దేశంలో నైరాశ్యం
సాక్షి, గుంటూరు : జిల్లాలో టీడీపీ డీలా పడిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూసి ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పైకి మాత్రం తమదే గెలుపంటూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో జిల్లా నాయకులు కూడా అదే పంథా అనుసరిస్తున్నారు. నిజానికి జిల్లాలో ఒకరిద్దరు నేతలు తమ గెలుపుపై ధీమాతో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారం దక్కేలా లేదని తెలిసి మదనపడుతున్నారు. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఓటమి భయంతో వణికిపోతున్నారు.
కంచుకోటల్లోనూ ఎదురీత..
ఈ నెల 12, 13 తేదీల్లో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతల్లో కలకలం మొదలయింది. ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం పార్టీ అభ్యర్థులు ఎదురీదిన విధానాన్ని బట్టి ఇక మిగతా చోట్ల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇట్టే అర్థమౌతుందని స్వపక్ష నేతలు వాపోతున్నారు. అసలు టికెట్‌లు కేటాయించడంలో అధిష్టానం చేసిన తప్పిదాల వల్లే ఇదంతా జరిగిందని కొందరు అధినేత తీరునే తప్పుబడుతున్నారు. ఎంపీలుగా స్థానికులకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి గుంటూరు, నరసరావుపేట స్థానాలను కేటాయించారని మండిపడుతున్నారు. సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా పార్టీకి నష్టం చేకూర్చిందని ద్వితీయశ్రేణి నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
విజయంపై వైఎస్సార్ సీపీ ధీమా..
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఫుల్‌జోష్‌తో ఉన్నాయి. జిల్లాలో అత్యధిక స్థానాలు తమ పార్టీ గెలుచుకుంటుందనే ధీమాగా ఉన్నారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై తమను పెట్టిన ఇబ్బందులకు ప్రజలు ఓట్లతో సమాధానం చెప్పారని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కంచుకోటల్లో సైతం తమ పార్టీ విజయం సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
‘సాక్షి’పై గల్లా ఫైర్..
ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన టీడీపీ నేతలు తమ అధినేత చంద్రబాబులాగే ‘సాక్షి’ పత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. గురువారం రాత్రి గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ ‘సాక్షి’ మీడియాపై తమ ఆక్రోశం, అక్కసును వెళ్లగక్కారు. ఎల్లో మీడియాను వెనకేసుకు తిరుగుతున్న ఆ పార్టీ నేతలు తమ అసలు రంగు బయటపెడుతున్న సాక్షి వల్ల ప్రజల్లో తాము దోషులుగా నిలబడాల్సి వస్తోందని భావిస్తున్నారు.
ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ‘సాక్షి’పై చర్యలకు సిఫార్సు చేస్తామంటూ అడ్డగోలు ప్రకటనలు చేశారు. ఇదంతా గమనిస్తున్న సొంత పార్టీ నేతలే వీరి తీరును తప్పుబడుతున్నారు. ఆ నేతల అసహనం ఓటమిని అంగీకరించినట్లుగా ఉందంటున్నారు.