Parliament candidate
-
రగులుతున్న పొత్తు కుంపట్లు
సాక్షి, చిత్తూరు/సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షిప్రతినిధి, కాకినాడ/సాక్షి, భీమవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య క్షేత్రస్థాయిలో పొత్తు పొసగడం లేదు. కార్యకర్తలు, నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటనా ఇంకా కాలేదు. ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ సీట్లలోనూ మూడు పార్టీలూ ఏకతాటిపైకి రావడం లేదు. బాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ చేతులెత్తేసింది. ఇక్కడ టీడీపీ తీరుతో విసిగి జనసేనలో చేరిన నేతలు ఇప్పుడు ఇరుపార్టీల మధ్య పొత్తు కుదరడం, బాబే మళ్లీ పోటీ చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ నాయకులూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పూతలపట్టు, నగరి, పుంగనూరు, జీడీ నెల్లూరు, పలమనేరుల్లోనూ టీడీపీ అభ్యర్థులకు మిత్రపక్షాల నుంచి సహకారం లేదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్నాయుడు పట్టుకోసం పార్టీ నాయకులపై స్పై ఆపరేషన్ చేస్తున్నట్టు సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిని బాబు ఇంకా తేల్చలేదు. ఐఆర్ఎస్ అధికారి ప్రసాద్‌రావుతోపాటు ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వెంకటరమణా.. ఎంపీ సీటూ గోవిందా! రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన బొడ్డు వెంకటరమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పేలా లేదు. అప్పట్లో రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశ చూపిన అధిష్టానం ఇప్పుడు మొండిచేయి ఇచ్చేలా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా ఎంపీగా పురంధరేశ్వరి బరిలో దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీడని బీజేపీ ‘సీటు’ముడి శ్రీకాకుళం జిల్లాలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీటుపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పాతపట్నం, ఎచ్చెర్లలో ఒక నియోజకవర్గం బీజేపీకి కేటాయించవచ్చని తెలుస్తోంది. బీజేపీ ఈ రెండింటిలో ఏదడిగినా ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ‘కొండ’ఎక్కిన సీటు ఆశలు తెలుగుదేశం పార్టీలో కాకినాడ సిటీ సీటు పంచాయితీ ఎటూ తేలడం లేదు. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) ఆశలు కొండెక్కాయనే ప్రచారం జరుగుతోంది. అన్న సత్యనారాయణ రూపంలో కొండబాబుకు ఇంటిపోరు ఎదురుకావడంతోపాటు పార్టీలోనూ వ్యతిరేకత ఉండడంతో బాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం. కొండబాబు స్థానంలో అతని అన్న సత్యనారాయణ పెద్ద కోడలు సుస్మిత పేరును ఐవీఆర్ఎస్ సర్వేలో చేర్చారని చర్చ జరుగుతోంది. పశ్చిమలో పోరు పశ్చిమగోదావరి జిల్లాలో కూటమిలో సెగ రగులుతోంది. జనసేన పార్టీ నాయకుడు బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గాలు ఎడముఖంపెడముఖంగా ఉండడంతో శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ఉండి టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించడం శ్రేణుల్లో చీలిక తెచ్చింది. తణుకు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న జనసేన నేత విడివాడ రామచంద్రరావు పార్టీకి దూరంగా ఉన్నారు. భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు జనసేన టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో నిరసన వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు , రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్కస్థానాన్నీ ఎన్డీఏ కూటమి మహిళలకు కేటాయించలేదు. అధికార వైఎస్సార్ సీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చింది. పోలవరం, గోపాలపురం అసెంబ్లీ స్థానాలతోపాటు, నరసాపురం ఎంపీ స్థానాన్ని మహిళలకు కేటాయించింది. -
ఈతీరేంది భాయి.... చెప్పేద్దాం గుడ్‌బై!
రాజీనామా బాటలో తెలుగుతమ్ముళ్లు సాక్షి, ఖమ్మం,జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తెలుగుతమ్ముళ్లు రాజీనామా బాట పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామానాగేశ్వరరావు ఒంటెత్తు పోకడలే ఈపరిస్థితులకు దారితీస్తున్నాయనే చర్చ పార్టీలో నడుస్తోంది. ఆయన తీరుతో విసుగుచెంది కొంతమంది ఇప్పటికే పార్టీని వీడగా.. మరికొంత మంది అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు సీటు రాకుండా అడ్డుకున్నారని ఏకంగా ఆపార్టీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీతో పొత్తుతో మైనారిటీ నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని పార్టీ శ్రేణులు మధనపడుతున్నాయి. జిల్లా టీడీపీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఏకస్వామ్య పోకడలతో పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. తనకు టికెట్ వచ్చినా బీ-ఫాం ఇవ్వకుండా నామానే అడ్డుకున్నారని బాలసాని ప్రకటించినప్పటి నుంచి ఈ పరంపర కొనసాగుతోంది. పార్టీలో నామా పెత్తనంపై బాలసాని ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే.. పార్టీలో బీసీలను అణగదొక్కుతున్నారని పాల్వంచలో ఆవర్గం నేతలు నామా పర్యటనకు అడ్డుకున్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీతో టీడీపీ పొత్తును విభేదిస్తూ మైనారిటీ నేతలు రోజుకొకరు రాజీనామాలు ప్రకటిస్తూనే ఉండడం గమనార్హం. ఈ పొత్తును నిరసిస్తూ ఖమ్మం పట్టణంలో నామా వర్గానికి చెందిన మహబూబ్అలీ, ఫయాజ్, రియాజ్, బడే సాహెబ్‌తో పాటు మరికొంత మంది ఇప్పటికే రాజీ నామా చేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అంటేనే మైనారిటీలు మండిపడుతున్నారు. పార్టీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన తన వర్గం అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల నేతలు కూడా ఆయన తీరును నిరసిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పాలేరులో సామాజిక వర్గం చిచ్చు.. పాలేరు నియోజకవర్గంలో పార్టీ మండల బాధ్యతలు ఎప్పటి నుంచో ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. నాలుగు మండలాల పార్టీ బాధ్యతలతో పాటు అసెంబ్లీ టికెట్ కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ విషయం నియోజకవర్గ పార్టీలో చిచ్చు రేపింది. దీనికి అంతటికి కారణం నామానే అని ఇతర సామాజిక వర్గం నేతల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. ఈ కీలక సమయంలో నామా తన వర్గానికే అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తున్నారని, పార్టీలో బీసీలకు సరైన గుర్తింపు లేదని కూసుమంచి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈయన బాటలోనే నియోజకవర్గానికి చెందిన మరికొంతమంది నేతలు పయనించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రధానంగా తిరుమలాయపాలెం మండలంలో పార్టీ పరంగా గుర్తింపు ఉన్న మరోనేత రెండు, మూడు రోజుల్లో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. పాలేరు సీటు తన అనుచరురాలికి ఇప్పించుకోవడం, బాలసాని టికెట్ విషయంలో రచ్చ జరిగాక కూడా పార్లమెంట్ నియోజకవర్గంలోని బీసీ నేతలను పట్టించుకోకపోవడం ఆగ్రహం తెప్పించి వారంతా పార్టీకి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారు. రాజీనామా యోచనలో నామా శిబిరం విద్యావేత్త..? నామా శిబిరం నేతగా ఉన్న ఖమ్మం పట్టణానికి చెందిన విద్యావేత్త కూడా తనకు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం. నామా అనుచర నేతగా గతంలో ఆయన గెలుపునకు కృషి చేసినా.. తనను పట్టించుకోకుండా ఆయన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న ఆవేదనలో సదరు విద్యావేత్త ఉన్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వనందుకు చివరకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఈయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. సహకారం లేనట్లేనా...? నామా ఎంత బుజ్జగించినా సహకరించేది లేదని బీసీలతో పాటు ఆయనపై వ్యతిరేకత ఉన్న ఇతర సామాజిక వర్గం నేతలు, మైనారిటీలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కష్టపడి గెలిపిస్తే గత ఐదేళ్లలో పార్లమెంటరీ నేతగా తమకు చేసింది ఏమీ లేదని, ఒక సామాజిక వర్గానికే అన్ని చేశారని బీసీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాగూ ఓటమి తప్పదని, అదే జరిగితే విదేశాలకు వెళ్లి ఆయన వ్యాపారాలు చూసుకుంటారని, కేడర్‌ను పట్టించుకోరని ప్రస్తుతం పార్టీలోని ఆయన వ్యతిరేక శిబిరంలో చర్చ జరుగుతోంది. ఇన్ని ప్రతికూల అంశాలతో నామా ఏమేరకు గట్టెక్కుతారో అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి
లోద్దపుట్టి (ఇచ్ఛాపురం), న్యూస్‌లైన్: ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం అభ్యర్థి రెండి శాంతి ఓటర్లకు విజ్ఞప్తి చేశా రు. బుధవారం మధ్యాహ్నం ఆమె పార్టీ నాయకులతో కలిసి..లొద్దపుట్టి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఓటర్ల వద్దకు వెళ్లి..ఫ్యాన్‌గుర్తుపై ఓటు వేయాలని, లొద్దపుట్టి ఎంపీటీసీ అభ్యర్థి పిట్ట హేమలతను గెలిపించాలని కోరారు. మహిళల వద్దకు వెళ్లి..వారిని ఆప్యాయంగా పలకరించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. వికలాంగ, వృద్ధ మహిళలతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రాజన్న పాలన వస్తుందని, అందరి కష్టాలు తీరుతాయని వివరించారు. స్థానిక మహిళలతో కలిసి..వడ్లు దంచారు. చిరు వ్యాపారులు, పనుల్లో ఉన్న మహిళల వద్దకు వెళ్లి..పలకరించి..వైఎస్ఆర్సీపీని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఆయన సతీమణి విజయ, పార్టీ నాయకులు సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ కె.గోవిందరెడ్డి, మండల కన్వీనర్లు కారంగి మోహనరావు, పిట్ట ఆనంద్, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి సుగ్గు ఛత్రపతి రెడ్డి, సేవాదళ్ కన్వీనర్ తిప్పన రామారావు, మాజీ ఎంపీపీ తిలక్, అనపాన పితాంబర్, పైల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.