balasani lakshmi narayana
-
నామా వల్లే టీడీపీ నాశనం
ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సాక్షి, ఖమ్మం : డబ్బు, అహంకారంతో నామా నాగేశ్వరారవు జిల్లాలో టీడీపీ నాశనం చేశాడని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏనాడు టీడీపీ కార్యకర్తల కష్టాలు ఆయన చూడలేదని అందుకే తాము టీఆర్ఎస్లో చేరుతున్న సమయంలో వారు కూడా తమ బాటే పట్టారనని అన్నారు. ఇది గిట్టక తమపై అవాకులు చవాకులు మాట్లాడితే జిల్లా ప్రజలే వారికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. టీడీపీలో శకుననిలా మారి పార్టీని నిర్వీర్యం చేశారనని ఆరోపించారు. జిల్లాలో సామాజిక న్యాయం పాటించకుండా తనకు వచ్చిన టికెట్ కూడా తన అనుచర నేతలకు నామా ఇప్పించుకొని కేడర్‌ను మనస్తాపానికి గురి చేశారని బాలసాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు.. ఎవరి ఓటమి కోసం పనిచేశారో జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఖమ్మంలో ఎవరి బంధువులు పార్టీ అభ్యర్థి ఓటమి కోసం డబ్బులు పంచారో జగమెరిగిన సత్యమని అన్నారు. ఇలాంటివన్నీ చేయించిన వారు.. జిల్లాలో పార్టీని మోసిన తమపై నిందలు మోపుతారా..? అని ప్రశ్నించారు. ఒకప్పుడు టికెట్ రాలేదని పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిని, పార్టీ అధినేత చిత్రపటాలు చించి అవమానించిన వారిని భుజానకెత్తుకుంది మీరు కాదా..? అని నామాను ప్రశ్నించారు. నీతి, నిజాయితీతో చేసినందునే తమకు జిల్లా ప్రజలు గౌరవం ఇచ్చారని, మాతో ఉన్న టీడీపీ కేడర్ మనస్ఫూర్తిగానే టీఆర్ఎస్లో చేరారని అన్నారు. ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు అవకాశవాదులని.. అర్థరాత్రి ముసుగులో వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ గుమ్మం తొక్కిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. ఇలాంటి అవకాశవాదులకు తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొండాబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న వారు ఇవాళ టీడీపీలో నేతలుగా చలామణి అవుతున్నారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, మందడపు సుధాకర్, చింతనిప్పు కృష్ణచైతన్య, మదార్ సాహెబ్, జక్కంపుడి కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
తమ్ముళ్ల కుమ్ములాట
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయం ఇందుకు వేదికగా మారింది. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో టీడీపీ ఓటమికి కారణం మీరంటే.. మీరేంటూ పరస్పరం దూషణలకు దిగిన తెలుగు తమ్ముళ్లు ఏకంగా తన్నుకున్నారు. మధ్యలో సర్దిచెప్పేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కూడా బలవంతంగా నెట్టేసి మరీ ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఎన్నికల్లో తన ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకు తుమ్మల తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం సమావేశం అయ్యారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తుమ్మలను కలిసేందుకు పలువురు నాయకులు అక్కడికి చేరుకున్నారు. బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎక్కడెక్కడ తగ్గాయి.. అనే లెక్కలు చూసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నాయకులు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బాలసానికి సీటు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారిందని, దీంతో తాను ప్రచారం చేయబోనని బాలసాని చెప్పడం వల్లే భారీ నష్టం వాటిల్లిందని తుమ్మలకు వివరించారు. దీంతో కార్యకర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. వెంటనే తుమ్మల వారందరికీ సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదే సమయంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతనిప్పు కృష్ణచైతన్య తుమ్మల క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయనను చూసిన తెలుగుయువత జిల్లా నాయకుడు గొల్లపూడి హరికృష్ణ అగ్రహంతో ఉగిపోతూ, తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో కృష్ణచైతన్య, హరికృష్ణ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ‘నువ్వెంతంటే నువ్వెంత’ అంటూ తన్నుకున్నారు. దీనిని అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వెళ్లగా ఆయనను కూడా నెట్టివేసి మరీ కొట్టుకున్నారు. ఘర్షణ విషయం పోలీసులకు తెలియడంతో వారు వచ్చి ఇరువర్గాలను క్కడి నుంచి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. -
ఖమ్మం ఎంపీ ఎవరు?
సాక్షి, ఖమ్మం: ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కనుంది..? నామాకు మరో చాన్స్ వస్తుందా..? తుమ్మల వర్గం ఆయనకు సహకరించిందా..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తొలిసారి చట్టసభల్లో అడుగుపెడతారా? వైఎస్ఆర్సీపీ ప్రభంజనంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ కావడం ఖాయమా..? జిల్లా ప్రజలు జోరుగా చర్చించుకుంటున్న ఈ ప్రశ్నలకు శుక్రవారం సమాధానం దొరకనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం జిల్లా ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బీజేపీ పొత్తుతో టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. వారిద్దరూ ఆయా పార్టీల పరంగా ఉద్దండులే. సీపీఎం మద్దతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరితో తలపడ్డారు. నామా గత ఐదేళ్లలో కావల్సినంత వ్యతిరేకతను కూడబెట్టుకున్నారని, పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోశారని, అవే ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అధినేత వద్ద పలుకుబడితో తన వర్గం వారికి పార్టీ, ఇతరత్ర పదవులు ఇప్పించుకోవడంతో దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకుని ఉంటున్నవారు నష్టపోయారని తుమ్మల నాగేశ్వరరావు వర్గం పలుమార్లు విమర్శలు చేసింది. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ విషయంలో తుమ్మల ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో రద్దు చేయడం వెనుక నామా హస్తముందనే ఆరోపణలు కూడా ఆయనకు ప్రతికూలంగా పనిచేశాయంటున్నారు. ఈ ఘటన తుమ్మల, నామా వర్గాల మధ్య ఉన్న విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్లిందని కూడా చెబుతున్నారు. పార్టీలో నామా మితిమీరిన జోక్యమే ఆయన కొంపముంచుతుందని ఆయన వ్యతిరేక వర్గీయుల వ్యాఖ్య. ఓవైపు రిక్త‘హస్తం’..మరోవైపు స్థానికేతరుడు..అనే ఈ రెండు అంశాలే నారాయణను పుట్టిముంచుతాయనే చర్చ సాగుతోంది. ఒకవేళ నారాయణ విజయం సాధిస్తే తమకు కొరకరాని కొయ్యలా మారుతారనే ఉద్దేశంతోనే పొత్తుపెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆయనకు సహకరించలేదనే వాదన కూడా ఉంది. నామా, నారాయణలపైనున్న వ్యతిరేకతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కలిసివచ్చే అంశమని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్నింటికీ మించి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు, ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో నిరంతర సంబంధాలు నెరపడం వంటి అంశాలు పొంగులేటికి అనుకూలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, రాష్ట్ర నాయకురాలు షర్మిల ప్రచారం కూడా శీనన్నకు శ్రీరామ రక్షగా మారుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ అంచనాల్లో ఏది నిజమో..ఏది కాదో నేడు తేలనుంది. ఎడతెగని ఉత్కంఠకు తెరపడనుంది. -
నామా..గోబ్యాక్
సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోడ్డెక్కింది. టికెట్ కేటాయింపు విషయంలో తమ నేతకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఎంపీ నామానాగేశ్వరరావును ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వర్గీయులు అడ్డుకుని దూషణకు దిగారు. బాలసాని ఇంటికి వచ్చిన నామాను లోపలికి వెళ్లకుండా అటకాయించగా....ఎట్టకేలకు నామా లోపలికి వెళ్లి గంటసేపు ఇంట్లో కూర్చున్నా బాలసాని కలవకపోవడంతో తీవ్రపరాభవంతో వెనుదిరిగారు. బుధవారం జరిగిన ఈ సంఘటనలకు సంబంధించి వివరాలు... కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి.. కొత్తగూడెం నియోకజవర్గ ఇన్చార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని)కి బీ-ఫాం ఇవ్వడంతో బాలసాని లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై బుధవారం ఉదయం 10 గంటలకు తన ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే వందలాది మంది బాలసానిఅనుచరులు తమ నాయకునికి అన్యాయం జరిగిందంటూ అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. విలేకరుల సమావేశం ముగుస్తున్న సమయంలో....నామా తన నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు బాలసాని ఇంటికి వచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మద్దినేని స్వర్ణకమారి కూడా ఉన్నారు. వీరు బాలసాని ఇంటిముందు వాహనం నిలపగానే బాలసాని వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. నామా డౌన్‌డౌన్ అంటూ తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. అప్పటికే బాలసాని విలేకరుల సమావేశంలో నామాపై ఆగ్రహంతో మాట్లాడడంతో ఆయన అనుచరులు ఆవేశంతో ఉన్నారు. ఇదే సమయంలో నామా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నామాను ఇంట్లోకి రానివ్వకుండా బాలసాని అనుచరులు గేట్లు వేశారు. దీంతో నామా వెంట వచ్చిన నేతలు.. బాలసాని అనుచర నేతలు గేటు తీసే విషయంలో ఘర్షణకు దిగారు. ‘ఎంపీ డౌన్‌డౌన్.. నిన్ను గెలవనివ్వం, నామా గ్యోబాక్, బీసీలు లేకుండా ఎలా గెలుస్తారో చూస్తాం.. వెన్ను పోటు పొడుస్తావా..?’ అంటూ నామాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయడానికి వీలు లేని పదజాలంతో దూషించారు. చివరకు గేటు తీయాలని కార్యకర్తలను బాలసాని వారించడంతో నామా ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. అయితే తన ఇంట్లో విలేకరుల సమావేశం వద్ద ఏర్పాటు చేసిన ప్రాంగణం నుంచి నామాను కలిసేందుకు బాలసాని వెళ్లడానికి ప్రయత్నించినా.. ‘మీరు ఆయనను కలవడానికి వెళ్లొద్దు.. బీసీల పరువు తీయొద్దు’ అంటూ బాలసానిని అతని అనుచరులు అడుగు కదలనివ్వలేదు. అవమానంతో వెనుదిరిగిన నామా.. గంటపాటు ఇంట్లో కూర్చున్నా బాలసాని తన దగ్గరకు రాకపోవడంతో నామా వెనుదిరిగి పోయారు. మధ్యవర్తులుగా ఉన్న నేతలు బాలసానిని మీదగ్గరకు కార్యకర్తలు రానివ్వడం లేదని చెప్పడంతో ఆయన అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నామా వెళ్తుతున్న సమయంలోనూ బాలసాని అనుచరులు ‘నామా గోబ్యాక్, నిన్ను గెలవనివ్వవం’ అంటూ నినాదాలను మిన్నంటించారు. బాలసాని ఇంటికి నామా వచ్చారని, అక్కడ ఇరువురు నేతల అనుచరుల మధ్య వాగ్వాదం జరుగుతోందని తెలుసుకొని పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. అయితే పలువురు ‘టికెట్ బాలసానికి ఇచ్చారు కదా...గొడవెందుకని అసలు విషయం తెలియక మాట్లాడారు. రాత్రికి రాత్రే సీన్ మారిన విషయం కార్యకర్తలకు తెలియక తికమక పడ్డారు. బాలసానికి టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి.. బీ-ఫాం కోనేరు సత్యనారాయణకు ఇచ్చారన్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన వారంతా కూడా నామాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలను అణగదొక్కుతున్నారు.... టీడీపీ బీసీల పార్టీ అని, బీసీని సీఎం చేస్తానని, వంద సీట్లు బీసీలకు ఇస్తామని పార్టీ నేత ప్రకటిస్తే జిల్లాలో మాత్రం నాయకులు బీసీలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘ఖమ్మం జిల్లాలో 12 లక్షల మంది బీసీలున్నారు.. బీసీలకు ఒక్క సీటు ఇవ్వకుండా, మైకు పట్టుకొని వారి ఓట్లను నేను ఎలా అడగాలి.. వారికి ఏం సమాధానం చెబుతారు. నాకు కాకపోతే బీసీలైన నాగప్రసాద్, పంతంగి వెంకటేశ్వర్లు, వల్లంకొండ వెంకట్రామయ్య ఎవరికైనా టికెట్లు ఇవ్వవచ్చు కాదా.. నీ వెంట ఉండి, నిన్ను నమ్మిన వారికి కూడా టికెట్ ఇవ్వకుండా బీసీలను అవమానించారు. ఇప్పుడు బీసీలకు ఏం సమాధానం చెబుతారు’ అని ఆయన నామాపై ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు తనకు టికెట్ ఇస్తే రాత్రికిరాత్రే నామా నాగేశ్వరారావు కోనేరు చిన్నికి బీ-ఫాం తీసుకొచ్చి జిల్లాలో బీసీలను అవమానించారని మండిపడ్డారు. ‘పార్టీపై నీ పెత్తనం ఏంటీ, నీ జేబు సంస్థ అనుకున్నావా’అంటూ ఘాటుగా విమర్శించారు. ఎంపీగా నామినేషన్ వేస్తూ బీసీకి వచ్చిన సీటు ఆపడం ఎంతవరకు న్యాయమని బాలసాని ప్రశ్నించారు. బీసీలకు టికెట్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే మీకే నష్టం అన్నారు. పాలేరులో నాలుగు మండలాలు ఒకే సామాజిక వర్గం వారికి బాధ్యతలు ఇచ్చారని కార్యకర్తలు మొత్తుకున్నా పరిస్థితి మారలేదన్నారు. ఆర్థిక బలంతో వచ్చి పార్టీని నాశనం చేస్తున్నారని.. మీ వైఖరి మార్చుకోవాలని నామాను ఆయన హెచ్చరించారు. బీసీలకు అన్యాయం జరగడంతో ఈ ఎన్నికల్లో 30వ తేదీ వరకు తాను ఎక్కడికి ప్రచారానికి వెళ్లనన్నారు. చంద్రబాబు వచ్చినా ఆయనను మర్యాదపూర్వకంగా కలుస్తానే తప్ప.. ప్రచారానికి వెళ్లనని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆయన వెంట బీరెడ్డి నాగచంద్రారెడ్డి, శెట్టి రంగారావు, చింతనిప్పు కృష్ణచైతన్య, బుడిగం శ్రీను ఉన్నారు. -
నామాపై బాలసాని ఫైర్
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: తెలుగు ‘తమ్ముళ్లు’ మరోసారి వీధి పోరాటాలకు దిగారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుపై తుమ్మల వర్గీయులు మరోసారి బహిరంగ విమర్శలకు దిగారు. తుమ్మలకు టికెట్ అడుక్కోవాల్సిన అవసరం లేదని, నిన్నగాక మొన్న వచ్చిన నాయకుల పెత్తనమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంనగరంలోని తుమ్మల క్యాంప్ కార్యాలయానికి శనివారం 300 మంది కార్యకర్తలు చేరుకున్నారు. తుమ్మల ఖమ్మం నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడారు. జిల్లా అభివృద్ధిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పాత్రేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 1982లో టీడీపీ స్థాపించిన సమయంలో జిల్లాలో కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ ఉందని, ఈ 33 సంవత్సరాలుగా పార్టీని నడిపి బలమైన శక్తిగా తయారు చేసింది తుమ్మల నాగేశ్వరరావేనని అన్నారు. మంత్రిగా పని చేసిన కాలంలో తుమ్మల జిల్లాలోని 46 మండలాల్లో అభివృద్ధి పనులు చేశారని, అందుకు గుర్తుగా ప్రతీ గ్రామంలో శిలాఫలకాలు ఉన్నాయని అన్నారు. తెల్దారుపల్లి, మొద్దులపల్లి గ్రామాల్లో పార్టీ జెండాలు కట్టింది ఎవరో అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ అడుక్కోవాల్సి వస్తే ఇంక విలువేముందని ప్రశ్నించారు. అయన చేసిన అభివృద్ధికి జిల్లాలో ఎక్కడి నుంచి అయిన పోటి చేసే అర్హత ఉందన్నారు. తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని స్వర్ణకుమారికి అన్యాయం చేస్తున్నాడని ఎంపీ నామా పరోక్షంగా మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పార్టీలో ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో అందరికీ తెలుసని, స్వర్ణకుమారికి అన్యాయం చేసింది నామానేనని ఆరోపించారు. ఉద్యోగం చేసుకుంటున్న స్వర్ణకుమారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఖమ్మం ఎంపీ టికెట్ ఇప్పించింది తుమ్మల నాగేశ్వరరావేనని గుర్తు చేశారు. అప్పట్లో రేణుకాచౌదరిపై ఆమె కేవలం 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వర్ణకుమారి స్థానాన్ని నామా నాగేశ్వరరావు లాక్కుని ఆమెకు అన్యాయం చేశారని అన్నారు. ఎంపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. ఇన్ని సంవత్సరాలు కార్యకర్తలు ఎక్కడా ఇబ్బంది పడలేదని అన్నారు. సీటు కావాలంటే హైదరాబాద్‌లో ఉండి పైరవీలు చేసుకోవచ్చిని, కానీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఏజెన్సీలో ప్రచారం చేస్తున్నామని అన్నారు.తుమ్మలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అదే జరిగితే ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు ఏడు నియోజవర్గాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాస్తామని అన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తా : తుమ్మల ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఉంటాయని, కార్యకర్తలు వారి అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు.కానీ దానిని నిర్ణయించే శక్తి తన చేతుల్లో లేదని, పార్టీ అధినేత నిర్ణయించాల్సిందేనని అన్నారు. అధిష్టానం ఆదేశించిన విధంగా తాను ముందుకు పోతానని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకులు గాజుల ఉమామహేశ్వరరావు, పంతంగి వెంకటేశ్వర్లు, మదార్‌సాహెబ్, భీరెడ్డి నాగ చంద్రరెడ్డి, రాయపూడి జయకర్, హన్మంతరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. -
తన్నుకున్న ‘తమ్ముళ్లు’
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు... ఆ పార్టీ జిల్లా నేత, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర్రావు సాక్షిగానే ఈ ఘర్షణ చోటుచేసుకుంది. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగడంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఒకరోజు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తమ్ముళ్ల వీరంగం ప్రత్యక్షంగాచూసిన తుమ్మల, బాలసాని లక్ష్మీనారాయణ డివిజన్ కేంద్రం లోని పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కకుండానే వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం తుమ్మల, బాలసానిని రప్పించి నియోజకవర్గంలో తమ బలాన్ని చాటుకునేందుకు టీడీపీ నాయకులు ఎత్తుగడ వేశారు. ఈ నేపథ్యంలో వారిరువురూ వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో సాయంత్రం వరకూ ప్రచారం నిర్వహించి, చివరకు భద్రాచలం చేరుకున్నారు. వారికి స్వాగతం పలికేందుకు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌కు పట్టణ టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. అయితే మొదటి నుంచీ రెండు వర్గాలు విడిపోయి కార్యక్రమాలు చేపడుతున్న నాయకులు తుమ్మల, బాలసానికి స్వాగతం పలికే విషయంలోనూ గ్రూపులు కట్టారు. పార్టీ పట్టణ అధ్యక్షుడైన కుంచాల రాజారామ్ తుమ్మల వాహనం వద్దకు వెళ్తుండగా, మరో వర్గం వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్రమైన తోపులాట జరిగింది. ఒక దశలో కర్రలు పట్టుకొని వీరంగం చేయటంతో పాటు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పరిస్థితి గమనించిన తుమ్మల, బాలసాని కాసేపు మాత్రమే ప్రసంగించి వెళ్లిపోయారు. ప్రచారం తరువాత పార్టీ డివిజన్ కార్యాలయంలో కార్యకర్తలకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారని నాయకులు భావించినప్పటికీ వారు కార్యాలయం మెట్లు కూడా ఎక్కకుండానే వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీలోని నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. డబ్బ పంపకాల్లో ఆలస్యమే కారణమా... భద్రాచలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతైనా ఖర్చు పెడతానని పార్టీ జిల్లా నేతల ముందు ఓ నాయకుడు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికల రోజు సమీపిస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంపై ఇరు వర్గాల నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని పార్టీ జిల్లా నేతలైన తుమ్మల, బాలసానికి ఫిర్యాదు చేసేందుకు రెండు వర్గాల వారు సిద్ధమయ్యారు. దీంతో తన బండారం ఎక్కడ బయట పడుతుందోనని భావించిన ఆ నాయకుడు కావాలనే ఇలా గొడవ చేయించారని ఆ పార్టీ నాయకులు బాహాటంగానే చెపుతున్నారు. తుమ్మల, బాలసాని పార్టీ కార్యాలయానికి వచ్చాక ఈ విషయమై తాడోపేడో తేల్చుకుందామని నాయకులంతా భావింంచారు. అయితే డబ్బుల పంపకం బాధ్యతలు చూసే సదరు నాయకుడు ఈ విషయాన్ని గమనించి చాకచక్యంగా వ్యవహరించారని, ఈ క్రమంలోనే వారిరువురు కార్యాలయానికి రాకుండా వెళ్లపోయారని పార్టీ నాయకులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు పంపకాల్లో వచ్చిన విభేదాలతో తెలుగు తమ్ముళ్లు తన్నుకోవటం చూసిన వారంతా ప్రజలకు వీరేం సేవ చేస్తారని చర్చించుకోవటం కనిపించింది.