రైతుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది
భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. ప్రభుత్వమే రైతుల ప్రీమియాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ వానాకాలం పంటల సీజన్ నుంచే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన జారీచేశారు. తడిచిన ధాన్యాన్ని సైతం తమ ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు.
గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్‌ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని వివరించారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ జరిగిందనీ, ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్లు స్వస్తి చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
దీంతో ప్రతి కింటాపై రైతుకు రూ.150 నుంచి రూ.200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామని తెలిపారు. పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు చేరుతుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో 45 రోజులు పట్టేదని, దాంతో రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడని గుర్తు చేశారు.
భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్
తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు. రైతులు నాట్లేసుకునే సమయం దగ్గర పడిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీం వర్తింపచేస్తామని హామీనిచ్చారు.
రాష్ట్రంలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందనీ, పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతామనీ, లేకుంటే ఓట్లే అడగబోమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment