వైఎస్సార్‌సీపీ నేత కుందురు నరసింహారెడ్డి ఇంటిపై దాడి
30 మందికి పైగా టీడీపీ రౌడీల దౌర్జన్యం
బూతులు తిడుతూ కర్రలు, రాడ్లతో విధ్వంసం
బాధితుని కుటుంబాన్ని పరామర్శించిన బూచేపల్లి
దర్శి: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజలు భయంతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి పడతారోనని ప్రజలు ఆందోళనతో బతుకుతున్నారు. ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. 30మందికి పైగా నరసరావుపేట నుంచి తెచ్చిన రౌడీలతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకుడు కుందురు నరసింహారెడ్డి ఇంటి విధ్వంసం సృష్టించారు. బాధితుడు నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.40 సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో ఇంటి తలుపు తీశారు.
ఇంటి బయట ఉన్న రౌడీలు నరసింహారెడ్డి నువ్వేనా అంటూ ప్రశ్నించి దర్శిలో మేం ఓడిపోవడానికి కారణం నువ్వేనంటూ దుర్భాషలాడారు. ఈవీఎంలు ఎత్తుకెళుతుంటే అడ్డుకుంటావా అని బూతులు తిట్టారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఇంటి దిమ్మెలను బాది పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ గేటుకు ఉన్న లైట్లు పగులగొట్టి వీరంగం వేశారు. నరసింహారెడ్డి వరండా గేటు తీయకుండా పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. బయట రౌడీలు దాడి చేయడంతో ఇంట్లో ఉన్న నరసింహారెడ్డి భార్య, పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
నీతో పాటు మరో 30 మంది మా టార్గెట్‌లో ఉన్నారని, మీ అందరి అంతు చూస్తామంటూ నరసింహారెడ్డిని బెదిరించారు. ఈ లోగా పోలీస్ వాహనం రావడం, చుట్టుపక్కల వారు అక్కడకు రావడంతో వారంతా పారిపోయారు. ఈ ఘటనతో నియోజకవర్గం ఉలిక్కిపడింది. దర్శిలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి వచ్చి కొత్తగా రౌడీ సంస్కృతిని తెచ్చిందని మండిపడుతున్నారు.
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
టీడీపీ శ్రేణుల దాడిపై నరసింహారెడ్డి భార్య కుందురు సునీత స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్నికల్లో తన భర్త నరసింహారెడ్డి బూత్ ఏజెంట్‌గా ఉన్న బూత్‌లో ఈవీఎంలు ఎత్తుకెళ్లనీయలేదని, అందుకే తమపై కక్ష కట్టి ఇంటిపైకి వచ్చి దాడి చేసి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.
బూచేపల్లి పరామర్శ..
టీడీపీ నాయకుల దాడి విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సోమవారం నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఆపద రాకుండా అండగా ఉంటానని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment