దోపిడీని అడ్డుకునేందుకే ఒక్కటయ్యాం
దోపిడీని అడ్డుకునేందుకే ఒక్కటయ్యాం
Published Thu, Sep 14 2017 2:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాల పునరేకీకరణ!
- సింగరేణి ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి
- టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ను ఓడించండి
- కార్మికులకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నేతల పిలుపు
- ఏఐటీయూసీ అభ్యర్థుల గెలుపు కోసం కూటమి
- ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ సంపూర్ణ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ‘‘సింగరేణి బొగ్గు గనుల సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని (టీబీజీకేఎస్) ఓడించాలి. తద్వారా... సింగరేణి కార్మికులను మోసగించిన సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి’’ అని బుధవారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పిలుపునిచ్చాయి. రాష్ట్రం లో ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తూ, ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ దోపిడీ పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ను పారదోలడానికి తామంతా ఏకమై సింగరేణి ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డామని ఆ పార్టీల ముఖ్య నేతలు తెలిపారు. ఈ కలయిక కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగమేనని ప్రకటించారు. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ అనుబంధ కార్మిక సం ఘం ఏఐటీయూసీ అభ్యర్థులకు కాంగ్రెస్, టీడీపీలతో పాటు రెండు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ సం పూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
కార్మికులకు తీరని అన్యాయం: చాడ
సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని గెలిచి, ఆ తర్వాత కార్మికులకు తీరని అన్యాయం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలప్పుడు ఇచ్చిన 70 రకాల హామీల్లో ఒక్కదాన్నీ కేసీఆర్ నెరవేర్చలేకపోయారన్నారు. వారసత్వ ఉద్యోగాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలనే లోపభూయిష్టంగా ఉత్తర్వు లు జారీ చేసిందని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె కవిత తన తెలంగాణ జాగృతికి చెందిన సతీశ్‌తో ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేయించడంతో వాటిని కోర్టు కొట్టేసిందన్నారు. ఓపెన్ కాస్ట్ గనులను మూసేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు వాటిని విచ్చలవిడిగా తెరుస్తున్నారన్నారు. సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి సింగరేణి గనుల్లో పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణా రెడ్డి, సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు టి.నర్సింహన్, ఐఎన్‌టీయూసీ నేతలు జనక్ ప్రసాద్, నర్సింహారెడ్డి, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
గనులను ప్రైవేట్‌పరం చేసే కుట్ర
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఆయా పార్టీల అనుబంధ కార్మిక సంఘాల నేతలు బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి టీఆర్‌ఎస్‌కు అధికారమిచ్చి మోసపోయామని సింగరేణి కార్మికులు భావిస్తున్నారని వారన్నారు. ‘‘వారసత్వ ఉద్యోగాలు, కార్మికులకు ఇళ్లు, 25 వేల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, ప్రతి కోల్ బ్లాక్‌కు ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వైద్య కళాశాల, డిస్మిసైన ఉద్యోగుల పునర్నియామకం, ఆదాయ పన్ను నుంచి సింగరేణి కార్మికులకు మినహాయింపు, ఓపెన్ కాస్ట్ గనుల మూత తదితరాలపై కేసీఆర్ ఎన్నికల హామీలన్నీ నీటి మూటలే అయ్యాయి. తెలంగాణ, ఒడిశాల్లోని బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు ఆయన కుట్రలు చేశారు’’అంటూ మండిపడ్డారు.
Advertisement
Advertisement