సాక్షి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీలో సార్వత్రిక ఎన్నికల చిచ్చు ఆరకపోగా మరింత రాజు కుంటోంది. పలు నియోజకవర్గాల్లో ఓటమిపై కారణాలు వెతుక్కుంటూ ఇటు నామా నాగేశ్వరరావు, అటు తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు ఒకరిపైమరొకరు కత్తులు దూసుకుం టున్నారు. ఖమ్మంలో నామాపై పరోక్షంగా తుమ్మల చేసిన వ్యాఖ్యలు ఆపార్టీలో దుమారం రేపాయి. ఈనేపథ్యంలోనే నామా వర్గం నేత, పాలేరు టీడీపీ అభ్యర్థి బేబి మద్దినేని స్వర్ణకుమారి ఏకంగా ఒకడుగు ముందుకేసి తుమ్మల కుట్రతోనే తాను ఓడిపోయినట్లు ఘాటుగా విమర్శలు సంధించారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడిన మరుసటి రోజు నుంచే టీడీపీలో రెండు వర్గాలు వీధికెక్కి పరస్పర ఆరోపణలకు దిగాయి. ‘మానాయకుడి ఓటమికి మీరే కారణం’ అంటూ నామా, తుమ్మల వర్గీయులు ఎవరికి వారే బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. ఈసమయంలోనే ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో తుమ్మల చేసిన వ్యాఖ్య అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. తన ఓటమికి తీవ్ర ఆవేదన చెందుతూ ‘రాజకీయ వ్యభిచారం చేయడం నాకు చేతకాదు.., జిల్లాలో కొంతమంది నాయకులు పార్టీని భ్రష్టు పట్టించేందుకు కంకణం కట్టుకున్నారు’.. అని పరోక్షంగా నామాను ఉద్దేశించి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఇరువురి నాయకుల మధ్య అగాధం మరింత పెరిగింది. అలాగే భద్రాచలంలో తన ఓటమికి పార్టీ నాయకులే కారణమంటూ అక్కడి పార్టీ అభ్యర్థి ఫణీశ్వరమ్మ చేసిన వ్యాఖ్యలు తుమ్మల ప్రధాన అనుచర నేత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను ఉద్దేశించినవే అనే చర్చ పార్టీ శ్రేణులలో జరుగుతోంది. భద్రాచలం నియోజకవర్గంలో ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకున్నా అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి ఫణీశ్వరమ్మకు షాక్ తగిలింది. ఇది తన వైఫల్యం కాదని పరోక్షంగా పార్టీలోని తన వ్యతిరేక వర్గంపై ఈ నెపం నెట్టడంతో బాలాసాని వర్గం కూడా ఆమెపై గుర్రుగా ఉంది. అంతేకాకుండా అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెంలో ఇప్పుడు ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఓటమికి మీరంటే.. మీరే కారణమంటూ నామా, తుమ్మల అనుచరులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతుండడంతో అసలు జిల్లాలో పార్టీ ఏమవుతుందో అని కేడర్‌లో చర్చ జరుగుతోంది.
తుమ్మలను టార్గెట్ చేస్తూ..
పాలేరు నియోజకవర్గంలో తన ఓటమికి పూర్తిగా తుమ్మల కుట్రే కారణమని అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మద్దినేని బేబిస్వర్ణకుమారి విమర్శలు గుప్పించారు. ‘నేను టీడీపీ పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తే.. మా పార్టీలోని తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు కావాలనే నన్ను కక్షగట్టి ఓడించారు. కనీసం ఆడబిడ్డనని కూడా కనికరించలేదు’ అంటూ సోమవారం కూసుమంచిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోరున విలపించారు. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని తుమ్మల వర్గీయులు తనను ఓడించేందుకు కాంగ్రెస్‌కు ఓట్లు అమ్ముకున్నారని ఆమె తుమ్మలను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు.
కాగా, స్వర్ణకుమారి చేసిన వ్యాఖ్యలపై తుమ్మల వర్గం వెంటనే స్పందించింది. ఖమ్మం రూరల్ మండలంలో విలేకరుల సమావేశంలో ఆమెపై వారు విమర్శలు చేశారు. ‘నామా నాగేశ్వరరావు పార్టీలో చేరాకే పార్టీలో వర్గాలను ప్రోత్సహించారని, నామా చర్యల వల్లే బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని..అదే ఇప్పుడు పార్టీ ఓటమికి కారణమైందని, ఇందులో తుమ్మలను తప్పుపడితే సహించేదని లేదు’అంటూ తుమ్మల వర్గీయులు నామా వర్గాన్ని ఘాటుగా హెచ్చరించారు.
‘స్థానిక’ ప్రజాప్రతినిధుల్లో నైరాశ్యం..
ఇరువురు నేతల మధ్య పోరు పరాకాష్టకు చేరుతుండడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆపార్టీ ప్రజాప్రతినిధుల్లో నైరాశ్యం నెలకొంది. ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే వచ్చే జెడ్పీ చైర్మన్, ఎంపీపీల ఎన్నికల్లో పార్టీకి నష్టమేనని వారు భావిస్తున్నారు. తాము విజయం సాధించిన ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాలు దక్కించుకోక పోతే ప్రయోజనం ఉండదన్న ఆందోళన వారిలో నెలకొంది. జెడ్పీ చైర్మన్ పీఠం కోసం రెండు వర్గాల జెడ్పీటీసీ విజేతలు పోటీ పడుతుండడంతో ఈ పరిస్థితుల్లో ఇక ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదరదని ఆపార్టీ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా వర్గపోరు పక్వానికి చేరడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ సర్వత్రా నడుస్తోంది.
టీడీపీలో ముదిరిన వర్గపోరు
Published Tue, May 20 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement