ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయం ఇందుకు వేదికగా మారింది. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో టీడీపీ ఓటమికి కారణం మీరంటే.. మీరేంటూ పరస్పరం దూషణలకు దిగిన తెలుగు తమ్ముళ్లు ఏకంగా తన్నుకున్నారు. మధ్యలో సర్దిచెప్పేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కూడా బలవంతంగా నెట్టేసి మరీ ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఎన్నికల్లో తన ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకు తుమ్మల తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం సమావేశం అయ్యారు.
అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తుమ్మలను కలిసేందుకు పలువురు నాయకులు అక్కడికి చేరుకున్నారు. బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎక్కడెక్కడ తగ్గాయి.. అనే లెక్కలు చూసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నాయకులు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బాలసానికి సీటు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారిందని, దీంతో తాను ప్రచారం చేయబోనని బాలసాని చెప్పడం వల్లే భారీ నష్టం వాటిల్లిందని తుమ్మలకు వివరించారు. దీంతో కార్యకర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. వెంటనే తుమ్మల వారందరికీ సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆదే సమయంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతనిప్పు కృష్ణచైతన్య తుమ్మల క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయనను చూసిన తెలుగుయువత జిల్లా నాయకుడు గొల్లపూడి హరికృష్ణ అగ్రహంతో ఉగిపోతూ, తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో కృష్ణచైతన్య, హరికృష్ణ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ‘నువ్వెంతంటే నువ్వెంత’ అంటూ తన్నుకున్నారు. దీనిని అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వెళ్లగా ఆయనను కూడా నెట్టివేసి మరీ కొట్టుకున్నారు. ఘర్షణ విషయం పోలీసులకు తెలియడంతో వారు వచ్చి ఇరువర్గాలను క్కడి నుంచి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది.
తమ్ముళ్ల కుమ్ములాట
Published Mon, May 19 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement