
సాక్షి, గుంటూరు: వైఎస్సార్, వంగవీటి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని, కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరి సీఎం జగన్‌ని విమర్శించటం సరికాదని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
‘‘2014లో సీటు ఇస్తే రాధా ఓడిపోయారు. 2019లో వేరే సీటు ఇస్తానని సీఎం జగన్ చెప్తే కాదని పార్టీ మారారు. అంతకుముందు వరకు నా తండ్రిని చంపినది టీడీపీ వారే అని చెప్పారు. ఇప్పుడేమో మాట మార్చి మాట్లాడుతున్నారు. వంగవీటి రంగా త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు. రంగా ఆశయం టీడీపీ పతనం. కానీ రాధా మాత్రం అదే టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు రాజధాని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేయిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం ఉంటుందా?.
.. వైఎస్సార్‌సీపీకి చెందిన కాపు మహిళలపై కమ్మ నేతలు దాడి చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదు?. తెనాలిలో గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?. జనసేనలోని వీర మహిళలకు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు?. వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయాలి. జనసేనను చంద్రబాబుకు తాకట్టు పెట్టిన పవన్ కల్యాణ్‌ను గట్టిగా ప్రశ్నించాలి.

.. ధవళేశ్వరం బ్యారేజి కట్టించిన కాటన్ దొరని ప్రజలు ఇప్పటికీ పూజలు చేస్తున్నారు. మరి హైదరాబాద్‌ని కట్టించానని చెప్పుకునే చంద్రబాబును ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు?. ఎందుకంటే.. చంద్రబాబు పచ్చి మోసగాడు, అబద్దాల కోరు అని తెలుసు కాబట్టే. సీఎం జగన్ ప్రజలకు మేలు చేసినందునే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు’’ అని వంగవీటీ నరేంద్ర అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment