ఎవరికి దక్కేనో..
సాక్షి ప్రతినిధి, గుంటూరు :పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఎట్టకేలకు అధికారంలోకి వచ్చారు. టీడీపీ తరఫున జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పుడు అమాత్య పదవుల కోసం అప్పుడే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తరువాత మంత్రివర్గం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఎన్నికైన శాసనసభ్యుల్లో కొందరు మంత్రి పదవులను ఆశిస్తూ హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. దీంతో ఎవరెవరికి మంత్రి పదవులులభిస్తాయనే అంశంపై పార్టీ నేతలు, కార్యకర్తల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. సామాజికవర్గాలు, సీనియార్టీలను ఆధారంగా చేసుకుని మంత్రి పదవులు లభించే అవకాశం ఉండడంతో ఆ వర్గాల్లోని ముఖ్యుల చుట్టూ చర్చ సాగుతోంది. జిల్లాలో కమ్మ సామాజికవర్గం నుంచి ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు,కోడెల శివప్రసాదరావు,యరపతినేని శ్రీనివాసరావు,ప్రత్తిపాటి పుల్లారావు,ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు.
రెడ్డి సామాజికవర్గం నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బీసీ వర్గాల నుంచి అనగాని సత్యప్రసాద్, ఎస్సీల నుంచి నక్కా ఆనందబాబు, రావెల కిషోర్‌బాబు, తెనాలి శ్రావణ్‌కుమార్ ఎన్నికయ్యారు. వీరిలో కొందరు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని పార్టీకి విజయాన్ని చేకూర్చిన చంద్రబాబును అభినందించడమే కాకుండా తమ విషయాన్ని కూడా విజ్ఞప్తి చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమ్మ సామాజికవర్గం నుంచి ధూళిపాళ నరేంద్రకుమార్, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌లలో ఒకరికి మంత్రి పదవి లభించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలవడం, ప్రత్తిపాటి పుల్లారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి గెలవడం అదనపు అర్హతగా పేర్కొంటున్నారు. సత్తెనపల్లి నుంచి గెలిచిన కోడెల శివప్రసాద్‌కు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో తమ నేతకు తప్పకుండా పదవి వస్తుందని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పార్టీ ఆదేశాల మేరకు ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీటు ఇచ్చే సమయంలో పార్టీ అధినేత గెలిచి నా వద్దకు రా...నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు మోదుగలకు తప్పనిసరిగా పదవి వరించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. ఎస్సీల నుంచి నక్కా ఆనందబాబు, రావెల కిషోర్‌బాబు, తెనాలి శ్రావణ్‌కుమార్‌లు ఉన్నారు. వీరిలో నక్కా ఆనందబాబు సీనియర్ కావడంతో అతనికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గుంటూరుకు ప్రత్యేక స్ధానం ఉండడంతో తొలి విడత మంత్రివర్గ విస్తరణలో కనీసం ఇద్దరికి స్థానం లభించే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఈ పదవుల కేటాయింపునకు దూరంగా ఉంటున్నారని, మొదటి నుంచి జిల్లాలోని టీడీపీ అభ్యర్థులకు సమాన ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన ఎవరికీ మద్దతు పలకకపోవచ్చనే అభిప్రాయం పార్టీలో వినపడుతోంది.