జిల్లాను ఆవరించిన రాజకీయ స్తబ్ధత
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : రాజకీయ చైతన్య గుమ్మమైన ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం నిస్తేజం అలుముకుంది. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల క్యాడర్ నైరాశ్యంలో ఉంది. క్షేత్రస్థాయిలో కార్యక్రమాల నిర్వహణకు ఆయా పార్టీల కార్యకర్తలు ముందుకు రావడం లేదు.
జిల్లా రాజకీయాల్లో మూడు నెలల క్రితం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలకనేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం, ఆయన అనుచరులు సైతం పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి చేరడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారింది. తుమ్మల టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయనకు మంత్రి పదవి లభిస్తుందని ఆశించిన అనుచరులు, తెలంగాణ వాదులకు ఆ ఘడియ ఎప్పుడెప్పుడా అని వేచి చూడటమే సరిపోతోంది.
తుమ్మలతో పాటు టీడీపీ నుంచి అనేకమంది ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లడం, ఆ పార్టీ నుంచి అధికారిక పదవులను ఆశిస్తున్నా ప్రభుత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో జిల్లాలో కొందరు నేతలు పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. టీడీపీ నుంచి తుమ్మలతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య తదితరులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా, వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, ఇల్లెందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోరం కనకయ్య కూడా ఈ ఐదు నెలల పరిణామాల్లో గులాబీ గూటికి చేరారు.
దీంతో జిల్లాలో టీఆర్‌ఎస్ కొంతమేర బలం పుంజుకున్నా.. ఇప్పటికే పటిష్టంగా ఉన్న ఉభయ కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా కార్యక్రమాలు నిర్వహించడంలో మాత్రం వెనుకంజలోనే ఉంది. పార్టీ పటిష్టతకు పాటుపడేందుకు అధికారిక పదవులు అవసరమన్న భావన ఆ పార్టీ నేతలు కొందరిలో నెలకొని ఉండటంతో గులాబీ పార్టీలో ఈ రాజకీయ నిస్తేజం అలముకుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకట్రావుతో సహా ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. జిల్లా పాలనపై తమదైన ముద్ర వేయడానికి ఆ పార్టీ నేతలు కొందరు ప్రయత్నిస్తున్నా అధికారిక వ్యవహారాలపై పూర్తిస్థాయిలో ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోవడంతో వారు తమ అనుచరులకు న్యాయం చేయలేకపోతున్నారు.
రాష్ర్ట మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభిస్తుందన్న ఆశతో పార్టీ శ్రేణులు ఊహల పల్లకిలో విహరించడం.. ఇప్పుడే కాదని రాష్ట్ర నాయకత్వం నుంచి సమాచారం రావడంతో మూడు నెలలుగా జిల్లా పార్టీ కార్యకలాపాల్లో స్తబ్ధత నెలకొంటోంది. జిల్లాలో కీలకమైన పలు అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. మంత్రివర్గంలో జిల్లాకు స్థానం లేకపోవడమే దీనికి కారణమని, జిల్లా పాలనా బాధ్యతలను అధికారికంగా ముఖ్య నేతలకు అప్పగించేందుకే కీలక పోస్టులను భర్తీ చేయడం లేదని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు సైతం తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ చేయూత కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఇద్దరు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో కీలక అధికారులను మార్చుకునేందుకు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు మోక్షం కల్పించేందుకు రెండు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా అవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అలాగే జిల్లాలో కీలకమైన పోలీస్ అధికారుల బదిలీకి సంబంధించి పార్టీ నేతలు చేసిన సిఫార్సులు ఏ మేరకు ఫలిస్తాయోనన్న అంశం సైతం త్వరలో జరగనున్న బదిలీలో తేలనుంది. జిల్లానుంచి కనీసం నలుగురు డీఎస్పీలను బదిలీ చేసి తమకు నచ్చిన వారిని తెచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్‌లోనూ రాజకీయ స్తబ్ధతే..
జిల్లా కాంగ్రెస్ పార్టీలోనూ రాజకీయ నైరాశ్యం అలముకుంది. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఈ ప్రభావం తీవ్రంగా చూపుతోంది. జిల్లాలో 3లక్షల మంది సభ్యులుగా చేర్పించాలని ఈ నెల ఒకటిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో నిర్ణయించిన జిల్లా కాం గ్రెస్ పెద్దలు.. అందుకు అనుగుణంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయలేకపోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పట్టు కోసం ‘దేశం’ యత్నం...
టీడీపీలోనూ సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. సీనియర్ నేతలు పార్టీని వీడినా జిల్లా లో పట్టు సడలలేదన్న భావన కల్పించేందుకు ‘దేశం’ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను పార్టీ సభ్యులుగా చేరేవారికి బీమా సౌకర్యం సైతం కల్పించడం, సభ్యత్వాన్ని కం ప్యూటరీకరించడం వంటి కొత్త హంగులతో కార్యకర్తలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోరుబాటలో వైఎస్సార్‌సీపీ...
జిల్లాలో రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోరుబాట పట్టారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తేవడంతోపాటు పత్తి కొనుగోళ్లపై సీసీఐ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై కేంద్ర, రాష్ట్ర మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో పూర్తిగా నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం, జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులను ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, అప్రమత్తం చేయడం వంటి కార్యక్రమాలతో పార్టీకి నూతనోత్తేజం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు జిల్లాలో వినియోగిస్తున్న తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఈ నిధుల వినియోగంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశంలో ప్రజా సమస్యలపై ఆయన సంధించిన అస్త్రాలు, అధికారుల నుంచి నిధుల వినియోగానికి సంబంధించి రాబట్టిన సమాధానాలు సీనియర్ రాజకీయ నేతలను, సీనియర్ అధికారులను సైతం ఆశ్చర్యపరిచాయి.
పొంగులేటి సమగ్ర అవగాహనతో ప్రభుత్వ అధికారులతో సమస్యలపై చర్చిస్తున్న తీరు పరిష్కారానికి దోహదపడుతున్నాయనే భావన సాధారణ ప్రజల్లో సైతం నెలకొంది. ఇప్పటికే పలుమార్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి పత్తి కొనుగోళ్లపై అధికారులు అనుసరిస్తున్న వైఖరి, రైతులకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన పొంగులేటి.. జిల్లాలో విషజ్వరాల ప్రభావంతో ఏజన్సీలో సంభవించిన మరణాలపై ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేశారు. అశ్వారావుపేట, పినపాక శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించడంతోపాటు సమస్యల సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించారు. ఇలా నూతనోత్తేజంతో కార్యకర్తలను కదిలించేందుకు నాయకత్వం కృషి చేస్తోంది.
ఆందోళనల దిశగా వామపక్షాలు...
ప్రజా సమస్యలపై ఆందోళన చేసేందుకు వామపక్ష పార్టీలు సైతం సిద్ధమవుతున్నాయి. రైతుల సమస్యలపై సీపీఎం పోరుబాటకు నడుం బిగించగా, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు సీపీఐ సమాయత్తమవుతోంది. వచ్చే మార్చిలో జిల్లాలో తొలి రాష్ట్ర మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఇక పోలవరం ముంపు మండలాల ప్రజలకు జరిగిన అన్యాయాలపై పోరుబాట పట్టేందుకు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సిద్ధమవుతోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో కొంత రాజకీయ హడావుడి కనిపిస్తున్నా పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.