సాక్షి, ఖమ్మం: ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే తుమ్మలనాగేశ్వరరావు ఖమ్మం వదిలి పాలేరుకు పయనమవుతున్నారని ఇటీవల తెలుగుదేశం పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖమ్మంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న ఆయన చివరకు పాలేరునే ఎంచుకొని ముందుకు కదిలే విధంగా సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవడంతో ఎవరు ఎటు..? అన్నది ఆపార్టీలో గందరగోళంగా మారింది.
కాగా, తుమ్మలను పాలేరుకు రానివ్వకుండా కట్టడి చేసి అక్కడ తన అనుచరురాలైన మద్దినేని బేబిస్వర్ణకుమారి టికెట్ ఇప్పించాలన్న యోచనలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. నామా ఎత్తులకు తుమ్మల పైఎత్తులు వేస్తుండడంతో వర్గపోరు ఆపార్టీలో తార స్థాయికి చేరింది. శనివారం ఖమ్మంలో మీట్ ది ప్రెస్‌లో విలేకరులకు అడిగిన ప్రశ్నకు నామా సమాధానమిస్తూ స్వర్ణకుమారి అభ్యర్థిత్వంపై కుండబద్దలు కొట్టారు.
‘ఆమె క్లాస్ 1 అధికారిణి.. బాబు పిలుపుతో టీడీపీలోకి వచ్చారు. ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఒకప్పుడు పాలేరు నియోజకవర్గంలో టీడీపీ బలంగా లేదు. ఆమెకు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాక పార్టీ బలోపేతం అయింది. ఆమె కష్ట పడింది. ఆమెకు అవకాశం ఇవ్వాలి కానీ... అక్కడికి పోవాలని ఎవరైనా అనుకోవడం తప్పు..’ అని ఆయన పరోక్షంగా తుమ్మలను తప్పుబట్టారు. అంతేగాకుండా జిల్లాలో ఉన్న వర్గపోరుపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు.
‘తమ కుటుంబం అంతా కలిసే ఉంటుందని, తాను వచ్చాకే కొత్తగూడెంలో నేతల మధ్య ఉన్న విభేదాలు సమసి పోయాయని.. తాను కలిసి ఉండాలని కోరుకుంటున్నానని, ఇతరులకు కూడా ఆ మనస్తత్వం ఉండాలి’ అని పరోక్షంగా తుమ్మలపై విమర్శనాస్త్రాలు సంధించారు. తుమ్మలను టార్గెట్ చేసుకునే ఆయన మీట్ ది ప్రెస్‌లో పాలేరు సీటు విషయమై తన అనుచరురాలికే ఇవ్వాలన్న వాదాన్ని బహిర్గతం చేసినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
తుమ్మల క్యాంపు కార్యాలయంలో హంగామా..
నామా వ్యాఖ్యలు మీడియాలో ప్రసారం కావడంతో ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలానికి చెందిన తుమ్మల వర్గీయులు మూడు వందలమందికి పైగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ వ్యాఖ్యలపై తీవ్రంగా నిరసన తెలిపారు. తుమ్మల ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నినాదాలు చేశారు. కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకొని తుమ్మలతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకున్నారు.
బాలసాని కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన తుమ్మలపై నామా పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది నామా నిర్ణయించడమేంటని మండిపడ్డారు. అంతేగాకుండా ఖమ్మం పార్లమెంటుకు తుమ్మల పోటీ చేయాలని ప్రస్తావించడంతో కార్యకర్తలు కూడా అదే నినాదాన్ని సమావేశంలో ఎత్తుకున్నారు. క్యాంపు కార్యాలయం వేదికగా తుమ్మల వర్గం నామాను తూర్పార బట్టింది.
తనకు చంద్రబాబు దగ్గర ఉన్న చనువుతో జిల్లా పార్టీని ఒంటి చేతితో నిలబెట్టిన తుమ్మలను నామా అణగదొక్కుతున్నారని, ఈ పరిస్థితులను సహించమని ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరించారు. తుమ్మల మాట్లాడుతూ నామా వ్యవహారాన్ని ఏమీ ప్రస్తావించకుండా ఎక్కడ పోటీ చేస్తానన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.
పార్లమెంటు రేసులో...అంటూ....
నిన్నటి వరకు పాలేరు వైపే తుమ్మల పయనిస్తారని ఆయన వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నామా తాజావ్యాఖ్యలతో ఎంపీ సీటుకు రేసులో ఉన్నానని తుమ్మల వ్యూహాత్మకంగా తన అనుచరులతో చెప్పించారని పార్టీ నేతలు గుసగుస లాడుతున్నారు. అవసరమైతే ఈ నినాదాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లి.. నామాను ఇరకాటంలో పెట్టాలన్న యోచనలో ఆయన వర్గం ఉన్న సమాచారం. మొత్తంగా ఈ పరిణామాలతో టీడీపీలోని రెండు వర్గాల మధ్య అగాధం మరింతగా పెరిగింది.
‘దేశం’లో పాలేరు తుపాను
Published Sun, Apr 6 2014 2:33 AM | Last Updated on Tue, Aug 14 2018 5:41 PM
Advertisement
Advertisement