సాక్షి అమలాపురం: ఓ వైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతారు..మరోవైపు తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు..ఇదీ బాబు మార్కు మిత్ర ధర్మం. రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల అధినేతలూ ప్రకటించారు. కానీ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకూ కొలిక్కి రాలేదు. అయినప్పటికీ టీడీపీ చేపట్టిన ‘రా.. కదలి రా’ సభల్లో మాత్రం తమపార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడం జనసేన నేతలకు, ఆశావహులకు మింగుడుపడడం లేదు.
డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా... కదలిరా..’ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంటరీ జనసేన ఇన్‌చార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. వాస్తవానికి సభలో టీడీపీ కార్యకర్తలకన్నా జన సైనికుల సందడే అధికంగా ఉంది. ఇంతమంది ఉన్న సభలో చంద్రబాబు.. మండపేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఆ సమయంలో జనసేన మండపేట ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణ అక్కడే ఉన్నారు. సభలో తమ అభ్యర్థి జోగేశ్వరరావు అని బాబు ప్రకటించడంతో లీలాకృష్ణతో పాటు జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. బాబు పక్కనే ఉన్న గంటి హరీష్‌ను మాత్రం పార్లమెంట్‌కు పంపాలని బాబు పిలుపునివ్వకపోవడం గమనార్హం.
ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు?
సీట్ల సర్దుబాటు ఖరారు కాకున్నా.. చంద్రబాబు ఏకపక్షంగా తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించడం చూసి, జనసేన ఆశావహులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఇలా ఏకపక్షంగా జోగేశ్వరరావును మళ్లీ గెలిపించండంటూ చంద్రబాబే పిలుపునివ్వడంపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా బాబు ప్రవర్తించడంతో టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలెవ్వరూ వెళ్లవద్దంటూ జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి లీలాకృష్ణ ఆదేశించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
లీలాకృష్ణ తానలా చెప్పలేదన్నా.. జనసేన అనుకూల సోషల్ మీడియాలో టీడీపీపై సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాలాచోట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు తమదే సీటు అంటూ ప్రచారం చేస్తుండడం కూడా జనసేన ఇన్‌చార్జిలకు మింగుడు పడడంలేదు. ‘మా పార్టీ అధినేత పొత్తుకు వెళ్లినట్టు లేదు.. కాళ్ల బేరానికి వెళ్లినట్టుంది’ అంటూ సగటు జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment