సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పొత్తుల ప్రచారం ఆశావహుల్లో కలవరం రేపుతోంది. తమ సీట్లను మిత్రులు ఎగురేసుకుపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక నాయకత్వంతో సంప్రదించకుండా అగ్రనేతలు సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని స్థానాలను కేటాయించేస్తుండడం పార్టీ నేతల గుస్సాకు కారణమైంది. సీపీఐతో దోస్తీకి సిద్ధమైన కాంగ్రెస్.. సిట్టింగ్ నియోజకవర్గమైన మహేశ్వరంను కామ్రేడ్లకు వదిలేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పరిణామం అధికారపార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. సంస్థాగత నిర్మాణంలేని సీపీఐకి మహేశ్వరం కేటాయించాలనే నిర్ణయంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
శ్రీనగర్ కాలనీలోని మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు సీపీఐకి ఈ సీటు వదిలాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు మీరు మరో నియోజకవర్గానికి మారుతున్నారనే వార్తలను జీర్ణించుకోలేకపోతున్నామని, మరోవైపు సిట్టింగ్ సీటును సీపీఐకి కేటాయించాలనే నిర్ణయం సరికాదని వాదిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. కొందరు నాయకులు ఏకంగా సబిత కాళ్ల మీదపడి.. ఈ సీటును సీపీఐకి ఇవ్వకూడదని ప్రాథేయపడ్డారు. పార్టీ నేతల వైఖరిని చూసి విస్తుపోయిన సబిత, తనయుడు కార్తీక్‌రెడ్డి వారిని వారించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కమిటీ నియోజకవర్గం బి-బ్లాక్ అధ్యక్షుడు సామ ప్రభాకర్‌రెడ్డి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా ఆయన్ను అడ్డుకున్నారు.
దీంతో సబితాఇంద్రారెడ్డి కుమారుడు బయటకు వచ్చి తన తల్లి ఎంపీగా పోటీ చేయడం లేదని మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తారని ప్రకటించారు. అయినా కార్యకర్తలు శాంతించకుండా ఆ విషయం మీడియా సమక్షంలో చెప్పాలని డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు కార్యకర్తలు ఆమె నివాసం ముందు ఆందోళన చేపట్టారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు ముగియలేదని, అప్పుడే తొందరపడి వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదని సముదాయించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉందామని, ఎవరికి టికెట్ వచ్చినా సమష్టిగా పనిచేద్దామని హితోపదేశం చేశారు. ‘నేనెక్కడికి వెళ్లను.. మీకు అందుబాటులో ఉంటా’ అని వివరించారు. దీంతో మెత్తబడ్డ కార్యకర్తలు, నేతలు ఆమె నివాసం నుంచి నిష్ర్కమించారు.
‘దేశం’లోనూ కలవరం!
మరోవైపు టీడీపీ శిబిరంలోనూ పొత్తుల గబులు మొదలైంది. బీజేపీతో పొత్తులపై చర్చలు జరుగుతుండడం.. మహేశ్వరం సీటు కోసం ఆ పార్టీ పట్టుబడుతుండడం టీడీపీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తుండడంతో విజయం నల్లేరుపై నడకేనని భావించిన తమ్ముళ్లకు బీజేపీ ఇచ్చిన షాక్‌తో దిమ్మె తిరిగింది. దీంతో ఆ పార్టీతో మైత్రి తమ సీట్ల గల్లంతుకు దారితీస్తుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గురువారం మహేశ్వరం టీడీపీ ఇన్‌చార్జి తీగల కృష్ణారెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలుసుకున్నారు.
టీడీపీ బలంగా ఉన్న మహేశ్వరం సెగ్మెంట్‌ను బీజేపీకి కేటాయించకూడదని విన్నవించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో టీడీపీ విజయం సాధించిందని, రెండెంకల స్థానాలు కూడా రాని బీజేపీకి ఈ సీటు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఎల్‌బీనగర్ నియోజకవర్గం విషయంలోనూ తెలుగు తమ్ముళ్లు గరమవుతున్నారు. ఈ స్థానం కూడా బీజేపీ అడుగుతున్న వాటిలో ఉండడంతో టీడీపీ ఆశావహులను ఇరకాటంలో పడేసింది. ఒక్క కార్పొరేటర్ కూడా గెలవని ఆ పార్టీకి అసెంబ్లీ స్థానం కట్టబెట్టాలని భావించడం సమంజసంకాదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్.కృష్ణప్రసాద్ అంటున్నారు.
‘పొత్తు’ లొల్లి!
Published Thu, Apr 3 2014 11:08 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement