పాలమూరు వలసలు వాపస్!
వలస వెళ్లినవారంతా తిరిగొస్తున్నారు: హరీశ్
⇒ టీఆర్‌ఎస్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి
⇒ పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్, టీడీపీ అడ్డుకుంటున్నాయి
⇒ టీఆర్‌ఎస్‌లోకి మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సెలర్లు
సాక్షి, హైదరాబాద్: ‘‘చంద్రబాబు పాల మూరును దత్తత తీసుకుని ఆగం చేసిండు. మహబూబ్‌నగర్ అంటేనే వెనుక బాటు, వలసలుగా తయారైంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహబూబ్‌నగర్ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేసి 4.5 లక్షల ఎకరాలకు నీరందించాం. వలసల వాపస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది..’’అని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. పాలమూరు ప్రాజె క్టును వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చు కున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్, ఐదుగురు కాంగ్రెస్ కౌన్సెలర్లు, పలువురు కాంగ్రెస్ నేతలకు మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులను ఆ జిల్లా టీడీపీ, కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎంత మంది అడ్డుపడినా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నాం..
ప్రభుత్వంలోనే 100 శాతం ఉద్యోగాలిచ్చే రాష్ట్రం ఈ భూమిపైనే ఉండదని.. కానీ కొం దరు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి రచ్చ చేయ డం దురదృష్టకరమని హరీశ్‌రావు వ్యాఖ్యానిం చారు. రాష్ట్రంలో ఇప్పటికే 28,300 ఉద్యోగాలు ఇచ్చామని, మరో 11 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతోందని చెప్పారు. త్వరలో డీఎస్సీ ప్రకటించే ప్రయత్నం చేస్తున్నామని, ఐదేళ్ల కాలపరిమితిలో కచ్చితంగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటు రంగం అభివృ ద్ధితో నిరుద్యోగాన్ని తరిమికొడతా మని.. సాగునీరు, నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, పరిశ్రమలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వల్లే హైదరా బాద్‌కు ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని హరీశ్ చెప్పారు. కానీ కొందరు రాజకీయాల కోసం యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ తీరు నచ్చకనే.. ఆ పార్టీ వాళ్లు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, వైఖరి మార్చుకోకుంటే కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతుందని హరీశ్ వ్యాఖ్యానించారు.
అభివృద్ధితో ఊతం
టీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల అభి వృద్ధి జరుగుతోందని, మహబూబ్‌నగర్ జిల్లాలో అభివృద్ధి వేగవంతమైందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కూడా పాలమూరు –రంగా రెడ్డి ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టుతో అడవుల్లోని జంతువులు చచ్చిపోతాయంటూ కేసులు పెడుతున్నారని.. మరి పాలమూరు బిడ్డలు చనిపోతే ప్రతి పక్షాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదేమని మండిపడ్డారు. పాలమూరు నుంచి లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్లే.. జిల్లా దెబ్బతిన్నదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఎంతో మంది దత్తత పేర జిల్లాను వంచిం చారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ను అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాను వరంగల్, కరీంనగర్, సిద్దిపేటకు దీటుగా అభివృద్ధి చేసుకుంటామని పేర్కొన్నారు.