సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీ జిల్లా కీలకనేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది ఇటు టీడీపీ శ్రేణుల్లో, అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా చాలా కాలంగా మౌనంగా ఉంటున్న ఒకప్పటి టీడీపీ లెజెండ్ ఇప్పుడు ఏం చేస్తారన్నది చర్చనీయాంశమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు విశ్వసించే అతితక్కువ మంది నాయకుల్లో ఒకడిగా ఉన్న తుమ్మల... మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్రమంగా ఆయనకు దూరమయ్యారనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.
నామాతో ఎన్ని విభేదాలు వచ్చినా... తన వర్గానికి చెందిన నేతలను, తనను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా తుమ్మల ఇన్నాళ్లూ మౌనంగానే ఉన్నారని, ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న కారణంగా మళ్లీ ఇప్పుడు క్రియాశీలమవుతున్నారని ఆయన అనుచరగణం అంటోంది. ఇంతకాలం ఏం జరిగినా చూసీ చూడనట్లు వెళ్లిపోయిన మాజీ మంత్రి ఇప్పుడు ఘాటైన వ్యాఖ్యలే చేస్తుండడం గమనార్హం. అటు పార్టీలోని తన ప్రత్యర్థులను, ఇటు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించేందుకు కూడా సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావుతో ఉన్న విభేదాల కారణంగా పార్టీలోని ఓ వర్గానికి నాయకత్వం వహిస్తున్న తుమ్మల ఇప్పుడు ఏ స్టెప్ వేస్తారన్నదే జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్.
నామానే టార్గెట్
తుమ్మల తాజా వ్యాఖ్యలు, చర్యలు ఆసక్తిని రేపుతున్నాయి. నామా ఆధిపత్యాన్ని సహించలేక అటు హైదరాబాద్‌లో, ఇటు ఖమ్మంలో జరిగిన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి సమావేశాలకు డుమ్మా కొడుతూ, తన అనుచరుల చేత కూడా ఆయన డుమ్మా కొట్టించి నిరసన తెలియజేశారు. ఇటీవల తె లంగాణస్థాయిలో జరిగిన పార్టీ సమావేశానికి కూడా ఆయన వెళ్లలేదు. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. మళ్లీ ఖమ్మం నియోజకవర్గ సమన్వయ సమావేశం పేరుతో ఆయన పూర్తిస్థాయిలో తెరపైకి వచ్చారు. వచ్చిందే తడవుగా తన ప్రత్యర్థి నామా నాగేశ్వరరావుపై పరోక్షంగా మాటల తూటాలు పేల్చారు.
పదవుల కోసం వచ్చిన వారి వల్లే పార్టీ భ్రష్టుపడుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలు నామా శిబిరంపై దాడిగానే చెప్పవచ్చు. తనను ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారని, తానెప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని చెప్పడం ద్వారా తన ప్రత్యర్థుల వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు. అదేవిధంగా ఆయన అధిష్టానానికి కూడా హెచ్చరిక సంకేతాలను పంపారు. తనకు కార్యకర్తలే హైకమాండ్ అని, వారి మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటానని చెప్పడం ద్వారా అవసరమైతే పార్టీ నుంచి దూరమయ్యేందుకు కూడా తాను వెనుకంజ వేయబోనని ఆయన స్పష్టం చేసినట్లయింది. మరోవైపు ఖమ్మం పట్టణంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అనుచరగణంతో భారీ ర్యాలీ నిర్వహించి ఆయన ఎన్నికల సందడిని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తుమ్మల తాజా వ్యాఖ్యలు, చర్యలపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అధినేత తీరుపైనా గుర్రు...
కాగా, పార్టీ అధినాయకుడి వ్యవహారశైలిపై కూడా తుమ్మల గుర్రుగానే ఉన్నారు. నామా వర్గానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని, తెలంగాణలోనే సీనియర్ నాయకుడినైన తనను విస్మరిస్తున్నారనే ఆవేదన ఆయనకు ఉందని అనుచరగణం చెపుతోంది. పార్టీ తెలంగాణ కమిటీని ఏర్పాటు చేసేందుకు బాబు ప్రయత్నిస్తుండగా, ఇందుకోసం కనీసం తుమ్మలను సంప్రదించలేదని తెలిసింది. పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్న తనను సంప్రదించకపోవడం, కమిటీ ఏర్పాటులో నామాకు ప్రాధాన్యం లభిస్తుందని ప్రచారం జరుగుతుండడం ఆయనకు రుచించడం లేదు.
ఇతర పార్టీలతోనూ మాట్లాడుతున్నారా?
ఇన్నాళ్లూ తుమ్మల మౌనంగా ఉండడంతో పార్టీ శ్రేణుల్లో మరో రకమైన ప్రచారం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీలో తుమ్మల ఇమడలేకపోతున్నారని, అటు చంద్రబాబు, ఇటు నామాల వ్యవహార శైలి కారణంగా ఆయన ఈసారి ఎన్నికలలో ఉంటే మౌనంగా ఉంటారని, లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోతారనే స్థాయిలో పుకార్లు వచ్చాయి. మరోవైపు తనకున్న సంబంధాలతో ఇతర పార్టీల నేతలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో నామాకు అడ్డుకట్ట వేయాలనే ఆయన వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే, తుమ్మల నిజంగానే ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపారా? జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మూలస్తంభమయిన ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతే పరిస్థితేంటి అనే అంశాలపై పార్టీ శ్రేణులు జోరుగానే చర్చించుకుంటున్నాయి.
తుమ్మల ఏం చేస్తారో?
Published Tue, Mar 4 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
Advertisement