సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా తెలుగుదేశం పార్టీలో అలజడి కనిపిస్తోంది. పార్టీకి మొదటి నుంచీ కలిసి రాని ఆగస్టు నెల ఆ పార్టీ శ్రేణులను అతలాకుతలం చేస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడి వెళుతున్నారన్న సంకేతాలు రోజురోజుకూ బలపడుతుండడంతో తెలుగు తమ్ముళ్లలో కదలికలు ముమ్మరమయ్యాయి. అసలీ అలజడికి కారణమైన తుమ్మల అనారోగ్యంతో హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయన అనుచరులు మాత్రం జిల్లాలో హంగామా సృషి్టస్తున్నారు.
మరోవైపు, పార్టీకి చెందిన మరో కీలక నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. తన వర్గం నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలోనే ఉండాలని కోరుతున్నారు. నేతల పరిస్థితి అలా ఉంటే.. అనుచరులు మాత్రం జిల్లా కేంద్రంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నేతలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ నాయకులతో పాటు పార్టీ తరఫున గెలిచిన వార్డు మెంబర్ల నుంచి జడ్పీటీసీల వరకు తమ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే పనిలో పడ్డారు.
ఇక, జిల్లాలో ముఖ్య నాయకులైన వారిలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తుమ్మలకే జై కొట్టారు. ఇరువురూ తాము తుమ్మల వైపే ఉంటామని స్పష్టం చేశారు. అయితే, నామా వర్గానికి చెందిన ముఖ్య నాయకులు మాత్రం ఒక్కమాట మీదే ఉన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, వచ్చే నెల ఐదో తేదీన టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తుమ్మల ఆ పార్టీలో చేరతారని, ఈ మేరకు నిర్ణయం జరిగిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కేసీఆర్, తుమ్మల... నిలువెత్తు ఫొటోలు
తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారన్న ప్రచారం ముమ్మరమైన నాటి నుంచే ఆయన అనుచరులు గులాబీ రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తుమ్మలకు మద్దతుగా నిలుస్తామని చెపుతున్నారు. కానీ, బుధవారం జిల్లా కేంద్రంలో కనిపించిన ఓ ఫ్లెక్సీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా కేసీఆర్, తుమ్మల నిలువెత్తు ఫొటోలతో ‘జై కేసీఆర్... జై తెలంగాణ... జై తుమ్మల’ అని రాసి తుమ్మలకు స్వాగతం చెపుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీని చూసిన వారంతా ఇక తుమ్మల చెప్పినా చెప్పకపోయినా ఆయన టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు.
అయితే, తుమ్మల మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. మరోవైపు నామా వర్గం నాయకులు, ఇతర టీడీపీ అభిమానులు కూడా పోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం లేదని, 2019లో అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని పేర్కొంటూ పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్, సినీ నటుడు పవన్‌కల్యాణ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం సత్తుపల్లిలో ప్రారంభమయిన ఈ ఫ్లెక్సీల కలకలం ఇప్పుడు జిల్లా కేంద్రంలో రాజకీయ వర్గాలకు మంచి మజా అందిస్తోంది.
బాసటగా మరో ఇద్దరు నాయకులు...
పార్టీ నుంచి వెళ్లిపోయినా తాము తుమ్మల వెంటే ఉంటామని ప్రకటించే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే స్థానిక నేతలు చాలా మంది ఆయనకు మద్దతుగా ఉంటామని చెపుతుండగా, బుధవారం మరో ఇద్దరు ముఖ్య నాయకులు ఆయనకు బాసటగా నిలిచారు. మొదటి నుంచీ తుమ్మల వెంటే నడుస్తున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తుమ్మలకే మద్దతు ప్రకటించారు.
అధికారికంగా మీడియాతో చెప్పకపోయినా బుధవారం ఖమ్మంలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసుకుని తుమ్మలతోనే ఉందామని చెప్పినట్టు సమాచారం. ఇక, అవసరమైతే తన పదవికయినా రాజీనామా చేస్తాను కానీ టీడీపీ వదిలి వెళ్లేది లేదని మొదట చెప్పిన డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు బుధవారం అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకున్నారు.
తాను కూడా తుమ్మల బాటలోనే పయనిస్తానని ఆయన మీడియాతో చెప్పారు. నామా వైఖరి వల్లే జిల్లాలో పార్టీ నష్టపోతోందని, గత పదేళ్లుగా తుమ్మలను టీడీపీ మనోవేదనకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇదే ఆవేదన జిల్లాలోని తుమ్మల అనుచరుల్లో వ్యక్తమవుతోంది. పార్టీలో ఉండి అవమానాల పాలయ్యే దానికన్నా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడమే మేలని, తుమ్మల సరైన నిర్ణయమే తీసుకున్నారని ఆయన అనుచరులు సమర్థించుకుంటున్నారు. ఇక, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.
నామా వర్గానికి చెందిన నాయకులు పోట్ల నాగేశ్వరరావు, మద్దినేని బేబీస్వర్ణకుమారి, కోనేరు చిన్ని, ఫణీశ్వరమ్మ తదితరులు నామా వెంటే ఉండాలని నిర్ణయించుకున్నారు. తుమ్మల వెళ్లినా తామే పార్టీని నడిపించుకుంటామని వారు చెపుతున్నారు. అయితే, ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కొండబాల కోటేశ్వరరావు మాత్రం టీడీపీలోనే ఉండాలా, తుమ్మలతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకోవాలా అన్నదానిపై తేల్చుకోలేకపోతున్నారు. చివర్లో ఆయన కూడా తుమ్మలతో కలిసే వెళతారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
ఎక్కడ చూసినా ఇదే చర్చ...
జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఇప్పుడు తుమ్మల పార్టీ మార్పుపైనే చర్చించుకుంటున్నారు. ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల నేతలు బహిరంగంగా, రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తూ తాము ఎటు వైపు వెళ్లాలనేది నిర్ణయించుకుంటున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీ డీపీలోనే ఉన్నప్పటికీ నగర పంచాయతీ పాలకవర్గమంతా తుమ్మలతోనే ఉంటామని స్పష్టం చేసింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత ఇప్పటికే తుమ్మలకు జై కొట్టగా, పార్టీ తరఫున గెలిచిన మెజార్టీ జడ్పీటీసీలు కూడా తుమ్మల బాటలోనే వెళ్లనున్నారు. ఇక, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు... ఇలా అన్ని స్థాయిల్లోని నేతలు కూడా తాము ఎటు వెళ్లాలనేదానిపై ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా చూస్తే సగం కంటే ఎక్కువ మంది నేతలు తుమ్మలతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇక, నామా వర్గానికి చెందిన వారంతా తుమ్మల వెళ్లినా తామే పార్టీని నడిపించుకుంటామంటున్నారు. ఆ వర్గానికి చెందిన ముఖ్య నాయకులు, క్షేత్రస్థాయి కేడర్ కూడా ఇదే మాటపై ఉన్నారు. నామా కూడా ఖమ్మంలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయానికి వెళ్లిన నామా తన వర్గం నేతలతో సమావేశమయ్యారు. ఆయన నివాసం వద్ద కూడా అనుచరుల హంగామా కనిపించింది. మొత్తంమీద తుమ్మల పార్టీ మార్పు వ్యవహారం జిల్లా పార్టీలో హల్‌చల్ చేస్తోందని, ఒకరకంగా చెప్పాలంటే జిల్లా తెలుగుదేశం పార్టీకి తుమ్మల ‘ఫీవర్’ పట్టుకుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
టీడీపీకి తుమ్మల ‘ఫీవర్’
Published Thu, Aug 28 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement
Advertisement