టీడీపీకి తుమ్మల రాజీనామా
ఖమ్మంలో పార్టీకి కోలుకోలేని దెబ్బ
చంద్రబాబుకు ఏకవాక్య రాజీనామా లేఖ ఫ్యాక్స్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన ఖమ్మం జిల్లా సీనియర్ నేత , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 31 ఏళ్లుగా టీడీపీతో ఏర్పరచుకున్న బంధాన్ని ఏకవాక్య లేఖతో ఆయన తెంచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన శనివారం ప్రకటించారు. అనారోగ్యంతో కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఖమ్మం వచ్చిన రోజే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు.
ఆయనతో పాటు ఇటీవలే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయిన గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటు ఇంకా జిల్లా పార్టీ అనుబంధ సంఘాల నేతలు, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ కూడా తుమ్మల బాటలోనే పయనించనున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన వచ్చే నెల ఐదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించలేదు. తనను 30 ఏళ్లుగా నమ్ముకున్న నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమని, త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ తథ్యమని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
నేను రాజీనామా చేస్తున్నా...!
31 ఏళ్లుగా పార్టీలో ఉండి అనేక ఉత్థానపతనాలను చవిచూసిన తుమ్మల నాగేశ్వరరావు ‘నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. దయచేసి ఆమోదించగలరు.’ అనే ఒకేఒక్క వాక్యంతో ఉన్న లేఖను టీడీపీ అధినేతకు ఫ్యాక్స్ చేయడం చర్చనీ యాంశమయింది. పార్టీలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయాన్ని లేఖలో చెప్పకుండా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాత్రమే రాయడం గమనార్హం. తుమ్మల రాజీనామాతో జిల్లా టీడీపీకి ఇప్పుడు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మరికొందరు నేతలు పార్టీలోనే కొనసాగనున్నారు. అయితే, తుమ్మల రాజీనామాతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా అదే బాటలో పయనించనుం దని, దాదాపు 80 శాతం నేతలు, కార్యకర్తలు ఆయనతో వెళ్లిపోతారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.