సత్తుపల్లి, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల అభ్యర్థులను ఆయా పార్టీలు ఆఖరి నిమిషంలో ప్రకటిస్తుండటంతో రిజర్వ్ స్థానాల్లో పోటీచేసే సంబంధిత అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. నామినేషన్లకు గురువారం చివరి రోజు కావటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక పోవటంతో అభ్యర్థుల స్థానంలో కొందరు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆఖరి నిమిషంలోనైనా అవకాశం వస్తే పోటీ చేసేందుకు కొందరు ఆశావాహులు కులధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 75 ఎంపీటీసీలు, ఐదు జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు జెడ్పీటీసీలు ఎస్టీలకు రిజర్వ్ కావటంతో అభ్యర్థుల కోసం పార్టీలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొరక్కదొరక్క దొరికిన అభ్యర్థి కులధ్రువీకరణ ప్రతం తేవడం కష్టంగా మారింది. దీనికితోడు పంచాయతీ ఇంటి, నీటి పన్నుల బకాయిల చెల్లింపుల నోడ్యూస్ సర్టిఫికెట్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చాలా పంచాయతీలలో కార్యదర్శుల కొరత ఉండటంతో మరింత ఆలస్యమవుతోంది. ఎన్నికల నిబంధనలు తెలియని గ్రామీణ ప్రాంత అభ్యర్థులైతే మరింత ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఫలితాల ప్రభావం..
సార్వత్రిక ఎన్నికలకు ముందు, కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిస్తుండటంతో వీటి ప్రభావం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఎక్కడ పడుతుందోననే ఆందోళనలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే నగరపంచాయతీ ఎన్నికలతో బిజీబిజీగా ఉన్న నేతలు పార్టీ గుర్తులతో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బలాబలాలను లెక్కలువేస్తూ.. అభ్యర్థుల ఎంపికపై ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. రిజర్వ్ స్థానాలలో అభ్యర్థుల ఎంపిక బాధ్యత మండల నాయకత్వం మీదనే పెట్టారు. ఓవైపు మున్సిపాలిటీ, మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వరుస ఎన్నికలు రావటంతో అభ్యర్థుల ఎంపిక తలకుమించిన భారంగా మారింది. ప్రాదేశిక ఎన్నికల ఖర్చును కూడా భరించాల్సి రావడం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు భారంగా మారింది.
మీసేవ చుట్టూ పరుగో పరుగు
Published Thu, Mar 20 2014 2:05 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM
Advertisement