ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ లాలూచీ పడ్డాయని, ఆ పార్టీలను ప్రజలు నమ్మొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఆదివారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఎన్. ఇంద్రసేనారెడ్డి, పట్నం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలపై చంద్రబాబు ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాయలపకీరు, ద గాకోరు, దుర్మార్గుడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫాంహౌస్‌లో పడుకునే కేసీఆర్ సామాజిక తెలంగాణ తీసుకొస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీలా మార్చిన కేసీఆర్‌కు దోచుకోవడమొక్కటే వస్తుందని విమర్శించారు.
దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి మాట మార్చిన ఆయన పెద్ద అబద్ధాలకోరు అని చంద్రబాబు ఆరోపించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన దేశానికి శాపమని, అవినీతి, అసమర్థత వల్ల అభివృద్ధి అనేదే లేకుండాపోయిందని ఆయన విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని సోనియా, రాహుల్ ఎన్నికలు రాగానే రాష్ట్రంలో రెండేసి పర్యాయాలు పర్యటించడం అధికార దాహానికి నిదర్శనమన్నారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయని చంద్రబాబు విమర్శించారు. దేశంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, మోడీ ప్రధానమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దగల సత్తా టీడీపీకి మాత్రమే ఉందన్నారు.
మోడీ, చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తులు
ఇబ్రహీంపట్నం రూరల్: నరేంద్ర మోడీ, చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తులు అని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో ఆదివారం ఏర్పాటు చేసిన టీడీపీ, బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
పాలనపై పట్టులేని వ్యక్తులు ప్రస్తుతం పోటీ చేస్తున్నారని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం, పాలనపై పట్టు ఉన్నాయన్నారు. ఈసారి కేంద్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. తనను గెలిపిస్తే మోడీ మంత్రివర్గంలో పనిచేసి ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
కొట్లాడి నిధులు తెచ్చాను
ఇబ్రహీంపట్నం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం తక్కువ నిధులు ఇస్తే తాను ప్రభుత్వంతో కొట్లాడి రూ.వందల కోట్ల నిధులు తీసుకొచ్చానని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి, రంగారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమానికి తాను అఖిల పక్ష సమావేశం నిర్వహించానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
తన కృషివల్లే పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి పట్నం నియోజకవర్గానికి సాగు నీరు అందే ప్రతిపాదన కార్యరూపం దాల్చిందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, ముత్యాల భాస్కర్, రొక్కం భీమ్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, సత్తు వెంకటరమణారెడ్డి, రామచంద్రయ్య, ఎన్.నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను నమ్మొద్దు
Published Sun, Apr 27 2014 11:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement