సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోడ్డెక్కింది. టికెట్ కేటాయింపు విషయంలో తమ నేతకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఎంపీ నామానాగేశ్వరరావును ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వర్గీయులు అడ్డుకుని దూషణకు దిగారు. బాలసాని ఇంటికి వచ్చిన నామాను లోపలికి వెళ్లకుండా అటకాయించగా....ఎట్టకేలకు నామా లోపలికి వెళ్లి గంటసేపు ఇంట్లో కూర్చున్నా బాలసాని కలవకపోవడంతో తీవ్రపరాభవంతో వెనుదిరిగారు.
బుధవారం జరిగిన ఈ సంఘటనలకు సంబంధించి వివరాలు...
కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి.. కొత్తగూడెం నియోకజవర్గ ఇన్‌చార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని)కి బీ-ఫాం ఇవ్వడంతో బాలసాని లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై బుధవారం ఉదయం 10 గంటలకు తన ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే వందలాది మంది బాలసానిఅనుచరులు తమ నాయకునికి అన్యాయం జరిగిందంటూ అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. విలేకరుల సమావేశం ముగుస్తున్న సమయంలో....నామా తన నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు బాలసాని ఇంటికి వచ్చారు.
ఆయన వెంట ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మద్దినేని స్వర్ణకమారి కూడా ఉన్నారు. వీరు బాలసాని ఇంటిముందు వాహనం నిలపగానే బాలసాని వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. నామా డౌన్‌డౌన్ అంటూ తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. అప్పటికే బాలసాని విలేకరుల సమావేశంలో నామాపై ఆగ్రహంతో మాట్లాడడంతో ఆయన అనుచరులు ఆవేశంతో ఉన్నారు. ఇదే సమయంలో నామా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నామాను ఇంట్లోకి రానివ్వకుండా బాలసాని అనుచరులు గేట్లు వేశారు. దీంతో నామా వెంట వచ్చిన నేతలు.. బాలసాని అనుచర నేతలు గేటు తీసే విషయంలో ఘర్షణకు దిగారు.
‘ఎంపీ డౌన్‌డౌన్.. నిన్ను గెలవనివ్వం, నామా గ్యోబాక్, బీసీలు లేకుండా ఎలా గెలుస్తారో చూస్తాం.. వెన్ను పోటు పొడుస్తావా..?’ అంటూ నామాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయడానికి వీలు లేని పదజాలంతో దూషించారు. చివరకు గేటు తీయాలని కార్యకర్తలను బాలసాని వారించడంతో నామా ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. అయితే తన ఇంట్లో విలేకరుల సమావేశం వద్ద ఏర్పాటు చేసిన ప్రాంగణం నుంచి నామాను కలిసేందుకు బాలసాని వెళ్లడానికి ప్రయత్నించినా.. ‘మీరు ఆయనను కలవడానికి వెళ్లొద్దు.. బీసీల పరువు తీయొద్దు’ అంటూ బాలసానిని అతని అనుచరులు అడుగు కదలనివ్వలేదు.
అవమానంతో వెనుదిరిగిన నామా..
గంటపాటు ఇంట్లో కూర్చున్నా బాలసాని తన దగ్గరకు రాకపోవడంతో నామా వెనుదిరిగి పోయారు. మధ్యవర్తులుగా ఉన్న నేతలు బాలసానిని మీదగ్గరకు కార్యకర్తలు రానివ్వడం లేదని చెప్పడంతో ఆయన అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నామా వెళ్తుతున్న సమయంలోనూ బాలసాని అనుచరులు ‘నామా గోబ్యాక్, నిన్ను గెలవనివ్వవం’ అంటూ నినాదాలను మిన్నంటించారు. బాలసాని ఇంటికి నామా వచ్చారని, అక్కడ ఇరువురు నేతల అనుచరుల మధ్య వాగ్వాదం జరుగుతోందని తెలుసుకొని పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. అయితే పలువురు ‘టికెట్ బాలసానికి ఇచ్చారు కదా...గొడవెందుకని అసలు విషయం తెలియక మాట్లాడారు. రాత్రికి రాత్రే సీన్ మారిన విషయం కార్యకర్తలకు తెలియక తికమక పడ్డారు. బాలసానికి టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి.. బీ-ఫాం కోనేరు సత్యనారాయణకు ఇచ్చారన్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన వారంతా కూడా నామాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీసీలను అణగదొక్కుతున్నారు....
టీడీపీ బీసీల పార్టీ అని, బీసీని సీఎం చేస్తానని, వంద సీట్లు బీసీలకు ఇస్తామని పార్టీ నేత ప్రకటిస్తే జిల్లాలో మాత్రం నాయకులు బీసీలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘ఖమ్మం జిల్లాలో 12 లక్షల మంది బీసీలున్నారు.. బీసీలకు ఒక్క సీటు ఇవ్వకుండా, మైకు పట్టుకొని వారి ఓట్లను నేను ఎలా అడగాలి.. వారికి ఏం సమాధానం చెబుతారు. నాకు కాకపోతే బీసీలైన నాగప్రసాద్, పంతంగి వెంకటేశ్వర్లు, వల్లంకొండ వెంకట్రామయ్య ఎవరికైనా టికెట్లు ఇవ్వవచ్చు కాదా.. నీ వెంట ఉండి, నిన్ను నమ్మిన వారికి కూడా టికెట్ ఇవ్వకుండా బీసీలను అవమానించారు.
ఇప్పుడు బీసీలకు ఏం సమాధానం చెబుతారు’ అని ఆయన నామాపై ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు తనకు టికెట్ ఇస్తే రాత్రికిరాత్రే నామా నాగేశ్వరారావు కోనేరు చిన్నికి బీ-ఫాం తీసుకొచ్చి జిల్లాలో బీసీలను అవమానించారని మండిపడ్డారు. ‘పార్టీపై నీ పెత్తనం ఏంటీ, నీ జేబు సంస్థ అనుకున్నావా’అంటూ ఘాటుగా విమర్శించారు. ఎంపీగా నామినేషన్ వేస్తూ బీసీకి వచ్చిన సీటు ఆపడం ఎంతవరకు న్యాయమని బాలసాని ప్రశ్నించారు. బీసీలకు టికెట్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే మీకే నష్టం అన్నారు. పాలేరులో నాలుగు మండలాలు ఒకే సామాజిక వర్గం వారికి బాధ్యతలు ఇచ్చారని కార్యకర్తలు మొత్తుకున్నా పరిస్థితి మారలేదన్నారు. ఆర్థిక బలంతో వచ్చి పార్టీని నాశనం చేస్తున్నారని.. మీ వైఖరి మార్చుకోవాలని నామాను ఆయన హెచ్చరించారు.
బీసీలకు అన్యాయం జరగడంతో ఈ ఎన్నికల్లో 30వ తేదీ వరకు తాను ఎక్కడికి ప్రచారానికి వెళ్లనన్నారు. చంద్రబాబు వచ్చినా ఆయనను మర్యాదపూర్వకంగా కలుస్తానే తప్ప.. ప్రచారానికి వెళ్లనని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆయన వెంట బీరెడ్డి నాగచంద్రారెడ్డి, శెట్టి రంగారావు, చింతనిప్పు కృష్ణచైతన్య, బుడిగం శ్రీను ఉన్నారు.
నామా..గోబ్యాక్
Published Thu, Apr 10 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
Advertisement
Advertisement