సబిత సోదరుడికి బీజేపీ గాలం!
తాండూరు, న్యూస్‌లైన్: ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో బీజేపీ నాయకత్వం అభ్యర్థుల వేటను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ గెలుపునకు అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్న అసెంబ్లీ స్థానాలపై కమలనాథులు కన్నేశారు. ఈసారి తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ను పార్టీ అధిష్టానం లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి(బాబు)కి కమలనాథులు వల వేస్తున్నారు.
తాండూరు నుంచి ఆయనను బరిలోకి దించాలని ఆపార్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నర్సింహారెడ్డితో బీజేపీ రాష్ట్రస్థాయి కీలక నేత ఒకరు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నర్సింహారెడ్డి సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టికెట్ విషయంలో కచ్చితమైన హామీ లభిస్తేనే రంగంలోకి దిగుతానని నర్సింహారెడ్డి సన్నిహిత వర్గాలతో ప్రస్తావించినట్టు సమాచారం.
ఆసక్తిగా మారిన రాజకీయాలు..
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ తాను శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాల్సి వస్తే తాండూరు నుంచి టీడీపీ తరపున తన సతీమణి, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డిని పోటీ చేయించాలని మహేందర్‌రెడ్డి యోచిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే తాండూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించి నర్సింహారెడ్డిని బరిలోకి దించేందుకు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే నాయకుడు ఒకరు వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.
నర్సింహారెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగితే తాండూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి నర్సింహారెడ్డికి అవకాశం ఇవ్వొద్దని టీడీపీ ప్రజాప్రతినిధి అయిన జిల్లా కీలక నేత ఒకరు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు సమాచారం. తాండూరు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ విషయమై నర్సింహారెడ్డి ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ బీజేపీ నాయకులు తనను సంప్రదిస్తున్నట్లు తెలిపారు.