ఈతీరేంది భాయి.... చెప్పేద్దాం గుడ్‌బై!
రాజీనామా బాటలో తెలుగుతమ్ముళ్లు
సాక్షి, ఖమ్మం,జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తెలుగుతమ్ముళ్లు రాజీనామా బాట పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామానాగేశ్వరరావు ఒంటెత్తు పోకడలే ఈపరిస్థితులకు దారితీస్తున్నాయనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఆయన తీరుతో విసుగుచెంది కొంతమంది ఇప్పటికే పార్టీని వీడగా..
మరికొంత మంది అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు సీటు రాకుండా అడ్డుకున్నారని ఏకంగా ఆపార్టీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీతో పొత్తుతో మైనారిటీ నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని పార్టీ శ్రేణులు మధనపడుతున్నాయి.
జిల్లా టీడీపీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఏకస్వామ్య పోకడలతో పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. తనకు టికెట్ వచ్చినా బీ-ఫాం ఇవ్వకుండా నామానే అడ్డుకున్నారని బాలసాని ప్రకటించినప్పటి నుంచి ఈ పరంపర కొనసాగుతోంది. పార్టీలో నామా పెత్తనంపై బాలసాని ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే.. పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారని పాల్వంచలో ఆవర్గం నేతలు నామా పర్యటనకు అడ్డుకున్న విషయం తెలిసిందే.
అలాగే బీజేపీతో టీడీపీ పొత్తును విభేదిస్తూ మైనారిటీ నేతలు రోజుకొకరు రాజీనామాలు ప్రకటిస్తూనే ఉండడం గమనార్హం. ఈ పొత్తును నిరసిస్తూ ఖమ్మం పట్టణంలో నామా వర్గానికి చెందిన మహబూబ్‌అలీ, ఫయాజ్, రియాజ్, బడే సాహెబ్‌తో పాటు మరికొంత మంది ఇప్పటికే రాజీ నామా చేశారు.
ఈ పరిస్థితుల్లో టీడీపీ అంటేనే మైనారిటీలు మండిపడుతున్నారు. పార్టీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన తన వర్గం అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల నేతలు కూడా ఆయన తీరును నిరసిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
పాలేరులో సామాజిక వర్గం చిచ్చు..
పాలేరు నియోజకవర్గంలో పార్టీ మండల బాధ్యతలు ఎప్పటి నుంచో ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. నాలుగు మండలాల పార్టీ బాధ్యతలతో పాటు అసెంబ్లీ టికెట్ కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ విషయం నియోజకవర్గ పార్టీలో చిచ్చు రేపింది. దీనికి అంతటికి కారణం నామానే అని ఇతర సామాజిక వర్గం నేతల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది.
ఈ కీలక సమయంలో నామా తన వర్గానికే అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తున్నారని, పార్టీలో బీసీలకు సరైన గుర్తింపు లేదని కూసుమంచి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈయన బాటలోనే నియోజకవర్గానికి చెందిన మరికొంతమంది నేతలు పయనించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ప్రధానంగా తిరుమలాయపాలెం మండలంలో పార్టీ పరంగా గుర్తింపు ఉన్న మరోనేత రెండు, మూడు రోజుల్లో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. పాలేరు సీటు తన అనుచరురాలికి ఇప్పించుకోవడం, బాలసాని టికెట్ విషయంలో రచ్చ జరిగాక కూడా పార్లమెంట్ నియోజకవర్గంలోని బీసీ నేతలను పట్టించుకోకపోవడం ఆగ్రహం తెప్పించి వారంతా పార్టీకి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారు.
రాజీనామా యోచనలో నామా శిబిరం విద్యావేత్త..?
నామా శిబిరం నేతగా ఉన్న ఖమ్మం పట్టణానికి చెందిన విద్యావేత్త కూడా తనకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం. నామా అనుచర నేతగా గతంలో ఆయన గెలుపునకు కృషి చేసినా..
తనను పట్టించుకోకుండా ఆయన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న ఆవేదనలో సదరు విద్యావేత్త ఉన్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వనందుకు చివరకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఈయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం.
సహకారం లేనట్లేనా...?
నామా ఎంత బుజ్జగించినా సహకరించేది లేదని బీసీలతో పాటు ఆయనపై వ్యతిరేకత ఉన్న ఇతర సామాజిక వర్గం నేతలు, మైనారిటీలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కష్టపడి గెలిపిస్తే గత ఐదేళ్లలో పార్లమెంటరీ నేతగా తమకు చేసింది ఏమీ లేదని, ఒక సామాజిక వర్గానికే అన్ని చేశారని బీసీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు.
ఎలాగూ ఓటమి తప్పదని, అదే జరిగితే విదేశాలకు వెళ్లి ఆయన వ్యాపారాలు చూసుకుంటారని, కేడర్‌ను పట్టించుకోరని ప్రస్తుతం పార్టీలోని ఆయన వ్యతిరేక శిబిరంలో చర్చ జరుగుతోంది. ఇన్ని ప్రతికూల అంశాలతో నామా ఏమేరకు గట్టెక్కుతారో అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.