భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు... ఆ పార్టీ జిల్లా నేత, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్‌రావు సాక్షిగానే ఈ ఘర్షణ చోటుచేసుకుంది. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగడంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఒకరోజు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తమ్ముళ్ల వీరంగం ప్రత్యక్షంగాచూసిన తుమ్మల, బాలసాని లక్ష్మీనారాయణ డివిజన్ కేంద్రం లోని పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కకుండానే వెనుదిరిగారు.
వివరాల్లోకి వెళితే...
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం తుమ్మల, బాలసానిని రప్పించి నియోజకవర్గంలో తమ బలాన్ని చాటుకునేందుకు టీడీపీ నాయకులు ఎత్తుగడ వేశారు. ఈ నేపథ్యంలో వారిరువురూ వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో సాయంత్రం వరకూ ప్రచారం నిర్వహించి, చివరకు భద్రాచలం చేరుకున్నారు. వారికి స్వాగతం పలికేందుకు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌కు పట్టణ టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. అయితే మొదటి నుంచీ రెండు వర్గాలు విడిపోయి కార్యక్రమాలు చేపడుతున్న నాయకులు తుమ్మల, బాలసానికి స్వాగతం పలికే విషయంలోనూ గ్రూపులు కట్టారు.
పార్టీ పట్టణ అధ్యక్షుడైన కుంచాల రాజారామ్ తుమ్మల వాహనం వద్దకు వెళ్తుండగా, మరో వర్గం వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్రమైన తోపులాట జరిగింది. ఒక దశలో కర్రలు పట్టుకొని వీరంగం చేయటంతో పాటు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పరిస్థితి గమనించిన తుమ్మల, బాలసాని కాసేపు మాత్రమే ప్రసంగించి వెళ్లిపోయారు. ప్రచారం తరువాత పార్టీ డివిజన్ కార్యాలయంలో కార్యకర్తలకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారని నాయకులు భావించినప్పటికీ వారు కార్యాలయం మెట్లు కూడా ఎక్కకుండానే వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీలోని నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.
డబ్బ పంపకాల్లో ఆలస్యమే కారణమా...
భద్రాచలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతైనా ఖర్చు పెడతానని పార్టీ జిల్లా నేతల ముందు ఓ నాయకుడు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికల రోజు సమీపిస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంపై ఇరు వర్గాల నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని పార్టీ జిల్లా నేతలైన తుమ్మల, బాలసానికి ఫిర్యాదు చేసేందుకు రెండు వర్గాల వారు సిద్ధమయ్యారు. దీంతో తన బండారం ఎక్కడ బయట పడుతుందోనని భావించిన ఆ నాయకుడు కావాలనే ఇలా గొడవ చేయించారని ఆ పార్టీ నాయకులు బాహాటంగానే చెపుతున్నారు.
తుమ్మల, బాలసాని పార్టీ కార్యాలయానికి వచ్చాక ఈ విషయమై తాడోపేడో తేల్చుకుందామని నాయకులంతా భావింంచారు. అయితే డబ్బుల పంపకం బాధ్యతలు చూసే సదరు నాయకుడు ఈ విషయాన్ని గమనించి చాకచక్యంగా వ్యవహరించారని, ఈ క్రమంలోనే వారిరువురు కార్యాలయానికి రాకుండా వెళ్లపోయారని పార్టీ నాయకులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు పంపకాల్లో వచ్చిన విభేదాలతో తెలుగు తమ్ముళ్లు తన్నుకోవటం చూసిన వారంతా ప్రజలకు వీరేం సేవ చేస్తారని చర్చించుకోవటం కనిపించింది.
తన్నుకున్న ‘తమ్ముళ్లు’
Published Sat, Apr 5 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement