p.sabitha indra reddy
-
తొలిసారి ఎదురుగాలి
చేవెళ్ల, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పట్లోళ్ల కుంటుంబానికి తొలిసారి ప్రజల నుంచి ఎదురుగాలి వీచింది. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో, 1999 నుంచి 2014వరకు కాంగ్రెస్ పార్టీలో అన్నీ తామై నడిపిన ఆ కుంటుబానికి నేడు ప్రాతినిథ్యం కరువైంది. 30 ఏళ్లుగా ఆదరిస్తూ వచ్చిన ప్రజల నుంచి మొదటిసారి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒక కుటుంబం నుంచి ఒకేసీటు అనే నినాదాన్ని ఏఐసీసీ అమలుచేయడంతో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లాలో ఆధిపత్యం చలాయించిన మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తన కుమారుడు కార్తీక్‌రెడ్డి కోసం పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కార్తీక్‌రెడ్డికి కేటాయించింది. అయితే కార్తిక్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 26,685 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించారు. 1989, 1994 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరినా ప్రజలు ఆదరించారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సతీమణి సబితారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2004లో సైతం ఆమె విజయం సాధించారు. ఇలా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, సబితారెడ్డి రెండు సార్లు గెలిచారు. 2009 వరకు పట్లోళ్ల కుటుంబ ఆధిపత్యం కొనసాగింది. ఆ ఏడాది నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీకి రిజర్వ కావటంతో సబితారెడ్డి మహేశ్వరం జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నిరాశలో కార్యకర్తలు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేయాలన్న ఉద్దేశంతో నాలుగైదేళ్లుగా క్షేత్ర స్థాయిలో కార్తిక్‌రెడ్డి పనిచేశారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌ను కాపాడుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ నవనిర్మాణ పాదయాత్ర పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ వద్దగల ఆరెమైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల మీదుగా తాండూరు వరకు 101 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. దీనికి విశేష స్పందన రావడంతో ఎంపీ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారని భావించారు. రాహుల్ దూతలు కూడా ఇదే విషయాన్ని అధిష్టానానికి వివరించారు. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో పోటీ నెలకొన్నప్పటికి కార్తిక్‌రెడ్డి అధిష్టానం నుంచి టికెట్ సాధించగలిగారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు. అనూహ్యంగా కార్తిక్‌రెడ్డి కంటే తెరాస అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చే వెళ్లతో పాటు నవాబుపేట, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండ లాల్లో ఏ ఒక్క చోటా కార్తిక్‌రెడ్డికి ఆధిక్యం రాలేదు. అన్ని మండలాల్లోనూ వెనుకబడి పోవటం ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అంతర్మథనంలో పడిపోయారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో లోక్‌సభకు మొత్తం 1,61,971 ఓట్లు పోలవగా అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యధికంగా 79,781 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 53,096 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా సబితాఇంద్రారెడ్డి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. -
‘పొత్తు’ లొల్లి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పొత్తుల ప్రచారం ఆశావహుల్లో కలవరం రేపుతోంది. తమ సీట్లను మిత్రులు ఎగురేసుకుపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక నాయకత్వంతో సంప్రదించకుండా అగ్రనేతలు సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని స్థానాలను కేటాయించేస్తుండడం పార్టీ నేతల గుస్సాకు కారణమైంది. సీపీఐతో దోస్తీకి సిద్ధమైన కాంగ్రెస్.. సిట్టింగ్ నియోజకవర్గమైన మహేశ్వరంను కామ్రేడ్లకు వదిలేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పరిణామం అధికారపార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. సంస్థాగత నిర్మాణంలేని సీపీఐకి మహేశ్వరం కేటాయించాలనే నిర్ణయంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శ్రీనగర్ కాలనీలోని మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు సీపీఐకి ఈ సీటు వదిలాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు మీరు మరో నియోజకవర్గానికి మారుతున్నారనే వార్తలను జీర్ణించుకోలేకపోతున్నామని, మరోవైపు సిట్టింగ్ సీటును సీపీఐకి కేటాయించాలనే నిర్ణయం సరికాదని వాదిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. కొందరు నాయకులు ఏకంగా సబిత కాళ్ల మీదపడి.. ఈ సీటును సీపీఐకి ఇవ్వకూడదని ప్రాథేయపడ్డారు. పార్టీ నేతల వైఖరిని చూసి విస్తుపోయిన సబిత, తనయుడు కార్తీక్‌రెడ్డి వారిని వారించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కమిటీ నియోజకవర్గం బి-బ్లాక్ అధ్యక్షుడు సామ ప్రభాకర్‌రెడ్డి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో సబితాఇంద్రారెడ్డి కుమారుడు బయటకు వచ్చి తన తల్లి ఎంపీగా పోటీ చేయడం లేదని మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తారని ప్రకటించారు. అయినా కార్యకర్తలు శాంతించకుండా ఆ విషయం మీడియా సమక్షంలో చెప్పాలని డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు కార్యకర్తలు ఆమె నివాసం ముందు ఆందోళన చేపట్టారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు ముగియలేదని, అప్పుడే తొందరపడి వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదని సముదాయించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉందామని, ఎవరికి టికెట్ వచ్చినా సమష్టిగా పనిచేద్దామని హితోపదేశం చేశారు. ‘నేనెక్కడికి వెళ్లను.. మీకు అందుబాటులో ఉంటా’ అని వివరించారు. దీంతో మెత్తబడ్డ కార్యకర్తలు, నేతలు ఆమె నివాసం నుంచి నిష్ర్కమించారు. ‘దేశం’లోనూ కలవరం! మరోవైపు టీడీపీ శిబిరంలోనూ పొత్తుల గబులు మొదలైంది. బీజేపీతో పొత్తులపై చర్చలు జరుగుతుండడం.. మహేశ్వరం సీటు కోసం ఆ పార్టీ పట్టుబడుతుండడం టీడీపీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తుండడంతో విజయం నల్లేరుపై నడకేనని భావించిన తమ్ముళ్లకు బీజేపీ ఇచ్చిన షాక్‌తో దిమ్మె తిరిగింది. దీంతో ఆ పార్టీతో మైత్రి తమ సీట్ల గల్లంతుకు దారితీస్తుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గురువారం మహేశ్వరం టీడీపీ ఇన్చార్జి తీగల కృష్ణారెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలుసుకున్నారు. టీడీపీ బలంగా ఉన్న మహేశ్వరం సెగ్మెంట్‌ను బీజేపీకి కేటాయించకూడదని విన్నవించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో టీడీపీ విజయం సాధించిందని, రెండెంకల స్థానాలు కూడా రాని బీజేపీకి ఈ సీటు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఎల్బీనగర్ నియోజకవర్గం విషయంలోనూ తెలుగు తమ్ముళ్లు గరమవుతున్నారు. ఈ స్థానం కూడా బీజేపీ అడుగుతున్న వాటిలో ఉండడంతో టీడీపీ ఆశావహులను ఇరకాటంలో పడేసింది. ఒక్క కార్పొరేటర్ కూడా గెలవని ఆ పార్టీకి అసెంబ్లీ స్థానం కట్టబెట్టాలని భావించడం సమంజసంకాదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎస్.కృష్ణప్రసాద్ అంటున్నారు. -
తొలి మహిళా హోం మంత్రి మహేశ్వరం నుంచే..
డీలిమిటేషన్లో కొత్తగా ఏర్పాటైన మహేశ్వరం నియోజకవర్గం ‘తీగల’పై విజయం సాధించిన సబిత రంగారెడ్డి, న్యూస్‌లైన్ : నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. అంతకుముందు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భాగంగా ఉన్న మహేశ్వరం, కందుకూరు మండలాలు.. మలక్‌పేట నియోజకవర్గంలో ఉన్న సరూర్‌నగర్ మండలంతోపాటు డివిజన్‌ను కలిపి మహేశ్వరం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో నిర్వహించిన మొదటి ఎన్నికల్లో 18 మంది పోటీపడగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.సబితాఇంద్రారెడ్డి విజయం సాధించారు. టీడీపీకి చెందిన సమీప ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డిపై ఆమె 7,833 ఓట్ల ఆధిక్యతంతో గెలుపొందారు. ఆ తర్వాత సబితాఇంద్రారెడ్డి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. -
సబిత సోదరుడికి బీజేపీ గాలం!
తాండూరు, న్యూస్‌లైన్: ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో బీజేపీ నాయకత్వం అభ్యర్థుల వేటను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ గెలుపునకు అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్న అసెంబ్లీ స్థానాలపై కమలనాథులు కన్నేశారు. ఈసారి తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ను పార్టీ అధిష్టానం లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి(బాబు)కి కమలనాథులు వల వేస్తున్నారు. తాండూరు నుంచి ఆయనను బరిలోకి దించాలని ఆపార్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నర్సింహారెడ్డితో బీజేపీ రాష్ట్రస్థాయి కీలక నేత ఒకరు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నర్సింహారెడ్డి సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టికెట్ విషయంలో కచ్చితమైన హామీ లభిస్తేనే రంగంలోకి దిగుతానని నర్సింహారెడ్డి సన్నిహిత వర్గాలతో ప్రస్తావించినట్టు సమాచారం. ఆసక్తిగా మారిన రాజకీయాలు.. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ తాను శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాల్సి వస్తే తాండూరు నుంచి టీడీపీ తరపున తన సతీమణి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డిని పోటీ చేయించాలని మహేందర్‌రెడ్డి యోచిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే తాండూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించి నర్సింహారెడ్డిని బరిలోకి దించేందుకు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే నాయకుడు ఒకరు వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. నర్సింహారెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగితే తాండూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి నర్సింహారెడ్డికి అవకాశం ఇవ్వొద్దని టీడీపీ ప్రజాప్రతినిధి అయిన జిల్లా కీలక నేత ఒకరు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం. తాండూరు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ విషయమై నర్సింహారెడ్డి ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ బీజేపీ నాయకులు తనను సంప్రదిస్తున్నట్లు తెలిపారు.