ప్రీమియం కంటే పరిహారం ఎక్కువైతే కంపెనీకి అదనపు చెల్లింపు
ఒకవేళ పరిహారం కంటే ప్రీమియం సొమ్ము ఎక్కువైతే సర్కారుకు కంపెనీ చెల్లింపు
కసరత్తు చేస్తున్న తెలంగాణ వ్యవసాయశాఖ
మధ్యప్రదేశ్‌లో అమలవుతున్న పథకంపై అధికారుల అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి కొత్త పద్ధతిని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రీమియం సొమ్ము కంటే పరిహారపు సొమ్ము రైతులకు ఎక్కువగా చెల్లించే పరిస్థితి నెలకొంటే, బీమా కంపెనీకి నష్టం రాకుండా నిర్ణీత మొత్తంలో ప్రభుత్వం చెల్లించాలని యోచిస్తోంది.
పరిహారపు సొమ్ము కంటే ప్రీమియం ఎక్కువెక్కువగా ఉంటే ముందనుకున్న లెక్క ప్రకారం నిర్ణీత మొత్తం ప్రభుత్వానికి కంపెనీ చెల్లించేలా, అటు వ్యవసాయ బీమా కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి ఏ మాత్రం నష్టం జరగకుండా ఈ పథకాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో ప్రీమియం ఎక్కువ చెల్లించగా, క్లెయిమ్స్ మాత్రం చాలా తక్కువగా ఉండేవి.
ఇలా కంపెనీలు తెలంగాణ నుంచి రూ. వందల కోట్ల లాభాలు పొందాయి. దీంతో గత ప్రభుత్వం ఈ పథకం నుంచి బయటకొచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొత్త పద్ధతి ప్రకారం అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి, మరోవైపు కంపెనీలకు కూడా నష్టం జరగకుండా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీమా పథకం అమలు
పంటల బీమా పథకంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ పద్ధతిలో పంటల బీమాను అమలు చేస్తున్న మధ్యప్రదేశ్‌ను అనుసరించాలని యోచి స్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో ఇటీవల వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి పర్యటించి.. అక్కడ అమలవుతున్న పంటల బీమాను అధ్యయనం చేశారు.
బీమా అమలు చేస్తున్న కంపెనీలతోనూ చర్చించారు. ఏఐ పరిజ్ఞానంతో పంట నష్టాన్ని అత్యంత సక్రమంగా అంచనా వేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మాన్యు వల్ పద్ధతిలో నష్టాన్ని అంచనా వేస్తుండగా, పారదర్శకంగా ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఒకవైపు మాన్యువల్‌గానూ... మరోవైపు ఏఐ ద్వారానూ పంటల నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం నష్టాన్ని అంచనా వేస్తే, నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు పరిహారం ఇస్తాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి.
సింగిల్ రైతుకూ పరిహారం ఇచ్చేలా...!
జీవిత బీమాలో వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం ఎలా వస్తుందో...పంట నష్టం జరిగిన సింగిల్ రైతుకు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే రైతు యూనిట్‌గా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారు. గతంలో అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్‌గా వివిధ రకాలుగా పంటలను బట్టి పథకం ఉండేది. అంతేగాక సంబంధిత యూనిట్‌లో ఉన్న వ్యవసాయ పంటల్లో 33 శాతం దెబ్బతింటేనే బీమా పథకం వచ్చేది.
అంటే వందెకరాలుంటే... 33 ఎకరాలు దెబ్బతింటేనే పథకం కింద రైతులకు పరిహారం అమలు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక ఎకరా, అరెకరా ఉన్న ఒక్క రైతుకు కూడా పరిహారం అందుతుంది. అయితే ఈ వెసులుబాటును అమలుచేయాలంటే బీమా కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు.
కాగా, రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటల బీమా చేయించేవారు. ఇప్పుడు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య 50 లక్షలు ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రీమియం కూడా రూ. 2,500 కోట్ల మేరకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు.
» ఓ ఉన్నతాధికారి లెక్క ప్రకారం ఉదాహరణకు ప్రభుత్వం రైతుల తరఫున బీమా కంపెనీకి కోటి రూపాయల ప్రీమియం చెల్లించిందనుకుందాం. ఒక సీజన్‌లో పంటల నష్టం వల్ల రైతులకు బీమా కంపెనీ రూ. 1.20 కోట్లు చెల్లిస్తే...కంపెనీకి రూ. 20 లక్షల నష్టం వచ్చినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వం రూ. 40 లక్షలు చెల్లించి... ఆ కంపెనీకి రూ. 20 లక్షలు లాభం జరిగేలా చూస్తుంది.
» అలా కాకుండా అదే కోటి ప్రీమియం ప్రకారం చూసుకుంటే... పంట నష్టం జరిగి రైతులకు కంపెనీ రూ. 60 లక్షలు చెల్లిస్తే... అప్పుడు ప్రభుత్వానికి రూ.40 లక్షలు నష్టం జరిగినట్టు లేదా అదనంగా కంపెనీకి 40 శాతం ఎక్కువ ప్రీమియం సొమ్ము చెల్లించినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వానికి అంతగా నష్టం జరగకుండా కంపెనీ రూ.20 లక్షలు ఇచ్చి కొంత వెసులుబాటు ఇస్తుంది. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment