సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పార్టీ ఆవిర్భావం నుంచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకు జిల్లాలో పెద్ద శక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా కుదేలైంది. పటిష్టమైన క్షేత్రస్థాయి నిర్మాణంతో ఎప్పుడూ టీడీపీని ఆదరించే జిల్లా ప్రజానీకం ఈసారి ఆ పార్టీకి చుక్కలు చూపించారు. పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓటమి పాలు కాగా, చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని అత్తెసరు మెజారిటీతో దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నైరాశ్యంలో కూరుకుపోయాయి. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని పార్టీని చక్కదిద్దుకునే పనిలో పడాల్సిన నాయకత్వం ఎప్పటిలాగే గ్రూపు తగాదాలకే ప్రాధాన్యం ఇస్తుండడంతో అసలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉన్నట్టా లేనట్టా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఆ ఇద్దరే కారణమా?
వాస్తవానికి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా బలీయంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా క్షేత్రస్థాయిలో పటిష్టమైన పునాదులను ఏర్పరుచుకున్న తెలుగు తమ్ముళ్లు తమకు లభించిన ప్రజాబలంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు పొందారు. తొలి నుంచి జిల్లా పార్టీలో తుమ్మల నాగేశ్వరరావుదే ఆధిపత్యం ఉండేది. వరంగల్ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావు 2004లో ఖమ్మం పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేంతవరకు జిల్లాలో పార్టీని ఒంటిచేత్తో నడిపించారు తుమ్మల. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లలో మంత్రి పదవులు నిర్వహించిన ఆయన ఒకప్పుడు జిల్లా రాజకీయాలనే శాసించారు. జిల్లాలో ఏది జరగాలన్నా తుమ్మల గ్రీన్‌సిగ్నల్ ఉండాల్సిందే అన్న రీతిలో ఆయన రాజకీ యాలను నడిపించారు.
అయితే, నామా ఎంట్రీ తుమ్మల ఆధిపత్యానికి గండికొట్టింది. ఆర్థికబలాన్ని ఉపయోగించుకుని జిల్లాలో తనదంటూ ఒక ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకున్న నామా ఒకరకంగా తుమ్మలను ఏకాకిని చేసేంతవరకు తీసుకొచ్చారు. పార్టీ అధినేత వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని తుమ్మల హవా నడవకుండా అడ్డుకున్నారు. జిల్లాలో పార్టీకి సంబంధించిన పదవులను కూడా తుమ్మల వర్గానికి దక్కనీయలేదు. ఏకంగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తుమ్మల వర్గానికి లభించిన ఓ ఎమ్మెల్యే స్థానాన్ని రాత్రికి రాత్రే మార్పించి తన అనుచరురాలికి ఇప్పించుకున్నారు. ఆ స్థాయిలో నామా, తుమ్మల ఢీ అంటే ఢీ అనడంతో జిల్లాలో పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది.
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అయితే ఇరు వర్గాలు బహిరంగంగానే వ్యతిరేకంగా పనిచేసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థి వర్గం గెలవకూడదన్న పట్టుదలతో పనిచేసి ఇరు వర్గాలను ఓడించుకున్నాయి. అటు ఖమ్మం ఎంపీగా నామా, ఎమ్మెల్యేగా తుమ్మల ఇద్దరూ ఓటమిపాలయ్యారు. దీంతో ఇక అసలు జిల్లాలో పార్టీని పట్టించుకునేదెవరో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు వెలువడిన జిల్లా పరిషత్ ఫలితాలలో టీడీపీ స్పష్టమైన మెజార్టీని దక్కించుకుంది. అయితే, చైర్‌పర్సన్‌గా ఎవరుండాలన్న దానిపై రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదరడం లేదు. తమ వర్గానికంటే తమకేనంటూ రెండు వర్గాలు పట్టుబడుతుండడంతో అసలు ఆ తత ంగం ఎలా జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
భవిష్యత్తేంటి...
ఇదిలా ఉంటే మళ్లీ ఎన్నికలు వచ్చేంతవరకు అసలు జిల్లాలో పార్టీని ఎలా నడుపుతారనేది ఇప్పుడు జిల్లా తెలుగుదేశం శ్రేణుల్లో అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది. పార్టీని ఇప్పటివరకు నడిపించిన ఇద్దరు నాయకులు ఓడిపోవడంతో పార్టీని నడిపించే బాధ్యతను ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఆ నిర్ణయానికి ఇరు వర్గాలూ కట్టుబడతాయా అనేది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ తెలంగాణలో మరో ఐదేళ్ల పాటు కూడా అదే పరిస్థితిలో ఉండనుంది. అధికారం వరుసగా 15 ఏళ్లు దూరమయ్యే పరిస్థితి ఉండడంతో పార్టీ ఆర్థికవనరులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవైపు దాదాపు అన్ని ఎన్నికలు పూర్తవడంతో మళ్లీ రాజకీయంగా సందడి కూడా అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కనీసం పార్టీ పిలుపులకైనా కేడర్ స్పందిస్తుందా? అసలు ఎవరు పార్టీని నడిపించాలి అనేది ఇప్పుడు ఖమ్మం జిల్లా టీడీపీ కేడర్‌ను వేధిస్తోంది. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జిల్లా పగ్గాలు చేపట్టేందుకు ఎవరికి అవకాశం వస్తుంది.. ఐదేళ్లు పాటు సొంత ఖర్చులతో పార్టీని గట్టెక్కించేందుకు సదరు నేత అంగీకరిస్తారా? ఆయన అంగీకరించినా అందరూ సహకరిస్తారా? అసలు ఖమ్మం జిల్లాల్లో టీడీపీ భవిష్యత్తేంటి అనేది జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
టీడీపీకి దిక్కెవరు?
Published Mon, May 26 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement