రూ.1,000 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధుల దారి మళ్లింపు అవాస్తవం | CSR funds diversion was fallacy | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 1:13 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

CSR funds diversion was fallacy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థ రూ.1,000 కోట్ల కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌) నిధులను ఇష్టానుసారం ఖర్చు చేసిందని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు చేసిన ఆరోపణలను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. సంస్థలో సీఎస్‌ఆర్‌ పథకం అమలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.43.52 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీల చట్టం–2013 ప్రకారం ప్రతి కంపెనీ గత మూడేళ్లలో సాధించిన లాభాల సగటు నుంచి 2 శాతం నిధులను సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ చట్టానికి అనుగుణంగా సింగరేణి సంస్థ విధివిధానాలు రూపొందించుకుని 2015–16 నుంచి సామాజిక కార్యక్రమాలు అమలు చేస్తోందని సంస్థ యాజమాన్యం తెలిపింది. గత మూడేళ్లలో సంస్థ రూ.31.52 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సుమారు రూ.12 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులు వెచ్చించినట్లు వెల్లడించింది.

సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో చర్చించి సీఎస్‌ఆర్‌ నిధుల కేటాయింపు, చేపట్టాల్సిన పనులు, ఖర్చులను ఆమోదిస్తామని పేర్కొంది. సంస్థ సీఎస్‌ఆర్‌ విధివిధానాల ప్రకారం సింగరేణి గనులు విస్తరించి ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో 80 శాతం, మిగిలిన 20 శాతం నిధులను సింగరేణేతర ప్రాంతాల్లో పనులకు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నిధులతో ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పర్యావరణ రక్షణ చర్యలు, క్రీడా సాంస్కృతిక అభివృద్ధి పనులు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ, విద్య, వైద్య సదుపాయాల వంటి అనేక కార్యక్రమాలు జరిపామని తెలిపింది. సింగరేణి సంస్థ తన కార్మికుల సంక్షేమం, అభివృద్ధితోపాటు సమీప ప్రాంతాలు, ప్రజలకు కూడా అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులను కేటాయిస్తోందని పేర్కొంది. చట్టం ప్రకారం కనీసం 2 శాతం సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయిస్తే చాలని, గత రెండేళ్లుగా ప్రజల అవసరాలను గుర్తించి అంతకుమించి నిధులను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నామని తెలిపింది. సింగరేణి యాజమాన్యం వెల్లడించిన ప్రకారం సంస్థ ఇప్పటి వరకు చేసిన సీఎస్‌ఆర్‌ నిధుల ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి.

ఆరోపణలకు నేపథ్యమది .. 
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ఈ నెల 5న జరగనున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌)ను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్, సీపీఐల అనుబంధ కార్మిక సంఘాలైన ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా, టీడీపీ అనుబంధ టీఎన్‌టీయూసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ కూటమికి మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత శుక్రవారం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ముఖ్యనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించి సింగరేణి సంస్థపై పలు ఆరోపణలు చేశారు. సంస్థ రూ.1,000 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిందని, సింగరేణి ప్రాంతాల్లో కాకుండా సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు చెందిన నియోజకవర్గాల్లో సీఎస్‌ఆర్‌ నిధులను ఖర్చు చేసిందని విమర్శించారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement