చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో

Published Thu, May 2 2024 9:46 AM

bjp say no to alliance manifesto for ap assembly elections

ఇప్పటికే జాతీయ స్థాయిలోమేనిఫెస్టో విడుదల చేశారని టీడీపీ కవరింగ్‌ 

ఇది ఉత్తి మాటేనని  తేల్చిన తమిళనాడు మేనిఫెస్టో 

2014లో రాష్ట్రం మేనిఫెస్టోలోనూ మోదీ ఫొటో 

పలు ఎన్నికల్లో రెండు మేనిఫెస్టోలు  ఇచ్చిన  బీజేపీ 

బాబు గత మోసం తెలిసే ఇలా చేశారని సర్వత్రా చర్చ

సాక్షి, అమరావతి:  దేశమంతటా ఎన్డీయే మిత్రపక్షాలుగా కొనసాగుతున్న వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ గుర్తుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో, బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం ఫొటో జత పరిచి ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు – పవన్‌కల్యాణ్‌లు అమలుకు సాధ్యం కాని ఆల్‌ ఫ్రీ హామీలు ఇస్తుండడంతో ఉమ్మడి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేనట్లు బీజేపీ వ్యవహరించిందని స్పష్టమవుతోంది. అందువల్లే మంగళవారం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోలో మోదీ, కమలం ఫొటోలు చోటుచేసుకోలేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనప్పటికీ.. లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఆ రాష్ట్రంలోని పీఎంకే, తమిళ్‌ మానిల కాంగ్రెస్‌ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ మానిల కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల వేరుగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ముఖచిత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించింది. పీఎంకే కూడా విడిగా  మేనిఫెస్టోను విడుదల చేయగా, దాని చివరి పేజీలో బీజేపీ గుర్తు కమలం సహా అన్ని మిత్రపక్ష పార్టీల గుర్తులను ముద్రించింది. 

ఇందుకు బీజేపీ కూడా అంగీకారం తెలిపింది. ఒక్క ఏపీలో మాత్రమే చంద్రబాబు, పవన్‌ల మేనిఫెస్టోపై తమ ముద్ర ఏదీ లేకుండా బీజేపీ జాగ్రత్త పడటం.. అసలు ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఇష్టపడక పోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

బాబు అల్‌ ఫ్రీ హామీలను నమ్మే పరిస్థితి లేదు 
పదేళ్ల కిత్రం 2014లో టీడీపీ–బీజేపీ–జనసేనలు ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు ఇచి్చన హామీలలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాదాపు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు అదే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మూడు పార్టీల పొత్తులో మళ్లీ అన్నీ అల్‌ ఫ్రీ హామీలనే ఇవ్వడంతో వాటి అమలులో సాధ్యాసాధ్యాలపై బీజేపీకి నమ్మకం కుదరలేదని తెలుస్తోంది. అందుకే పొత్తులో ఉన్నప్పటికీ ఉమ్మడి మేనిఫెస్టోకు దూరం జరిగింది. ‘గత వారం బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రాలలో పొత్తులో ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు మా మద్దతు ఉంటుంది’ అనే ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. 

అయితే బీజేపీ కేవలం కంటితుడుపుగా తమ మిత్రపక్షాలను సంతృపి పరచడం కోసమే ఈ వ్యాఖ్యలు చేసిందని పలువురు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు.. బీజేపీ జాతీయ స్థాయిలో ఎన్డీయే మేనిఫెస్టోను ప్రకటించినప్పటికీ, రాష్ట్ర పార్టీ వేరుగా మేనిఫెస్టోను విడుదల చేసింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఒక మేనిఫెస్టోను, సీమాంధ్రకు మరొక మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. 

2019 ఎన్నికల సమయంలోనూ బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను ప్రకటించినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో వేరుగా మరొక మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ పరంపరలో కేవలం చంద్రబాబు–పవన్‌ల మేనిఫెస్టోలోని హామీలపై నమ్మకం లేకే బీజేపీ ఢిల్లీ పెద్దలు జాతీయ మేనిఫెస్టోతో సరిపెట్టి, మద్దతు మాత్రమే ఇచ్చారని రాష్ట్ర బీజేపీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఈ అవమానకర విషయాన్ని ఎలా అధిగమించాలో తెలియక చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ తల పట్టుకుంది. 

Advertisement
Advertisement