జిల్లాకు ఇది చారిత్రక ఘట్టం
సాక్షి, గుంటూరు :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేస్తున్నందున, తగిన ఏర్పాట్లన్నీ 6వ తేదీ లోగానే పూర్తి చేయాలని, ఏ శాఖకు అప్పగించిన పనులు ఆ శాఖ సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్‌తో కలిసి పలు ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 6వ తేదీ సాయంత్రంలోగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తే భద్రతా సిబ్బంది ఏఎన్‌యూ ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుంటారన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం గుంటూరు జిల్లాకు చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందని, జిల్లా అధికార యంత్రాంగం ఓ ఛాలెంజింగ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 3 వేలమంది ప్రతినిధులు పలు హోదాల్లో హాజరవుతారని, సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేసినట్టు చెప్పారు. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో 8వ తేదీ రాత్రి 7.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని, 7వ తేదీ సాయంత్రం నుంచి జాతీయ రహదారిపై మద్యం దుకాణాలు మూయించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా క్రమబద్ధీకరించాలన్నారు. బారికేడ్లు, హెలిప్యాడ్ల ఏర్పాటు, రహదారుల అనుసంధానం తదితరాలు ఆర్ అండ్ బీ చేపట్టాలని, తుమ్మ చెట్ల తొలగింపు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు చూడాలని సూచించారు.
సభా ప్రాంగణంతోపాటు గుర్తించిన ప్రదేశాల్లో వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకారం రాత్రి వేళ జరుగుతున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగకుండా తగినన్ని జనరేటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ శాఖల వాహనాల పార్కింగ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ గోపీనాథ్ వివరించారు. సమీక్షలో జేసీ వివేక్ యాదవ్, అదనపు జేసీ నాగేశ్వరరావు, డీఆర్వో నాగబాబు, రూరల్ అదనపు ఎస్పీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.
హోటళ్లలో 50 శాతం గదులు రిజర్వ్.: గుంటూరు నగర పరిధిలోని కార్పొరేట్ స్థాయి హోటల్స్, రిసార్టుల్లో 50 శాతం గదులు జిల్లా కలెక్టర్ పేరిట రిజర్వ్ చేయాలని జేసీ వివేక్ యాదవ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో హోటల్స్, రిసార్ట్స్, ప్రైవేటు అతిథిగృహాల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆ గదులు 6వ తేదీ సాయంత్రం నుంచి 8వ తేదీ వరకు జిల్లా యంత్రాంగం ఆధీనంలో ఉంటాయని ఆయన చెప్పారు. వీటిపై పర్యవేక్షణ బాధ్యతలు డీఎస్‌వో, గుంటూరు ఆర్డీవో, తహశీల్దార్లకు అప్పగించారు.