ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: తెలుగు ‘తమ్ముళ్లు’ మరోసారి వీధి పోరాటాలకు దిగారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుపై తుమ్మల వర్గీయులు మరోసారి బహిరంగ విమర్శలకు దిగారు. తుమ్మలకు టికెట్ అడుక్కోవాల్సిన అవసరం లేదని, నిన్నగాక మొన్న వచ్చిన నాయకుల పెత్తనమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మంనగరంలోని తుమ్మల క్యాంప్ కార్యాలయానికి శనివారం 300 మంది కార్యకర్తలు చేరుకున్నారు. తుమ్మల ఖమ్మం నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడారు. జిల్లా అభివృద్ధిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పాత్రేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
1982లో టీడీపీ స్థాపించిన సమయంలో జిల్లాలో కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ ఉందని, ఈ 33 సంవత్సరాలుగా పార్టీని నడిపి బలమైన శక్తిగా తయారు చేసింది తుమ్మల నాగేశ్వరరావేనని అన్నారు. మంత్రిగా పని చేసిన కాలంలో తుమ్మల జిల్లాలోని 46 మండలాల్లో అభివృద్ధి పనులు చేశారని, అందుకు గుర్తుగా ప్రతీ గ్రామంలో శిలాఫలకాలు ఉన్నాయని అన్నారు. తెల్దారుపల్లి, మొద్దులపల్లి గ్రామాల్లో పార్టీ జెండాలు కట్టింది ఎవరో అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ అడుక్కోవాల్సి వస్తే ఇంక విలువేముందని ప్రశ్నించారు.
అయన చేసిన అభివృద్ధికి జిల్లాలో ఎక్కడి నుంచి అయిన పోటి చేసే అర్హత ఉందన్నారు. తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని స్వర్ణకుమారికి అన్యాయం చేస్తున్నాడని ఎంపీ నామా పరోక్షంగా మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పార్టీలో ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో అందరికీ తెలుసని, స్వర్ణకుమారికి అన్యాయం చేసింది నామానేనని ఆరోపించారు. ఉద్యోగం చేసుకుంటున్న స్వర్ణకుమారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఖమ్మం ఎంపీ టికెట్ ఇప్పించింది తుమ్మల నాగేశ్వరరావేనని గుర్తు చేశారు.
అప్పట్లో రేణుకాచౌదరిపై ఆమె కేవలం 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వర్ణకుమారి స్థానాన్ని నామా నాగేశ్వరరావు లాక్కుని ఆమెకు అన్యాయం చేశారని అన్నారు. ఎంపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. ఇన్ని సంవత్సరాలు కార్యకర్తలు ఎక్కడా ఇబ్బంది పడలేదని అన్నారు.
సీటు కావాలంటే హైదరాబాద్‌లో ఉండి పైరవీలు చేసుకోవచ్చిని, కానీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఏజెన్సీలో ప్రచారం చేస్తున్నామని అన్నారు.తుమ్మలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అదే జరిగితే ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు ఏడు నియోజవర్గాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాస్తామని అన్నారు.
కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తా : తుమ్మల
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఉంటాయని, కార్యకర్తలు వారి అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు.కానీ దానిని నిర్ణయించే శక్తి తన చేతుల్లో లేదని, పార్టీ అధినేత నిర్ణయించాల్సిందేనని అన్నారు. అధిష్టానం ఆదేశించిన విధంగా తాను ముందుకు పోతానని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకులు గాజుల ఉమామహేశ్వరరావు, పంతంగి వెంకటేశ్వర్లు, మదార్‌సాహెబ్, భీరెడ్డి నాగ చంద్రరెడ్డి, రాయపూడి జయకర్, హన్మంతరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.
నామాపై బాలసాని ఫైర్
Published Sun, Apr 6 2014 2:28 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement