పాలేరు షుగర్స్‌కు పంగ‘నామా’లు!
సాక్షి, ఖమ్మం: టీడీపీ అధినేత చంద్రబాబు కోటరీలో కీలక వ్యక్తి అయిన ప్రస్తుత ఖమ్మం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి నామానాగేశ్వరరావు జిల్లా రైతాంగానికి బాగానే నామాలు పెట్టారని బాధితులు మండిపడుతున్నారు. బాబు వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని అప్పనంగా జిల్లాలోని పాలేరు షుగర్స్‌ను అతి తక్కువ ధరకే కొట్టేశారని.., ప్రజా సంక్షేమం గాలికొదిలి తన కోటరి ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వాన్ని దివాళా తీయించిన బాబు కూడా నాడు నామాకు వెన్నుదన్నుగా నిలవడంతో రైతుల భాగస్వామ్యంతో రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులతో కళకళలాడిన రూ.వందల కోట్ల విలువ చేసే పాలేరు షుగర్స్ కేవలం రూ. 9.50 కోట్లకే నామాకు ధారాదత్తం అయిందని అంటున్నారు. ఈ తతంగంలో నష్టపోయిన బాధితులను ఎవరైనా కదిలిస్తే కన్నీళ్లపర్యంతమవుతూ ఆ చేదు అనుభవాలను వివరిస్తున్నారు.
చరిత్ర ఘనం....
జిల్లాలో నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం, అమ్మగూడెం గ్రామాల మధ్య 1976లో రైతుల భాగస్వామ్యంతో ప్రభుత్వం ‘ది పాలేరు కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ ’ ఏర్పాటు చేసింది. 148 ఎకరాలలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి అప్పటి క లెక్టర్ పిఆర్‌కెవి ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అనంతరం 1984లో క్రషింగ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఫ్యాక్టరీకి 6 పాలకవర్గాలు పని చేశాయి. ఫ్యాక్టరీలో ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 500 మంది కార్మికులు ఉపాధి పొందుతూ సుఖసంతోషాలతో జీవించారు. ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో పరిసర ప్రాంతాల్లో 104 గ్రామాలకు చెందిన 3,600 మంది రైతుల నుంచి ఒక్కొక్కరి వాటాధనం కింద అప్పట్లోనే మొత్తం రూ. 1.20 కోట్లు వరకు వసూలు చేసి నిర్మాణానికి ఉపయోగించారు. చాలా ఏళ్లు ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో పని చేసిన కార్మికులు, ఉద్యోగులు ఆనందంగా గడుపుతూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకున్నారు. ఫ్యాక్టరీ తమదనే భావనతో కార్మికులు, ఉద్యోగులు కష్టపడిపని చేశారు.
లాభాల్లో ఉన్నా.. నష్టాలు చూపుతూ..
ఈ ఫ్యాక్టరీపై చంద్రబాబు కోటరీ కన్ను పడింది. దీన్ని ఎలాగైనా తమపరం చేసుకోవాలనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే నష్టాలను చూపించి ప్రైవేట్‌కు అప్పగించేలా చేయాలనుకున్నారు. అంతే బాబుపాలనలో ఆపనులు చకచకసాగాయి. పాలేరు షుగర్స్ నష్టాలలో లేకున్నా ఓ పథకం ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం కాగితాల్లో నష్టాలను చూపించింది. అనవసర ఖర్చులు, దుబారా ఖర్చులు చూపిస్తూ పథకం ప్రకారం నష్టాల బాట పట్టించారని ఇప్పటికీ నాడు ఫ్యాక్టరీలో పని చేసిన కార్మికులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు.. నామాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందంతో గుట్టుచప్పుడు కాకుండా ఫ్యాక్టరీ విక్రయం జరిగింది. రూ. వందల కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీని రూ.9.50 కోట్లకే బాబు తాను అనుకున్నట్లు నామాకే అప్పగించారు. ఇది తెలిసి అప్పట్లో రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. వారి ఆందోళనను ప్రభుత్వం అప్పట్లో పెడచెవిన పెట్టింది.
రోడ్డున పడ్డ కార్మికులు, ఉద్యోగులు..
2002లో మధుకాన్ సంస్థ పాలేరు షుగర్స్‌ను టేకోవర్ చేసుకుంది. ఆ సమయంలో కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేయగా అంద రికీ మధుకాన్‌లో ఉద్యోగాలు ఇస్తామని అప్పట్లో కార్మికుల సమక్షంలో సంస్థ అధినేత అయిన నామా నాగేశ్వరరావు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 200 మంది ఉద్యోగులు, మరో 500 మంది ఎన్‌ఎంఆర్‌లుగా అప్పట్లో పాలేరు కో-ఆపరేటివ్ షుగర్స్‌లో పనిచేసేవారు. నామా ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాట నీటి మూటే అయింది. ఫ్యాక్టరీ ముందు కార్మికులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. స్థానికులకు కాకుండా అయిన వారికే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో ఈ ప్రాంతంలోనే అప్పటి కార్మికులు హోటల్ నిర్వహిస్తూ, ఆటోలు నడుపుతూ, వ్యవసాయ కూలీలుగా పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలేరు షుగర్స్‌ను మధుకాన్ టేకోవర్ చేసుకున్నా నేటికీ కార్మికులకు 3 ఏళ్ల బోనస్ ఇవ్వకుండా పెండింగ్‌లోనే పెట్టింది.
రైతుల నోట్లో మట్టి కొట్టి..
పాలేరు షుగర్స్‌ను చూసి అప్పట్లో రైతులు మురిసిపోయారు. తమ వాటా ధనంతో నిర్మించిన ఫ్యాక్టరీలో లాభాలు వస్తే తమకు అవి దక్కుతాయని ఆశించిన వారి కలలు కల్లలయ్యాయి. చంద్రబాబు నిర్ణయంతో ఈ ఫ్యాక్టరీని నామా కారుచౌకగా కొట్టేసి రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. తమ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మిస్తుండడంతో అప్పట్లో ఈప్రాంతానికి చెందిన 3,600 మంది రైతులు తమ వాటాధనంగా సుమారు రూ.1.20 కోట్లు వాటా ధనంగా చెల్లించారు. అయితే మధుకాన్ సంస్థకు పాలేరు షుగర్స్‌ను కట్టబెట్టినా ఇప్పటి వరకు రైతులకు మాత్రం వారి వాటాధనం తిరిగి ఇవ్వలేదు. కొంతమంది రైతులు అప్పట్లో వాటా కోసం ఆనాడు భూమి పట్టా పుస్తకాలు తనఖా పెట్టి మరీ షేర్‌లు తీసుకున్నారు. నామా చేసిన నిర్వాకంతో ఓవైపు నాటి కార్మికులు రోడ్డున పడగా.. రైతుల వాటా ధనంపై మాత్రం నోరు విప్పడం లేదు.