టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారే
మిత్రధర్మాన్ని పాటించని మూడు పార్టీలు.. ఇంకా ఖరారు కాని చిత్తూరు ఎంపీ అభ్యర్థి
కుప్పంలో చేతులెత్తేసిన తెలుగుదేశం కేడర్
సాక్షి, చిత్తూరు/సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షిప్రతినిధి, కాకినాడ/సాక్షి, భీమవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య క్షేత్రస్థాయిలో పొత్తు పొసగడం లేదు. కార్యకర్తలు, నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కేంద్రమైన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ప్రకటనా ఇంకా కాలేదు. ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ సీట్లలోనూ మూడు పార్టీలూ ఏకతాటిపైకి రావడం లేదు.
బాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ చేతులెత్తేసింది. ఇక్కడ టీడీపీ తీరుతో విసిగి జనసేనలో చేరిన నేతలు ఇప్పుడు ఇరుపార్టీల మధ్య పొత్తు కుదరడం, బాబే మళ్లీ పోటీ చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ నాయకులూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
పూతలపట్టు, నగరి, పుంగనూరు, జీడీ నెల్లూరు, పలమనేరుల్లోనూ టీడీపీ అభ్యర్థులకు మిత్రపక్షాల నుంచి సహకారం లేదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌నాయుడు పట్టుకోసం పార్టీ నాయకులపై స్పై ఆపరేషన్ చేస్తున్నట్టు సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిని బాబు ఇంకా తేల్చలేదు. ఐఆర్‌ఎస్ అధికారి ప్రసాద్‌రావుతోపాటు ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.
వెంకటరమణా.. ఎంపీ సీటూ గోవిందా!
రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన బొడ్డు వెంకటరమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పేలా లేదు. అప్పట్లో రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశ చూపిన అధిష్టానం ఇప్పుడు మొండిచేయి ఇచ్చేలా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా ఎంపీగా పురంధరేశ్వరి బరిలో దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వీడని బీజేపీ ‘సీటు’ముడి
శ్రీకాకుళం జిల్లాలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీటుపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పాతపట్నం, ఎచ్చెర్లలో ఒక నియోజకవర్గం బీజేపీకి కేటాయించవచ్చని తెలుస్తోంది. బీజేపీ ఈ రెండింటిలో ఏదడిగినా ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
‘కొండ’ఎక్కిన సీటు ఆశలు
తెలుగుదేశం పార్టీలో కాకినాడ సిటీ సీటు పంచాయితీ ఎటూ తేలడం లేదు. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) ఆశలు కొండెక్కాయనే ప్రచారం జరుగుతోంది. అన్న సత్యనారాయణ రూపంలో కొండబాబుకు ఇంటిపోరు ఎదురుకావడంతోపాటు పార్టీలోనూ వ్యతిరేకత ఉండడంతో బాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం. కొండబాబు స్థానంలో అతని అన్న సత్యనారాయణ పెద్ద కోడలు సుస్మిత పేరును ఐవీఆర్‌ఎస్ సర్వేలో చేర్చారని చర్చ జరుగుతోంది.
పశ్చిమలో పోరు
పశ్చిమగోదావరి జిల్లాలో కూటమిలో సెగ రగులుతోంది. జనసేన పార్టీ నాయకుడు బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గాలు ఎడముఖంపెడముఖంగా ఉండడంతో శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ఉండి టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించడం శ్రేణుల్లో చీలిక తెచ్చింది. తణుకు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న జనసేన నేత విడివాడ రామచంద్రరావు పార్టీకి దూరంగా ఉన్నారు. భీమవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు జనసేన టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో నిరసన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి
జిల్లావ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు , రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్కస్థానాన్నీ ఎన్డీఏ కూటమి మహిళలకు కేటాయించలేదు. అధికార వైఎస్సార్ సీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చింది. పోలవరం, గోపాలపురం అసెంబ్లీ స్థానాలతోపాటు, నరసాపురం ఎంపీ స్థానాన్ని మహిళలకు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment