తాండూరు వరకు 101 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. దీనికి విశేష స్పందన రావడంతో ఎంపీ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారని భావించారు. రాహుల్ దూతలు కూడా ఇదే విషయాన్ని అధిష్టానానికి వివరించారు. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో పోటీ నెలకొన్నప్పటికి కార్తిక్‌రెడ్డి అధిష్టానం నుంచి టికెట్ సాధించగలిగారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు.
అనూహ్యంగా కార్తిక్‌రెడ్డి కంటే తెరాస అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చే వెళ్లతో పాటు నవాబుపేట, శంకర్‌పల్లి, షాబాద్, మొయినాబాద్ మండ లాల్లో ఏ ఒక్క చోటా కార్తిక్‌రెడ్డికి ఆధిక్యం రాలేదు. అన్ని మండలాల్లోనూ వెనుకబడి పోవటం ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అంతర్మథనంలో పడిపోయారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో లోక్‌సభకు మొత్తం 1,61,971 ఓట్లు పోలవగా అందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యధికంగా 79,781 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 53,096 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా సబితాఇంద్రారెడ్డి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.