2014 తరహాలోనే అడ్డగోలు హామీలతో 2024 ఎన్నికల మేనిఫెస్టో
2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్
👉: 58 నెలల్లో నవరత్నాల పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లు జమ
👉: సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో మరో రూ.95,001 కోట్లు
👉: డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.3,61,811 కోట్లు.. ఏటా సగటున రూ.72,362 కోట్లు వ్యయం
👉: సీఎం రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు అండ్ గ్యాంగ్
👉: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరం
👉: అంటే.. ఇప్పటి కంటే ఏటా రూ.92,638 కోట్లకుపైగా అదనంగా అవసరం
👉: టీడీపీ మేనిఫెస్టో అమలుకు ఐదేళ్లలో మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లకుపైగా అవసరం
👉: డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు వ్యయం చేసిన దాని కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం
👉: సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు
👉: పద్నాలుగేళ్ల బాబు పాలనలో ప్రతిఏటా రెవెన్యూ లోటేనని సాక్ష్యాలతో వివరించిన సీఎం జగన్
👉: ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో మురళీమోహన్ వంటి బినామీలకే సంపద సృష్టించిన చంద్రబాబు
👉: 2014–19 మధ్య అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలకు భూ సంపద సృష్టించిన వైనం
👉: ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఖజానా నుంచి ఖర్చు పెట్టి బినామీలకు సంపద సృష్టించేలా ఎత్తుగడ
👉: 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నారని మేనిఫెస్టోను ముట్టుకోని బీజేపీ
👉: పథకాల అమలుకు నిధులు ఎలా తెస్తారో వివరణ ఇవ్వాలంటున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు
👉: వివరణ ఇవ్వకపోతే తాను మోసం చేస్తున్నట్లు చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో అలవికాని హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈసారి విశ్వరూపం ప్రదర్శించారు. జనసేన, బీజేపీలతో జత కట్టినా ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి వచ్చి ఉనికి చాటుకోవడం కోసం ఆచరణలో అమలుకు వీలుకాని రీతిలో హామీలతో ముంచెత్తుతూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన తరహాలోనే ఈసారీ ప్రజలను వంచించడానికి సిద్ధమయ్యారని గ్రహించిన బీజేపీ.. మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదని టీడీపీ వర్గాలే చర్చించుకుంటుండటం గమనార్హం.
2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. గత 58 నెలల్లో నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. అవినీతికి తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.95,001 కోట్లు వ్యయం చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటిదాకా రూ.3,61,811 కోట్లు వ్యయం చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.72,362 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తుంటే.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి శ్రీలంకగా మార్చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడితే.. ఎల్లో మీడియా అదే పల్లవి అందుకుంది.
అదనంగా రూ.4,63,189 కోట్లు ఎలా తెస్తావ్ బాబూ?
టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్‌తోపాటు పేర్కొన్న ఇతర హామీల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరమని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే అదనంగా ఏటా రూ.92,638 కోట్లు అవసరం. ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లు అవసరం. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు ఐదేళ్లలో చేసిన వ్యయం కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎలా తెస్తావని ప్రశి్నస్తుంటే సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు తప్పించి స్పష్టంగా లెక్క చెప్పలేక తప్పించుకుంటున్నారు.
హైటెక్ సిటీలో, అమరావతిలో బినామీలకే సంపద సృష్టి
గతంలో సంపద సృష్టించానని, ఇప్పుడూ సంపద సృష్టించి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1995–2004 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మురళీమోహన్ వంటి బినామీలు, వందిమాగధులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత హైటెక్ సిటీ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసి బినామీలకు సంపద సృష్టించారు.
విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక.. విజయవాడ–గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసే చోటు గురించి బినామీలు, వందిమాగధులకు ముందుగా లీకులు ఇచ్చి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. వేలాది ఎకరాల భూములు తక్కువ ధరలకే కొల్లగొట్టారు. ఆ భూ సంపదను రెట్టింపు చేయడానికి రాజధానిగా అమరావతిని చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఖజానా నుంచి అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి.. బినామీలు, వందిమాగధులు కాజేసిన భూ సంపదను మరింతగా పెంచడానికి ఎత్తులు వేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజన తర్వాత రాష్ట్రాన్ని 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పాలించా రు. ఆ 14 ఏళ్లు.. ప్రతి ఏటా రెవెన్యూ లోటే. ఎడాపెడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి నెట్టిందీ చంద్రబాబే. 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్‌రేట్ (సీఏజీఆర్) 21.87 శాతం. కానీ.. సీఎం జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. దీన్ని బట్టి చంద్రబాబే ఎడాపెడా అప్పులు తెచ్చినట్లు స్పష్టమవుతోంది.
👉: అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు అధికారంలోకి రాక ముందు అంటే 2014 జూన్ 7 నాటికి రాష్ట్రానికి రూ.1,53,346 కోట్ల అప్పు ఉంటే.. 2019 మే 29 నాటికి అది రూ.4,12,288 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ అప్పులు రూ.7,03,471 కోట్లకు చేరాయి.
👉: సంపద సృష్టించానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ.. వాస్తవానికి చంద్రబాబు హయాం (2014–19)లో మూలధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు.
👉: జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది స్పష్టమవుతోంది.
👉: చంద్రబాబు హయాంలో జీఎస్‌డీపీలో పన్నుల భారం సగటున 6.57 శాతం ఉంటే.. జగన్ హయాంలో అది 6.35 శాతమే. అంటే.. సీఎం జగన్ హయాంలోనే పన్నుల భారం తక్కువ. ఇది ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా), కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చిన లెక్క.
అప్పుడు అమెరికా అవుతుందా?
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా.. అవసరమైన మేరకు తక్కువగా అప్పులు చేస్తూ.. ప్రజలపై తక్కువగా పన్నుల భారం మోపుతూ.. ఆరి్థక క్రమశిక్షణ పాటిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సీఎం జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయి. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలకు ఐదేళ్లలో రూ.8.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
నిధులు ఎలా తెస్తారో చెప్పండి
టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లు అవసరం. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే రూ.92,638 కోట్లు అదనంగా అవసరం. ఈ లెక్కన ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం. ఆ నిధులను ఎలా తెస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నానని చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment